తెలుగోడి వాణి ఢిల్లీలో వినిపించాలి

ABN , First Publish Date - 2021-02-28T06:47:43+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలంటే తెలుగోడి వాణి ఢిల్లీలో వినిపించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు.

తెలుగోడి వాణి ఢిల్లీలో వినిపించాలి

ఉక్కు పరిరక్షణకు ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి


కూర్మన్నపాలెం, ఫిబ్రవరి 27: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలంటే తెలుగోడి వాణి ఢిల్లీలో వినిపించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను ఉద్దేశించి పట్టాభి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీలతోపాటు, తమ పార్టీ ఎంపీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్మికుల ఉద్యమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. కాగా, శనివారం నాటి దీక్షలలో ఎస్‌ఎంఎస్‌-2 విభాగానికి చెందిన 400 మంది కార్మికులు కూర్చున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, ఎన్‌.రామారావు, గంధం వెంకటరావు, విల్లా రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి: ఎంపీ లావు


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నాణ్యతలో విశ్వశ్రేణి గుర్తింపు పొందిందని నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఉక్కు ఉద్యోగుల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి తన సంఘీభావాన్ని తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని ఎంపీకి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. 


ప్రజలంతా భాగస్వామ్యులు కావాలి: ఏయూ ప్రొఫెసర్‌  కేఎస్‌ చలం 


ఏయూ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళలు, యువత ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-02-28T06:47:43+05:30 IST