Abn logo
Sep 28 2021 @ 02:45AM

అక్కడ మద్దతు.. ఇక్కడ బంద్‌

  • సాగు బిల్లులపై జగన్‌రెడ్డి ద్వంద్వ వైఖరి
  • వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు
  • 30న ‘రైతు కోసం’లో బలంగా నిలదీద్దాం
  • రాయలసీమ ప్రాజెక్టులకు జగన్‌ ద్రోహం
  • నిరసనగా 6న హిందూపురంలో సమావేశం
  • డీజీపీ ‘డ్రగ్స్‌’ వాస్తవాలు దాస్తున్నారు
  • రూ.2 లక్షల కోట్ల మాదకద్రవ్యాల చలామణి!
  • తాడేపల్లి ఆదేశాలతో చిన్నదిగా చూపుతున్నారు
  • ఉదయభాను కుమారుడికి పరీక్షలేవీ?
  • టీడీపీ వ్యూహరచన కమిటీ ఆగ్రహం


అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతుల గొంతు కోసే వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో మద్దతిచ్చిన వైసీపీ.. ఇప్పుడు సిగ్గు లేకుండా రైతు సంఘాల భారత్‌ బంద్‌కు మద్దతు పలికిందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ద్వంద్వ వైఖరి దీనితో బయట పడిందని విమర్శించింది. మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆ పార్టీ వ్యూహ రచన కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తన చర్యలతో సంక్షోభంలోకి నెట్టిందని, ఈ నెల 30వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిర్వహించే ‘రైతు కోసం’ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ఎత్తిచూపాలని నిర్ణయించింది.


గులాబ్‌ తుఫానులో నష్టపోయిన రైతులు, నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం తక్షణ ప్రాతిపదికన ఆదుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేసింది. రాయలసీమలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ దెబ్బ తింటే ఇప్పటివరకూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలే జరపలేదని ఆక్షేపించింది. ప్రభుత్వ వైఫల్యంపై పోరాడాలని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ అక్టోబరు 6న హిందూపురంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని నిశ్చయించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారంలో అసలు వాస్తవాలను డీజీపీ దాచిపెడుతున్నారని దుయ్యబట్టింది. ‘వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను దిగుమతిచేసుకున్న ఏజెన్సీ ఆషి ట్రేడింగ్‌ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడలో ఉందని, ఇక్కడ దాని కార్యకలాపాలు ఏమీలేవని డీజీపీ ముందే చెప్పేస్తున్నారు. ఈ కంపెనీ జూన్‌ వరకూ తొమ్మిది సార్లు జీఎస్టీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసింది నిజం కాదా? కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఆంధ్ర సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది నిజం కా దా? రూ.2 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ను మాఫియా చలామణి చేసింది. ఆంధ్రాను మాఫియాకు అడ్డాగా మార్చారు.’ అని విమర్శించింది.


ప్రశ్నించే గొంతులను అణచడానికే..

ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు అసెంబ్లీలో మైక్‌ ఇవ్వకూడదని నిర్ణయించారని వ్యూహరచన కమిటీ ధ్వజమెత్తింది. విష జ్వరాల బారిన పడి ప్రజలు సతమతమవుతుంటే నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ‘రేషన్‌ కార్డుల అక్రమంగా తొలగించే పని మొదలుపెట్టారు. దీనిని అడ్డుకుంటాం. ఉపాధి హామీ పఽథకం కింద ఇంకా చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిల చెల్లింపు కోసం పోరాడదాం’ అని సమావేశం నిర్ణయించింది.