సేవకు... వేళాయె!

ABN , First Publish Date - 2020-06-05T05:30:00+05:30 IST

కరోనా కారణంగా మార్చి నుంచి భక్తుల సందడి లేకుండా లాక్‌డౌన్‌లో ఉన్న దేవాలయాలు చాలావరకూ ఈ వారంలో తెరుచుకోనున్నాయి. నాలుగు గోడల మధ్యా నిత్యసేవలకు పరిమితమైపోయిన ఇలవేల్పులు భక్తులకు దర్శనం

సేవకు... వేళాయె!

కరోనా కారణంగా మార్చి నుంచి భక్తుల సందడి లేకుండా లాక్‌డౌన్‌లో ఉన్న దేవాలయాలు చాలావరకూ ఈ వారంలో తెరుచుకోనున్నాయి. నాలుగు గోడల మధ్యా నిత్యసేవలకు పరిమితమైపోయిన ఇలవేల్పులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దేశంలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే సన్నాహాలు మొదలైపోయాయి. 


శ్రీవారి దర్శనం... జాగ్రత్తగా!

దాదాపు 128 సంవత్సరాల తరువాత, లాక్‌డౌన్‌ వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు దూరమయింది. రెండువేల ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం... అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం... 1892లో రెండు రోజుల పాటు మూతపడింది. ఆ సమయంలో ఆలయాన్ని పూర్తిగా మూసేశారనీ, చివరికి అన్ని సేవలనూ నిలిపివేశారనీ టిటిడి రికార్డులు చెబుతున్నాయి. అయితే ఎందుకు మూతపడిందనే కారణం మాత్రం తెలీదు.


గ్రహణ సమయాల్లో తప్ప మరెప్పుడూ స్వామి వారి దర్శనాలూ, సేవలూ నిలిచిపోలేదు. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల తాజా సడలింపుల నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 8 నుంచి తెరవనున్నారు. అయితే, మొదటి మూడు రోజులూ ఆలయ ఉద్యోగులకూ, స్థానికులకే దర్శనాలు పరిమితం. జూన్‌ 11 నుంచీ... గంటకు 300 మంది చొప్పున, రోజూ 15 గంటలపాటు సాధారణ భక్తులను అనుమతించాలన్న ఆలోచన ఉంది. ఆ సమయంలో కూడా భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలూ తప్పనిసరిగా పాటిస్తారు. అయితే ఆర్జిత సేవలకు మాత్రం భక్తులకు అనుమతి ఉండదు. 


కాలినడకనే యాదాద్రికి...

తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆలయం కూడా జూన్‌ 8 నుంచి భక్తుల కోసం తెరుచుకుంటోంది. భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, గుట్టపైకి వాహనాలను అనుమతించరు. భక్తులు పైవరకూ నడిచి వెళ్ళి, స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. పదేళ్ళ లోపువారికీ, అరవై అయిదేళ్ళు పైబడినవారికీ ప్రవేశం ఉండదు. అలాగే సత్యనారాయణ వ్రతం, స్వామివారి కల్యాణ సేవలకు పరిమితంగానే భక్తులను అనుమతిస్తారు. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలో అనేక ప్రముఖ ఆలయాలూ, స్థానికంగా ఉన్న గుడులూ జూన్‌ 8 నుంచి భక్తులకు దర్శనాలు కల్పించడానికి సిద్ధమవుతున్నాయి.




చార్‌ధామ్‌ యాత్ర స్థానికులకే...

హిమాలయాల్లోని పవిత్రమైన నాలుగు ఆలయాల సందర్శనను ‘చార్‌ధామ్‌ యాత్ర’గా  వ్యవహరిస్తారు. ఇవి ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌లలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేసవిలో మొదలై, శీతకాలంలో ముగిసే ఈ యాత్రకు అన్ని ప్రాంతాల నుంచీ లక్షలాది భక్తులు తరిలివస్తారు. గత ఏడాది ముప్ఫై ఎనిమిది లక్షల మందికి పైగా ఈ ఆలయాలను దర్శించారు. ఈ ఏడాది ఈ యాత్రను జూన్‌ 8న ప్రారంభిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ప్రస్తుతానికి ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందినవారికి మాత్రమే ఈ యాత్ర పరిమితం. ఇతర రాష్ట్రాలవారిని అనుమతించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.




ఆయనకు ఏటేటా క్వారంటైన్‌!

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచడం గురించి ఇప్పుడు వింటున్నాం. కానీ ఏటా 15 రోజుల పాటు సాక్షాత్తూ దేవుడే క్వారంటైన్‌లో గడుపుతాడని తెలుసా? ఒడిశాలోని పూరీలో ఏటా జ్యేష్ఠ పౌర్ణమి (తెలుగునాట ఏరువాక పున్నమి- ఈ శుక్రవారం) రోజున జగన్నాథుడికీ, ఆయన సోదరుడు బలభద్రుడికీ, సోదరి సుభద్రకూ అభిషేకం నిర్వహిస్తారు. దీన్ని ‘స్నాన యాత్ర’ అంటారు. ఈ స్నానాలతో స్వామివారికి జ్వరం వస్తుంది! దీంతో ఆయనను  గర్భాలయంలో ఉంచి, 15 రోజులపాటు మూసేస్తారు.


ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు పూజాదికాలు జరిపి, భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అదే ‘నవయవ్వన దర్శనం’. ఆ మర్నాడు జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా, జగన్నాథుడి దర్శనాలు జూలై 5వ తేదీ వరకూ ఉండవు. ఈ నెల 23న రథయాత్రకు సన్నాహాలు చేస్తున్నా, భక్తులకు అనుమతిపై నిర్ణయం తీసుకోలేదు.


డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలివీ...

దేశంలో అన్ని మతాల ఆధ్యాత్మిక మందిరాలనూ జూన్‌ 8 నుంచి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.ఓ.) ఇచ్చిన మార్గదర్శకాలు.

  1. మందిరాలను తరచుగా శానిటైజ్‌ చెయ్యాలి.
  2. భక్తులు తగిన దూరం పాటించేలా చూడాలి.
  3. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించే ఏర్పాట్లు ఉండాలి.
  4. చేతులు శుభ్రపరుచుకొనే సౌకర్యాలు ఉండాలి.
  5. డిస్పోజబుల్‌ టిష్యూలనూ, వ్యర్థాలు పడేసే తొట్టెలనూ ఏర్పాటు చేయాలి.
  6. భక్తులు పరస్పర జాగ్రత్తలు పాటించాలి.
  7. ప్రార్థనామందిరాల తలుపు గడియలు, లైట్ల స్విచ్చులూ, మార్గాల్లో, మెట్ల వద్ద ఉండే రెయిలింగ్‌లను డిటర్జెంట్లతో తరచూ శుభ్రపరచి, క్రిమిరహితం చెయ్యాలి.

Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST