అమరావతి రైతులకు మద్దతు తెలిపిన తెలుగుదేశం ఆస్ట్రేలియా సభ్యులు!

ABN , First Publish Date - 2020-07-06T02:44:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గత 200 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న వి

అమరావతి రైతులకు మద్దతు తెలిపిన తెలుగుదేశం ఆస్ట్రేలియా సభ్యులు!

సిడ్నీ: ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గత 200 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమానికి నైతిక మద్దతు తెలుపుతూ సిడ్నీలో తెలుగుదేశం ఆస్ట్రేలియా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు కోడూరి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో, రాజధాని కోసం 29,757 మంది రైతులు 35,215 ఎకరాలను త్యాగం చేశారన్నారు. అయితే స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం మాత్రం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కనీ వినీ ఎరుగని రీతిలో, వివాద రహితంగా భూసేకరణ చేసిన గత ప్రభుత్వ ఘనతను చెరిపేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చిందని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన "ప్రశ్నిచే హక్కు"ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్నా.. సొంత రాష్ట్రం కష్టాల్లో ఉంటే.. అండగా ఉంటామన్నారు. కాగా.. ఒక రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దిగ్విజయం చేసిన తెలుగుదేశం ఆస్ట్రేలియా సభ్యులకు, కార్యవర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 


Updated Date - 2020-07-06T02:44:58+05:30 IST