అంచనాలు కుదిస్తే కిక్కురుమనరేం?

ABN , First Publish Date - 2020-12-03T08:43:40+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఈ 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లో కేవలం రెండు శాతమే చేసిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు.

అంచనాలు కుదిస్తే కిక్కురుమనరేం?

22 మంది ఎంపీలను ఇచ్చినా నోరెత్తరేం?

మేం కేంద్రాన్ని మెప్పించి ఒప్పించాం

కేంద్రం డబ్బులిచ్చి కట్టిస్తుంటే మీ తండ్రి విగ్రహం పెట్టుకోవడం ఏమిటి?

అసెంబ్లీ లోపల, వెలుపల చంద్రబాబు ఫైర్‌


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఈ 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లో కేవలం రెండు శాతమే చేసిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆ ప్రాజెక్టు గురించి ఆ పార్టీకి మాట్లాడటానికి ఏం నైతిక హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు కుదిస్తున్నామని కేంద్రం లేఖ పంపితే గట్టిగా ప్రశ్నించాల్సింది పోయి.. కిక్కురుమనడం లేదని, ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చినా కూడా ఎందుకు నోరు తెరవలేకపోతున్నారని నిలదీశారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన.. సాయంత్రం తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని మెప్పించి ఒప్పించాం. భూ సేకరణ, పునరావాస ఖర్చు కూడా కేంద్రం భరిస్తుందని మంత్రులతో ప్రకటింపజేశాం. ఆ మేరకు అంచనాలు పెంచడానికి అంగీకరింపచేశాం. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని మీరు పనికిమాలిన ఆరోపణలు చేసి అంచనాలపై కేంద్రం పునరాలోచనలో పడేలా చేశారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేంద్రంతో మాట్లాడి ఒప్పించాలి. అది మీ బాధ్యత. మేం మా హయాంలో పోలవరం ప్రాజెక్టును 71 శాతం నిర్మించాం. అదీ మా దమ్ము. దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఇంత వేగంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు ఇదొకటే.


రాష్ట్రానికి ఇస్తేనే దీని నిర్మాణం వేగంగా జరుగుతుందని నీతి ఆయోగ్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి మరీ ఇప్పించింది. ఆ నమ్మకాన్ని మేం నిలబెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు 80 ఏళ్ల  కల. దీనికి మొదట ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి చేశారు. ఆయన హయాంలో డబ్బులు మిగిలే మట్టి పనికి సంబంధించి కాల్వల తవ్వకం మాత్రం చేశారు. తట్టెడు సిమెంటు పని కూడా చేయలేదు. అవన్నీ మేం చేశాం. ఇంకా డబ్బులు పిండుకోవాలని అప్పట్లో ఉన్న కాంట్రాక్టరును బలవంతంగా తీసేశారు. దానిపై కోర్టు కేసులు తేలి కొత్త కాంట్రాక్టరును ఎంపిక చేసేసరికి 2013 వచ్చింది. మేం వచ్చాక ఆ కాంట్రాక్టరుతో పని వేగంగా  సాగడం లేదని కేంద్రానికి చెప్పి వారి అనుమతితో మరొకరికి అప్పగించాం. వీళ్లు వచ్చిన తర్వాత కేంద్రానికి ఏ సమాచారమూ లేకుండా.. ఉన్న కాంట్రాక్టరును పీకేసి కొత్తవాళ్లకు ఇచ్చారు. మేం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయిస్తే... ఆ కాంట్రాక్టరుపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చేశారు. మళ్లీ అదే కాంట్రాక్టరుకు పోలవరం పని అప్పగించారు. మరి ఆ అవినీతి ఎటుపోయింది? దీనిపై నోరు మెదపరు’ అని విరుచుకుపడ్డారు. పట్టిసీమ, పోలవరం నిర్మాణాలపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన జగన్‌..  ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..


నాడు కేంద్రం అంగీకరించింది.. 

2017లో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులో పునరావాసం సహా ఇరిగేషన్‌ భాగమంతా భరించడానికి అంగీకరించారు. పోలవరం నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో చెప్పడానికి సమాధానం లేక వైసీపీ నేతలు పాత కాగితాలు పట్టుకొని ఫేక్‌ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాసిన లేఖపై కూడా ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు స్వయంగా లేఖ రాసి మరీ ఆ ప్రాజెక్టును రాష్ట్రానికే ఇవ్వాలని సిఫారసు చేశారు. అది కూడా కేంద్రం, పీపీఏ పర్యవేక్షణలోనే పనులు జరిగేలాగానే. ఆ మేరకు పనులు శరవేగంగా చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టును నాశ నం చేస్తోంది. మీ చేతగానితనం వల్ల మళ్ళీ అంచనాలు కుదించే పరిస్థితి  ఏర్పడింది. మీ వైఫల్యాలకు బాధ్యత మాది కాదు. 


సభలో వాగ్యుద్ధం..

పోలవరంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడేటప్పుడు అధికా ర పక్ష సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుంటే సభ వదిలి వెళ్లిపోతామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో సీఎం వచ్చి ప్రసంగం ప్రారంభించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. సభాపతి వారిలో కొందరిని సస్పెండ్‌ చేశారు. దీంతో టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయాక సీఎం తన ప్రసంగం కొనసాగించారు.


గాలి ముఖ్యమంత్రి.. గాలి కబుర్లు 

‘పని చేసి చూపించలేక వైసీపీ నేతలు సొల్లు చెబుతున్నారు. గాలి ముఖ్యమంత్రి గాలి కబుర్లు చెప్పడానికి మాత్రమే పనికొస్తారు. వైఎస్‌ ఏదో మొత్తం చేసేసినట్లు చెబుతున్నారు. లక్షా ఐదు వే ల ఎకరాలు సేకరించాల్సి ఉంటే వైఎస్‌ హయాం లో కేవలం 15 వేల ఎకరాలు సేకరించారు. పునరావాసం కింద కేవలం 300 ఇళ్లు కట్టారు. వైఎస్‌ ప్రాజెక్టుపై రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలే దు. తర్వాత కాంగ్రెస్‌ సీఎంలు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. విభజన సమయంలో ముంపు మండలాలు ఏడింటిని రాష్ట్రంలో చేర్చలేదు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఢిల్లీకి వెళ్ళి వాటిని కలిపించాను. లేకపోతే పోలవరం కలగా మిగిలేది. అసెంబ్లీలో గొంతు చించుకుని ఉపన్యాసాలు చెబుతున్నవారు పోలవరం ప్రాజెక్టు చూడడానికి సీపీఐ వారిని ఎందుకు ఆపారు? అక్కడ జరిగిన పనులు లేవు. అది బయటపడుతుందని భయం. పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం డబ్బులు ఇచ్చి కట్టిస్తుంటే దాని వద్ద వైఎస్‌ విగ్రహం పెట్టడం ఏమిటి? విగ్రహాలు మీ రు పెట్టుకుంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలని కేంద్రం ప్రశ్నిస్తే ఏం చెబుతారు? వైఎస్‌ సహా నా కంటే ముందున్న సీఎంలెవరూ సైట్‌ క్లియరెన్స్‌ కూడా చేయలేకపోయారు. నేను రూ.600 కోట్లు ఇచ్చి అక్కడ ఉన్న గ్రామాల వారిని తరలించి డ్యాం పనులు ప్రారంభమయ్యేలా చేశాను.


ప్రతి సోమవారం పోలవారంగా ప్రకటించి సమీక్షలు చేశాను. మన వద్ద డబ్బులు ఉంటే భూ సేకరణ, పునరావాసం కూడా అయ్యేవి. వైసీపీ నేతలు ఎన్ని తిట్టినా వాస్తవాలు మారవు. మేం అడిగే ప్రశ్న ఒకటే. భూ సేకరణ, పునరావాసం ఎప్పటికి పూర్తిచేస్తారు? పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? అంచనాలు పెంచడానికి కేంద్రం ఒప్పుకొందా? దీనికి సమాధానాలు చెప్పండి. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్‌ అంగీకరించాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడ అసెంబ్లీలో చెబితే దానిని కనీసం ఖండించారా? అసెంబ్లీలో ఇవన్నీ అడుగుతానని నాకు మైక్‌ ఇవ్వరు. 25-30 మంది అధికార పక్షం వారికి మైక్‌ ఇచ్చి నన్ను తిట్టిస్తారు. స్పీకర్‌ ప్రవర్తన కూడా అనుచితంగా ఉంది. 

Updated Date - 2020-12-03T08:43:40+05:30 IST