తెలుగదేల యన్న....

ABN , First Publish Date - 2021-08-28T06:02:41+05:30 IST

‘‘...షుమారు రెండు కోట్ల తెలుగువాళ్లున్నారు. మన దేశంలో నూటికి పది మంది కంటె సంతకం చేయగలవాళ్లు లేరు. ఆ పదిమందిలో చదివేవాళ్లు బహుకొద్ది మంది. అందులో సాహిత్య గ్రంథాలు అర్థం చేసుకోగలవాళ్లు ఎందరుంటారు...

తెలుగదేల యన్న....

‘‘...షుమారు రెండు కోట్ల తెలుగువాళ్లున్నారు. మన దేశంలో నూటికి పది మంది కంటె సంతకం చేయగలవాళ్లు లేరు. ఆ పదిమందిలో చదివేవాళ్లు బహుకొద్ది మంది. అందులో సాహిత్య గ్రంథాలు అర్థం చేసుకోగలవాళ్లు ఎందరుంటారు? చదవలేని వాళ్ల నందరినీ చదవగలిగేట్లు చేయడం మన పని. ఇంతమందికీ వ్యవహారానికి అవసరమైన చదువు చదివేట్లు చేయడానికి ఏ భాషలో పుస్తకాలు వ్రాయవలె?’’– ‘నేటి సాహిత్యం’ అనే శీర్షికతో 1937లో గిడుగు వెంకట రామమూర్తి రాసిన వ్యాసంలోని వాక్యాలవి. వ్యావహారిక భాషావాదాన్ని తలకెత్తుకుని, ఛాందస భాషావాదులతో తలపడిన యోధుడిగా గిడుగుని గుర్తిస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే ఆయన కృషి భాషా సాహిత్య రంగాలకు సంబంధించినదన్న పొరపాటు అవగాహనలోకి వెళ్లడం కూడా తరచు చూస్తాం. పై ఉటంకింపులో చూసినట్టు, గిడుగు ఆందోళన, పట్టింపు అందరినీ చదవగలిగేట్లు చేయడం మీద. అందుకు అనువుగా భాషావినియోగంలో జరగవలసిన సంస్కరణ మీద. సార్వత్రక విద్య పుంజుకుంటున్న వేళ, సాంప్రదాయ విద్యలో ఉండిన రెండు మూడు అంశాల స్థానంలో విస్తృతమైన బోధనాంశాలు ప్రవేశించిన సమయంలో చదువుకోవడంలో మాధ్యమభాష పాత్ర ఎంతో ఉంటుంది. తాను కుటుంబంలోనో, పరిసరాల్లోనో అలవరచుకున్న భాషకు, చదువు ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేసే భాషకు ఎంత తక్కువ ఎడం ఉంటే అంత మంచిది. కానీ, ఛాందస పండితులు పాఠ్యాంశాలను, వాటి భాషను నిర్ణయించే కీలక అధికార స్థానాలలో ఉంటూ, వాడుక భాషను అడ్డుకోసాగారు. సంప్రదాయ కావ్యభాష అంగీకరించే శుద్ధరూపాలనే ఆధునిక భాషలో కూడా ఉపయోగించాలని, పదరూపాలలో కానీ, వాక్యనిర్మాణంలో కానీ ఆధునిక వ్యవహారానికి తగిన మార్పులను లిఖిత భాషలో చేయరాదని ఆ పండితులు పట్టుబడుతూ వచ్చారు. వారితో తన పోరాటాన్ని ధిక్కారయుగ లక్షణంగా గిడుగు చూశారు. ప్రతి మార్పుకు ప్రతిఘటన ఉంటుందన్న అవగాహనతో నిలకడగా తన ప్రయత్నాలను కొనసాగించారు. 


గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ పేరుతో మనం మాట్లాడుకుంటున్న విషయాలేమిటి? నిర్వహిస్తున్న కార్యక్రమాలేమిటి? గిడుగు స్ఫూర్తి మన చర్చల్లో లేశమైనా కనిపిస్తోందా? భాష విషయంలో ఉద్వేగపూరిత అంశంగానో, దానినొక దేవతగానో తల్లిగానో మనకు వెలుపల ఉండే ఆరాధనీయ భావనగానో చూస్తున్నాము. ఇంగ్లీషు మీడియం చదువులని, తెలుగు సరిగా ఉచ్చరించలేని టెలివిజన్ యాంకర్లను, ఎక్కడ కలిసినా పరభాషలో మాట్లాడుకునే తెలుగువారి దౌర్బల్యాన్ని, తెలుగు మీడియం చదువులను చంపేస్తున్న ప్రభుత్వాల దుర్మార్గాన్ని విమర్శించుకుని దాన్నే గిడుగు స్మరణ అనుకుంటున్నాము. వాటికి తోడు పంచెలు లాల్చీలు కట్టుకుని, వీలయితే తలపాగాలు కూడా చుట్టుకుని, ప్రయత్నించి అచ్చతెనుగు మాటలు మాట్లాడి, భాషాసమస్యను ప్రహసన ప్రాయం కూడా చేస్తున్నాము. గిడుగు రామమూర్తి ఉద్యమంలోను, హృదయంలోను ఉన్న ప్రధాన అంశం తెలుగు సమాజానికి చెందిన సమస్య. విద్యావ్యాప్తి సమాజాభివృద్ధికి కీలకం కాబట్టి, బోధన జరిగే భాష ప్రజాస్వామ్యీకరణ జరగాలని ఆయన ఆశించారు. సకల శాస్త్రాలూ తెలుగులో రావాలని కోరుకున్నారు. మనం జరిపే ఆనవాయితీ ఉత్సవాలు ఆ లక్ష్యంతోనే ఉంటున్నాయా? ఆ లక్ష్య సాధనను కోరుకుంటున్నాయా? 


