Qatar లో రెండేళ్ల క్రితం తెలుగు మహిళ హత్య.. పరిహారం కోసం బాధిత కుటుంబం ఉపరాష్ట్రపతికి వేడుకోలు

ABN , First Publish Date - 2022-06-07T17:13:55+05:30 IST

ఖతర్‌, భారత్‌ మధ్య స్నేహబంధం నెలకొని 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఇరుదేశాల మధ్య అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి.

Qatar లో రెండేళ్ల క్రితం తెలుగు మహిళ హత్య.. పరిహారం కోసం బాధిత కుటుంబం ఉపరాష్ట్రపతికి వేడుకోలు

ఖతార్‌-భారత్‌ చర్చల నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి ఓ తెలంగాణ కుటుంబం వేడుకోలు 

రెండేళ్ల క్రితం ఖతార్‌లో ఖమ్మం జిల్లా మహిళ హత్య

నాటి నుంచి పరిహారం కోసం బాధిత కుటుంబం ఎదురుచూపు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఖతర్‌, భారత్‌ మధ్య స్నేహబంధం నెలకొని 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఇరుదేశాల మధ్య అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా జరుగుతున్న ఈ సమావేశాలపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగు వారైన ఉపరాష్ట్రపతి అక్కడ ఉండటంతో తమ సమస్యను పరిష్కరించి తమకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించి న్యాయం చేస్తారని ఎదురుచూస్తోంది. ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురానికి చెందిన వాసిరెడ్డి సమతకు భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలున్నారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా పిల్లల భవిత కోసం సమత 2019లో ఖతర్‌ వెళ్లింది. అక్కడ ఓ అరబ్‌ ఇంట్లో పనికి చేరింది. అదే ఏడాది అక్టోబర్‌ 20న ఆమె హత్యకు గురైంది. మతిస్థితిమితం లేని యజమాని కొడుకే సమతను కత్తితో పొడిచి చంపాడు.


ఖతర్‌లో న్యాయవిచారణ వేగంగా జరుగుతుంది. కానీ కరోనా ఆంక్షల నేపథ్యంలో సమత కేసులో తీర్పు రావడం ఆలస్యమైంది. సమతను చంపిన వ్యక్తికి న్యాయస్థానం 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం హత్య కేసు దోషులు.. బాధితులకు పరిహారం చెల్లిస్తే జైలు శిక్ష నుంచి విముక్తి పొందుతారు. ఈ పరిహారాన్నే అక్కడ దియా అని పిలుస్తారు. దియా సొమ్ము అందుకునేందుకు అవసరమైన పత్రాలను సమత కుటుంబ సభ్యులు ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయానికి రెండేళ్ల క్రితమే పంపారు. కానీ పరిహారం విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో సమత కేసు అంశాన్ని ప్రస్తావించాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. 


Updated Date - 2022-06-07T17:13:55+05:30 IST