‘రొట్టె ముక్కలతో ప్రాణాలు నిలబెట్టుకున్నాం.. ఇంటికి తిరిగొస్తామనుకోలేదు..’

ABN , First Publish Date - 2020-10-30T22:21:27+05:30 IST

సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన ముగ్గురు యువకులు ఎట్టకేలకు లిబియా నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. సీతానగరానికి చెందిన బచ్చల జోగారావు, బచ్చల వెంకటరావు, బొడ్డు దానయ్యలు సెప్టెంబరు 14న లిబియాలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరంతా ఎట్టకేలకు ఇళ్లకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

‘రొట్టె ముక్కలతో ప్రాణాలు నిలబెట్టుకున్నాం.. ఇంటికి తిరిగొస్తామనుకోలేదు..’

సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేశారు

ఇది మాకు పునర్జన్మే 

కట్టుబట్టలే మిగిలాయి

‘లిబియా’ బాధితుల మనోవేదన 

స్వగ్రామానికి చేరుకున్న వైనం

కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం   


(సంతబొమ్మాళి/శ్రీకాకుళం): సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన ముగ్గురు యువకులు ఎట్టకేలకు లిబియా నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. సీతానగరానికి చెందిన బచ్చల జోగారావు, బచ్చల వెంకటరావు, బొడ్డు దానయ్యలు సెప్టెంబరు 14న లిబియాలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరంతా ఎట్టకేలకు ఇళ్లకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా లిబియాలో కిడ్నాప్‌నకు గురైన ఈ ముగ్గురూ.. అక్కడ పడిన అవస్థలను ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. ‘లిబియాలో కిడ్నాప్‌నకు గురైన మేం ఎక్కడ ఉన్నామో.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. రొట్టె ముక్కలతోనే కడుపు నింపుకొని జీవించాం. ఎన్నో అవస్థలు పడ్డాం. చివరికి కట్టుబట్టలే మిగిలాయి. ఇన్ని కష్టాల నడుమ మళ్లీ ఇంటికి వస్తామనుకోలేదు. కుటుంబ సభ్యులను, బంధువులను, సన్నిహితులను చూస్తామనుకోలేదు. మళ్లీ మాకు పునర్జన్మ లభించింది’ అంటూ.. కిడ్నాప్‌ తతంగాన్ని వివరించారు. 


అవి వారి మాటల్లోనే.. 

‘ఉపాధి కోసం వేలాది మైళ్ల దూరంలో ఉన్న లిబియా వెళ్లాం. అక్కడ వీసా గడువు ముగియడంతో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యాం. సెప్టెంబరు 14న మేం ముగ్గురం... గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురితో కలసి బెంగాజీ ఎయిర్‌పోర్టుకు వెళ్లాం. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ఎయిర్‌పోర్టు మూసేశారు. దీంతో కంపెనీ వాహనంలో అక్కడకు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రిపోలి ఎయిర్‌పోర్టుకు పయ నమయ్యాం. సుమారు 900 కిలో మీటర్ల దూరం ప్రయాణించాం. మరో మూడు గంటల్లో విమా నాశ్రయానికి చేరువవుతున్న సమ యంలో అగంతుకులు సినీఫక్కీ లో మమ్మల్ని కిడ్నాప్‌ చేశారు. 150 కిలోమీటర్ల వేగంతో ప్రయా ణిస్తున్న మా వాహనాన్ని ఆరు గురు దుండగులు ఓ వాహనంతో ఓవర్‌టేక్‌ చేశారు. మెషిన్‌గన్‌లతో గాల్లోకి, భూమిపైకి కాల్చారు. దీంతో మరింత భయాందోళన చెందాం. మా ఏడుగురి కాళ్లూ.. చేతులు కట్టేసి, నల్లటి దుప్పట్లు ముసుగు వేసి వేరే వాహనంలో తీసుకెళ్లిపోయారు. చీకటి గదిలో బంధించారు. ఎక్కడ ఉన్నామో.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. మా దగ్గర ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్లు, పాస్‌పోర్టులు అన్నీ తీసుకున్నారు. చివరికి కట్టుబట్టలే మిగిలాయి. వారం రోజులపాటు నరకయాతన అనుభవిం చాం. రోజూ చిన్న చిన్న రొట్టె ముక్కలు ఇచ్చేవారు. వాటితోనే కడుపు నింపుకొని అర్థాకలితో అవస్థలు పడ్డాం. సజీవంగా ఇంటికి చేరు తామనే ఆశలు వదులుకున్నాం. భారత దౌత్య అధి కారులు, కంపెనీ ప్రతినిధులు కిడ్నాపర్లతో చర్చించారు. ఈ చర్చల్లో భారత బెంగాళీ సమన్వయకర్త తాభాషీయం ఎంతో చొరవ తీసుకొని మా విడుదలకు కృషి చేశారు.


