నారాయణ ఏమిది..?

ABN , First Publish Date - 2022-05-19T05:54:47+05:30 IST

ఆలయాలకు దాతలు ఉదార స్వభావంతో విరాళంగా ఇచ్చిన భూములు క్రమేపీ అన్యాక్రాంతమవుతున్నాయి. భూములపై వచ్చే ఆదాయాన్ని దేవుని పూజలు, దీప, ధూప నైవేద్యాలకు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అలా జరగడంలేదు.

నారాయణ ఏమిది..?
నీలకంఠేశ్వరస్వామి ఆలయం పక్కన ముక్తికా సరస్సులో మోటారు ద్వారా నీరు నింపుతున్న దృశ్యం

  • సర్పవరం భావనారాయణస్వామి ఆలయానికి చెందిన ముక్తికా సరస్సులో అనధికారికంగా చేపలు పెంపకం
  • భక్తుల పుణ్యస్నానాలు చేసేదెక్కడ?
  • ఏటా లక్షలాది రూపాయల దోపిడీ 
  • కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోని అధికారులు

సర్పవరం జంక్షన్‌, మే 18: ఆలయాలకు దాతలు ఉదార స్వభావంతో విరాళంగా ఇచ్చిన భూములు క్రమేపీ అన్యాక్రాంతమవుతున్నాయి. భూములపై వచ్చే ఆదాయాన్ని దేవుని పూజలు, దీప, ధూప నైవేద్యాలకు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అలా జరగడంలేదు. ఆలయ ఆస్తులు, ఆదాయం పరుల పాలు కాకుండా అడ్డుకోవాల్సిన అధికారులు దేవుడి భూమి, ఆదాయమే కదా.. మాదేం పోయిందనే చందాన చోద్యం చూస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు పరుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీనివల్ల స్వామివారి ఆదాయానికి గండిపడుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముక్తికా సరస్సులో కొన్నేళ్లుగా అనధికారికంగా చేపలు పెంపకం యథేచ్ఛగా సాగుతున్నా కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ముక్తికా సరస్సులో చేపల పెంపకం ప్రక్రియను నిలుపుదల చేయించి మనోభావాలు కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

భక్తుల పుణ్యస్నానాలకే వినియోగించాలి

శ్రీభావనారాయణస్వామికి చెందిన రెండెకరాల చెరువు నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద ఉంది. ఈ భూమి రెవెన్యూ సర్వే రికార్డుల్లో సర్వే నెంబరు 35లో రెండెకరాల భూమి ముక్తికా సరస్సుగా నమోదై ఉంది. భావనారాయణస్వామి ఆలయం ఎదురుగా నారదగుండం సర్వే నెంబరు 130/37లో 1.53 ఎకరాల్లో సరస్సు ఉంది. శ్రీభావనారాయణస్వామి, నీలకంఠేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముందుగా నారదగుండం, ముక్తికా సరస్సులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ వస్తోంది. ముక్తికా సరస్సు, నారద సరస్సులు కేవలం భక్తులు స్నానాలు ఆచరించేందుకు మాత్రమే చెరువులను వినియోగించాల్సి ఉంది. 

అనధికారికంగా చేపల పెంపకం

దేవదాయ, ధర్మదాయశాఖ అధికారు ల ఉదాశీన వైఖరి కారణంగా ముక్తికా సరస్సులో చేపల పెంపకాలు, విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. చెరువుల నిర్వాహకులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా చేపల పెంచుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ చెరువులో చేపల పెంపకంపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే చేప లు పెంచకుండా నిలుపుదల చేశారని, వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అధి కారుల మద్దతుతో చెరువులో చేపపిల్లలు వేయడం, చేపలు పట్టడం జరుగుతున్నాయి. ఇటీవల ముక్తికా సరస్సులో చేపలు పట్టి, లక్షలాది రూపాయలకు విక్రయించారని, వచ్చిన సొమ్ములను ప్రైవేట్‌ వ్యక్తులు జేబులు నింపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నీలకంఠేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలోనే చేపలు పట్టుబడి చేయడం, విక్రయించడం చేశారన్నారు. చేపల వాసన తాళలేక స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ముక్తికా సరస్సు, నారద గుండం సరస్సు లు భక్తులు ఫుణ్యస్నానాలు ఆచరించేందుకు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ రెండు చెరువుల్లో చేపల పెంపకానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లే దని, ముక్తికా సరస్సులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలు పెంచుతున్నారని ఆరోపించారు. రెండురోజులుగా చెరువులో చేప పిల్లలు పెంచేందుకు అవసరమైన నీటిని బోరుతో చెరువులో పెడుతున్నా నిలువరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ విష యమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపించారు. ముక్తికా సరస్సులో చేపలు పెంచకుండా దేవదాయ, ధర్మదాయ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-05-19T05:54:47+05:30 IST