తెలుగుకు ఓట్లు లేవు. ఇంగ్లీషు మాధ్యమానికే ఓట్లు ఉన్నాయి. కాబట్టి, చదువు ఆసాంతం తెలుగు మాధ్యమంలో జరగాలని కోరుకోవడంలో వాస్తవిక దృష్టి లేదు. మహా అయితే, ప్రాథమిక తరగతులైనా మాతృభాషలో నడవనీయండి అని అడగగలం. కనీసం తెలుగు అక్షరాలు నేర్పించండి చాలు అని ప్రాధేయపడగలం. ఉపాధి భాష ఇంగ్లీషే అన్న దృష్టితో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ విద్యారంగంలో కూడా ప్రవేశపెడుతున్నారు. పాఠశాల చదువులకు ఆలంబన కాలేని కుటుంబనేపథ్యాలు, సాంస్కృతిక అంతరాలు, ఇంగ్లీషులో బోధించగల ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను పట్టించుకోకుండా చేసే విధాన నిర్ణయాల వల్ల ఫలితాలు ఎట్లా ఉంటాయో మున్ముందు తెలిసివస్తుంది. కానీ, మాధ్యమాలు అన్నవి సమస్య కాదు. మునుపు కూడా సంస్కృతం, పర్షియన్, ఉర్దూ మొదలైన భాషలు పాలకభాషలుగా మాధ్యమ భాషలుగా ఉన్నాయి. బడిచదువులకు వెలుపల కూడా చదువులుంటాయి, భాష ఉంటుంది. తెలుగు భాషను వినియోగించే అనేక రంగాలుంటాయి. గిడుగు కాలం కంటె మించి, ఇప్పుడు భాషా వినియోగరంగాలు పెరిగాయి. పత్రికలు, సినిమాలు, సినిమా వంటి అనేక ఇతర దృశ్యప్రదర్శన రూపాలు, సినిమా, సినిమాయేతర గీతాలు, కాల్పనిక కాల్పనికేతర సాహిత్యాలు.. ఇవన్నీ భాషాసమాజానికి అవసరమైనవి. తెలుగు సమాజ వైజ్ఞానిక, వినోద, భావోద్వేగ అవసరాలు భాష ద్వారానే నెరవేరవలసి ఉన్నది. తెలుగు ద్వారానే తెలుగు వినియోగదారులను చేరగలమని కార్పొరేట్ వ్యాపార సంస్థలు కూడా గుర్తిస్తున్నాయి. రాజకీయవాది తన ప్రభావాన్ని వేయడానికి ప్రయత్నిస్తున్నదీ తెలుగు ద్వారానే. కాబట్టి, తెలుగు బతుకుతుంది. దాని మనుగడకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. 


మరి తెలుగుకి ఏమి కావాలి? తెలుగు ప్రాచీనమైనదనీ, తియ్యటిదనీ, పుల్లటిదనీ, అందమైనదనీ పరవశించిపోవడం మానేయాలి. తెలుగును ఆధునిక భాష ఎట్లా చేయాలో ఆలోచించాలి. గిడుగు సహా వాడుక భాష ఉద్యమకారులు ఎవరూ, కవిత్వంలో వినియోగించే భాష గురించి పోట్లాడలేదని గమనించాలి. వారు గత కాలంలో నామమాత్రంగా మాత్రమే ఉంటూ, ఆధునిక కాలంలో అనివార్య అవసరంగా ముందుకు వచ్చిన వచనరచనలో వాడుక భాష కోసం తమ దృష్టి కేంద్రీకరించారు. వచనంలోనే సమస్త శాస్త్రవిజ్ఞానమూ ఉంటుంది, బౌద్ధిక చర్చలూ జరుగుతాయి. దురదృష్టవశాత్తూ, తెలుగు సామర్థ్యాన్ని పెంచడంలో గిడుగు అనంతర సమాజాలు విఫలమయ్యాయి. ప్రభుత్వాలు దారుణమైన విస్మరణను అలక్ష్యాన్ని ప్రదర్శించాయి. ఇంగ్లీషుతో అనువదనీయత ఆధునిక భాషగా తెలుగుకి అవసరం. ఆధునిక వైజ్ఞానిక, తాత్విక భావనలకు కావలసిన పదజాలాన్ని అందించవలసిన బాధ్యత భాష రంగంలో పనిచేసే సంస్థలదీ, విశ్వవిద్యాలయాలదీ. ప్రభుత్వాలు మాత్రమే పెద్ద పెట్టుబడులు పెట్టి, భాష సామర్థ్యాన్ని క్రోడీకరించే, ఉన్నతీకరించే వ్యవస్థలను, నిఘంటువుల వంటి ప్రాథమిక వనరులను నిర్మించగలవు. కానీ, ఏ పాలకుడికి పట్టింది తెలుగు? ఒక పద్యం వల్లించి తెలుగు ప్రేమికులమవుదామని ఒకరు ప్రయత్నిస్తే, తెలుగు సంస్కృత అకాడమీలను కలిపేసి పరిహసించడానికి మరొకరు ప్రయత్నించారు. సాహిత్య అకాడమీ పదవిని కూడా రాజకీయ పదవి చేసిన ఘనత ఒకరిదైతే, ఏళ్లకు ఏళ్లు భాషాసాహిత్య సంస్థల పదవులను పడావు పెట్టిన కీర్తి మరొకరిది.


తెలుగు భక్తిని పక్కనపెట్టి, తెలుగు శక్తిని తీర్చిదిద్దే ప్రయత్నం మొదలుకావాలి.

Updated Date - 2021-08-28T06:02:41+05:30 IST