ఈ చర్చలు సఫలమవడంతో ఈ నెల 11న మాకు విముక్తి లభించింది. 28 రోజుల తరువాత కిడ్నాప్‌ చెర నుంచి బయటపడ్డాం. కంపెనీ యాజమాన్యం రూ.5వేల నగదు, విమాన టిక్కెట్లు సమకూర్చింది. దౌత్య అధికారులు పాస్‌పోర్టు, వీసా సౌకర్యం కల్పించారు. దీంతో లిబియా నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎంపీ రామ్మోహన్‌నాయుడు విశాఖ కు టిక్కెట్లు సమకూర్చారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో పాటు దౌత్య అధికారులు, కంపెనీ యాజమాన్యం కృషితో మేమంతా క్షేమంగా బయటపడ్డాం. మాకు పునర్జన్మ ప్రసాదించిన అందరికీ కృతజ్ఞతలు’ అని జోగారావు, వెంకటరావు, దానయ్యలు తెలిపారు.    


పార్లమెంట్‌లో ప్రస్తావించకుంటే.. ఏమైపోయేవాళ్లమో...

ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి సంతబొమ్మాళి వాసుల కృతజ్ఞతలు


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: లిబియాలో అదృశ్యమైన మా విషయం.. ఎంపీ రామ్మో హన్‌నాయుడు పార్లమెంట్‌లో ప్రస్తావించ కుంటే.. ఏమైపోయేవాళ్లమో.. అంటూ అక్కడి నుంచి క్షేమంగా చేరుకున్న సంతబొమ్మాళి యువ కులు ఉద్వేగభరితమయ్యారు. గురువారం శ్రీకాకుళం ప్రజాసదన్‌లో ఎంపీ రామ్మోహన్‌నాయుడును జోగా రావు, వెంకటరావు, దానయ్యలు కలిసి  కృతజ్ఞతలు తెలి పారు. లిబియాలో దుండగుల చెరలో ఎలా బందీల య్యారో... ఎటువంటి బాధలకు గురయ్యారో వివరించారు. ‘మీ చలువ వల్లే విడుదలయ్యాం. లేదంటే ప్రాణాలతో దేశంలో అడుగుపెట్టేవాళ్లం కాదు. మా కోసం మీరు పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో భారత ప్రభుత్వంలోనూ, లిబియా ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. విదేశాంగ మంత్రి జయశంకర్‌ చొరవతో లిబియాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు, అక్కడి కంపెనీ ప్రతినిధులు.. అగంతుకులతో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో మాకు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి లభించింది. క్షేమంగా మా ప్రాణాలను కాపాడి నందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం’ అని తెలిపారు.  ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎటువంటి సాయానికైనా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీకాకుళం ఎస్పీ అమిత్‌బర్దర్‌ను ముగ్గురు యువకులు కలిశారు. శాఖాపరంగా స్పందించినం దుకు కృతజ్ఞతలు తెలిపారు. 



సీతానగరంలో పండగే..

సీతానగరంలో పండగ వాతావరణం నెలకొంది. జోగారావు, వెంకటరావు, దానయ్యలు లిబియాలో కిడ్నాప్‌కు గురై.. విడుదల అనంతరం గురువారం స్వగ్రామానికి చేరుకు న్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయంగా పలుకరిస్తూ.. మిఠాయిలు తినిపించారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది అక్టోబర్‌ 29న ఉపాధి కోసం ఈ ముగ్గురూ లిబియా వెళ్లారు. అక్కడ వీసా గడువు ముగియడంతో స్వదేశానికి వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యారు. అగంతుకుల చెర నుంచి విముక్తి లభించగా.. మళ్లీ అదే రోజు గురువారం (అక్టోబరు 29న) స్వగ్రామాలకు చేరుకోవడం గమనార్హం. 

Updated Date - 2020-10-30T22:21:27+05:30 IST