Kuwait లోని ఆ కేటగిరీ వలసదారులకు తాత్కాలిక ఉపశమనం..

ABN , First Publish Date - 2021-12-11T14:22:03+05:30 IST

కువైత్‌లోని 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.

Kuwait లోని ఆ కేటగిరీ వలసదారులకు తాత్కాలిక ఉపశమనం..

కువైత్ సిటీ: కువైత్‌లోని 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేటగిరీ వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీ విషయమై గందరగోళం నడుస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, అంతర్గత మంత్రిత్వశాఖ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంకా సయమం పట్టే అవకాశం ఉండడంతో తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన వలసదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగిచింది. అలాంటి వారికి మూడు నెలల పాటు వర్క్ పర్మిట్ల గడువు పెంచింది. మానవతధృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, ఇది కేవలం తాత్కాలికం మాత్రమేనని పేర్కొంది. ఇలా గడువు పొందిన ప్రవాసులు కువైత్ వదిలి వెళ్తే వారి రెసిడెన్సీ పర్మిట్లు వెంటనే క్యాన్సిల్ అవుతాయని తెలియజేసింది. 


ఇదిలాఉంటే.. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కువైత్ ఇటీవల వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేటగిరీ వలసదారుల వర్క్ పర్మిట్లు ఇకపై యధావిధిగా రెన్యూవల్ కానున్నాయి. 14 నెలల క్రితం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని ఆపేయాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడాన్ని నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వెల్లడించింది. దాంతో కువైత్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇక 4.6 మిలియన్‌గా ఉన్న కువైత్ జనాభాలో 3.4 మిలియన్ల మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 80వేల మంది ప్రవాసులకు యూనివర్శిటీ డిగ్రీలు లేవని సమాచారం. 


Updated Date - 2021-12-11T14:22:03+05:30 IST