స్వామికి స్వచ్ఛంగా..

ABN , First Publish Date - 2022-08-07T07:02:02+05:30 IST

ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలు, నైవేద్యాలకు ఇకనుంచి పురుగుమందులు వాడిన పంటలు నిలిపివేయనున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిన పంటను మాత్రమే వినియోగించనున్నారు.

స్వామికి స్వచ్ఛంగా..

  • ఆలయాల్లో సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలతో నైవేద్యాలు
  • రైతుసాధికార సంస్థ ద్వారా సరఫరాకు అంగీకారం
  • 13 రకాల దినుసులు 11 ప్రధానాలయాలకు అందజేయనున్న సంస్థ
  • దేవదాయశాఖ, వ్యవసాయశాఖ మంత్రులతో సమావేశంలో వెల్లడి
  • అన్నవరం ఆలయంలోను త్వరలో అమలుకు సన్నాహాలు

అన్నవరం, ఆగస్టు 6: ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలు, నైవేద్యాలకు ఇకనుంచి పురుగుమందులు వాడిన పంటలు నిలిపివేయనున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిన పంటను మాత్రమే వినియోగించనున్నారు. దేవాలయాల్లో స్వామివారికి సమర్పించే నైవేద్యాలను, భక్తులకు అందించే ప్రసాదాలను సహజ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులతో తయారు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2021 నుంచి తిరుమల వెంకన్నకు సహజసిద్ధమైన పద్ధతిలో పండించిన దినుసులనే నైవేద్యాలకు, ప్రసాదాలకు వినియోగిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తోందని గుర్తించి ప్రస్తుతానికి రాష్ట్రంలో 11 ప్రధాన దేవాలయాల్లోను ఇలా సహజసిద్ధమైన దినుసులతో తయారుచేసిన పంటతో నైవేద్యాలు వండి ఆయా ఆలయాల్లో ఉన్న దేవతామూర్తులకు నివేదనగా పెట్టాలని నిర్ణయించారు. ఇక మీద ఇది విస్తరించే అవకాశం ఉంది.

అన్నవరంలోను అమలుకు నిర్ణయం

కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సెక్రటరియట్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌శాఖా మంత్రి కాకాని గోవర్దనరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీకి సాధికార సంస్థ ఈ దినుసులు సరఫరా చేస్తుండగా నూతనంగా 11 ఆలయాలకు ఇదే సంస్థ ద్వారా అందించేందుకు సూత్రపాయంగా నిర్ణయించారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. దీనికిగాను 13రకాలైన ఆహారపదార్థాలైన బియ్యం, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, బెల్లం, పసుసుపొడి, వేరుశనగ పలుకులు, ఎండిమిర్చి, దనియాలు, మిరియాలు, ఆవాలు, గింజలు, ఫైబర్‌లేని చింతపండును రైతు సాధికారసంస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. అన్నవరం సత్యదేవుడికి ప్రతినిత్యం అందించే నైవేద్యాలను ఆంధ్రజ్యోతి పాఠకులకోసం..

అన్నవరంలో నివేదనలు ఇలా...

ఉదయం 6.30కి బాలభోగం

స్వామివారికి, ఇతర ఉపాలయాలకు ఉదయం 6.30కి బాలభోగం నివేదనగా పెడతారు. దద్దోజనం, విడిపొంగలి వీటిలో ఉంటుంది. వీటికి బియ్యం, మిరియాలు తదితర దినుసులను ఉపయోగించి సిద్ధం చేస్తారు.

ఉదయం 9గంటలకు అవసర నివేదన

ఈ అవసర నివేదనలో మినపప్పుతో తయారు చేసిన గారెలను ప్రధానాలయంలో మూలవరులకు నివేదిస్తుండగా యంత్రాలయం, ఇతర ఉపాలయాలకు చక్రపొంగలి, పులిహోరను నైవేద్యంగా ఉంచుతారు.

మధ్యాహ్నం 12గంటలకు మహానివేదన

ప్రధానాలయంలో మూలవరులకు, యంత్రాలయం, రామాలయం, వనదుర్గ, కనకదుర్గ ఆలయాలకు ఒకేరకమైన పదార్థాలను మహానివేదనగా పెడతారు. అన్నం, రెండురకాల కూరగాయల వంటకాలు, పప్పుపులుసు, పెరుగు మహానివేదనలో ఉంటాయి.

సాయంత్రం 6.30కి..

సాయంత్రం 6.30కి నేతితో తయారు చేసిన చిట్టిగారెలు, శనగలను ఆయా ఆలయాలకు నివేదనగా అందజేస్తారు.

రాత్రి 8.30కి క్షీరాన్నం..

ప్రతినిత్యం రాత్రి 8.30కి స్వామి, అమ్మవార్ల పవళింపుసేవకు ముందు క్షీరాన్నం నివేదించి పవళింపుసేవ చేపడతారు. ఇది కేవలం ప్రధానాలయంలో ఉండే మూలవిరాట్‌లకు మాత్రమే నివేదిస్తారు.

పర్వదినాల్లో ప్రత్యేక పదార్థాలతో నివేదన

పర్వదినాలు, శుక్రవారం, రోజుల్లో రవ్వకేసరిని నివేదనగా ఉపయోగిస్తారు. ఏకాదశి, మఖనక్షత్రం రోజున మైసూర్‌పాకం స్వామికి నివేదనగా పెడతారు. ఈ వంటకాలు అన్నింటిని వండేందుకు నివేదనశాల అని తూర్పురాజగోపురం ఆనుకుని ఉంటుంది. బ్రాహ్మణ వంటస్వాములు, మడి, శుచితో పరిశుభ్రంగా వీటిని తయారుచేస్తారు.

Updated Date - 2022-08-07T07:02:02+05:30 IST