తెలుగు వీర లేవరా!

ABN , First Publish Date - 2021-02-07T06:00:27+05:30 IST

‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ ..50 ఏళ్ల క్రితం తెలుగునాట మార్మోగిన నినాదం ఇది. ఇప్పటిలా ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అంటూ వేర్పాటుభావాలతో...

తెలుగు వీర లేవరా!

‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ ..50 ఏళ్ల క్రితం తెలుగునాట మార్మోగిన నినాదం ఇది. ఇప్పటిలా ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అంటూ వేర్పాటుభావాలతో ఆలోచించకుండా తెలుగు ప్రజలందరూ విశాఖ ఉక్కు కోసం ఉద్యమించారు. ఆనాడు సాగిన పోరులో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కూడా విద్యార్థి నాయకుడిగా నాటి ఉద్యమంలో ముందుండి పోరాడారు. గాంధేయవాది అమృతరావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రజలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాటంలో పాల్గొన్నారు. ఫలితంగా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగొచ్చి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించింది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని నమ్మి అమరావతి కోసం 29 గ్రామాల ప్రజలు ఎంత భూమిని ఇచ్చారో.. అప్పట్లో విశాఖ ఉక్కు కోసం దాదాపు 40 గ్రామాల ప్రజలు 25 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. ఇదంతా ఇప్పటి తరానికి తెలియదు. అంతమాత్రాన ప్రాణత్యాగం చేసినవారిని మరచిపోవడం భావ్యం కాదు కదా! విశాఖ ఉక్కు కోసం జరిగిన పోరాటంలో తన ఏకైక సోదరుడు వి.కోటేశ్వరరావును కూడా కోల్పోయానని, నాటి త్యాగమూర్తుల నిస్వార్థ పోరాటానికి ఇప్పుడు అర్థం లేకుండా పోతోందని చెన్నైలో నివసించే ‘ద్రవిడదేశం’ అధ్యక్షుడు కృష్ణారావు నాకు పంపిన ఒక సందేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెడుతున్నట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇలా ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. ఎవరెంతగా ఆందోళన చేసినా విశాఖ ఉక్కు అమ్మకం జరిగి తీరుతుందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తాజాగా ప్రకటించారు.


నాటి ఇందిరాగాంధీని దిగివచ్చేలా చేసిన ఆంధ్రులు ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవడానికి ఏం చేస్తారో చూడాలి! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బలహీనతలను గమనించిన కేంద్రపెద్దలు విశాఖ ఉక్కు విషయంలో వెనక్కు తగ్గుతారా? అన్నది అనుమానమే! అదేమిటో గానీ ఏపీ ప్రజలు కుల మతాలకు తప్ప తమ జీవితాలతో ముడిపడి ఉన్న ఏ విషయంపైనా స్పందించడం లేదు. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తే, ఇప్పుడు వారిని ఎగతాళి చేస్తున్నారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల ప్రజల సమస్యగానే చూస్తున్నారు. రాజధాని ఉన్నా లేకపోయినా పట్టడం లేదు. అదేమంటే.. ‘‘ఆ సామాజికవర్గానికి మాత్రమే రాజధాని వల్ల ఉపయోగం, మాకేం వస్తుంది’’ అని పెదవి విరుస్తున్నారు. దీంతో అమరావతి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటం పొరుగు గ్రామాల ప్రజలను కూడా కదిలించలేకపోతోంది. ‘‘అమరావతి లేదా? పోతే పోనీ.. అక్కడి రైతులేగా నాశనం అయ్యేది’’ అన్నట్టుగా ఇతర ప్రాంతాల ప్రజలు ఉదాసీనంగా ఉంటున్నారు. అమరావతి తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా ఈ జాబితాలో చేరిపోయింది. పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌ నిర్మించడానికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటున్నా, రాష్ట్రప్రభుత్వం కూడా నోరెత్తలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం అని మీడియా వర్ణించడమే తప్ప ప్రజలు అలా భావిస్తున్నట్టుగా లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించే పోలవరం పూర్తయితే ఏంటి? లేకపోతే ఏంటి? అని ఇతర ప్రాంతాల ప్రజలు భావిస్తున్నట్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజి స్థాయికి కుదించబోతున్నారన్న విషయం తెలిసిన తర్వాత కూడా ప్రజల్లో స్పందన శూన్యం.


ఆంధ్రులు ఆరంభశూరులు అనేవారు. కానీ ఇప్పుడు ఆరంభం కూడా కనిపించడం లేదు. మొన్న అమరావతికి, నిన్న పోలవరానికి పట్టిన గతి తెలిసి కూడా ప్రజల్లో కనీసం చైతన్యం లేకపోవడాన్ని గమనించిన కేంద్రపెద్దలు ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారు. ఎవరెంతగా ఆందోళన చేసినా విశాఖ ఉక్కు అమ్మకం జరిగి తీరుతుందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ప్రకటించేశారంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో పేరుకుపోయిన జఢత్వం పట్ల బీజేపీ నాయకులకు అంతులేని విశ్వాసం ఉండే ఉంటుంది. లేకపోతే పోరాటాలు, త్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖ ఉక్కును అమ్మేస్తామని రొమ్ము విరుచుకుని చెప్పగలరా? కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు శుక్రవారంనాడు ఉద్యమించాయి. విశాఖ ప్రజలైనా వారికి సంఘీభావం తెలిపారో లేదో తెలియదు. ఇదేదో విశాఖ ఉక్కు ఉద్యోగుల సమస్య అని మిగతా ప్రాంతాల ప్రజలు చూడొచ్చు. అయితే ఈ విధానం ప్రజలందరి సమస్య అవుతుందని తెలుసుకునేలోపే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయి. దాంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. తట్ట తగలేసి పేలాలు వేయించుకున్నట్టుగా ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పుడు అమ్ముకుంటూ పోతారు సరే, అవి అయ్యాక ఏం అమ్ముతారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేముందు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటమే ఇందుకు నిదర్శనం. రైతుల ఆందోళన పంజాబ్‌, హరియాణాలకు మాత్రమే పరిమితం అనుకుంటున్నారు గానీ, ఢిల్లీకి సమీపంలో ఉన్నందున ఆ రెండు రాష్ర్టాల రైతులు నేరుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అంతమాత్రాన మిగతా రాష్ర్టాల రైతులు వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నారని చెప్పగలరా? ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏ స్థాయిలో ఉద్యమిస్తారో తెలియదు. ప్రజల్లో స్పందన లేనంత మాత్రాన అమ్మకానికి మద్దతు లభించింది అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా ఇనుపఖనిజం గనులు లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయన్నది ప్రధానమైన వాదన! అదే నిజమైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారు మాత్రం సొంత గనులు కావాలని పట్టుబట్టరా? గనులు కేటాయిస్తేనే కొంటాం అని చెబుతారు కదా? అయినా ఫ్యాక్టరీ కొనుగోలుకు మళ్లీ ప్రభుత్వరంగ బ్యాంకులే అప్పులు ఇవ్వాలి కదా! అంటే ప్రజల డబ్బుతో అదానీ లేదా అంబానీ లేదా మరొకరు షో చేస్తారు. లాభాలు వస్తాయన్న నమ్మకం కలగనిదే వారు మాత్రం ఎందుకు ముందుకొస్తారు? లాభాల కోసం ఉత్పత్తి సామర్థ్యం తగ్గిస్తారు. పుష్కలంగా అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూమిలో కొంతభాగాన్ని వాణిజ్య అవసరాలకు విక్రయించుకుంటూ పోయే అవకాశముంది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే జరిగేది ఇదే! అయితే ప్రజల మనోభావాలు వేరేగా ఉంటున్నాయా? అలా ఉండాలని కేంద్రపెద్దలు నమ్ముతున్నట్టుగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు కనీసస్థాయిలో ఉన్నప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతిరోజూ పెంచుకుంటూ పోతున్నప్పటికీ ప్రజల్లో చలనం లేనందున పాలకులు ఎవరైనా అలాగే అభిప్రాయపడతారు. ప్రజలకు మతం మత్తు ఎక్కింది కనుక ఎన్నికల్లో గెలవడానికి ‘జై శ్రీరామ్‌’ నినాదం ఒక్కటే చాలదా? అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించే రామమందిరానికి మేమెందుకు విరాళాలు ఇవ్వాలని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నించడం లేదే! శ్రీరాముడిని తలుచుకుని చేతనైన సాయం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు టార్గెట్లు పెట్టారు. కాదంటే ఆదాయపు పన్ను శాఖతోపాటు సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక, పారిశ్రామికవేత్తలందరూ రామభక్తులు అయిపోయారు. మతం కంటే ఏదీ ముఖ్యం కాదన్న స్థితికి దేశ ప్రజలు చేరిపోయారు, లేదా చేర్చబడ్డారు. ఫలితంగా తమ జేబులను గుల్ల చేస్తున్నప్పటికీ వారికి నొప్పి తెలియడం లేదు. ప్రతిఘటించాల్సిన ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల నాయకులు కేసుల భయంతో వణికిపోతున్నారు. ఇంకేముంది.. తమకు ఎదురు లేదని పాలకులు భావించడం సహజం! ప్రజలను చైతన్యపరచవలసిన మీడియా ప్రభుత్వాల ముందు సాగిలపడటాన్ని చూస్తున్నాం. తమ శక్తిసామర్థ్యాలపై అపార నమ్మకం ఏర్పరచుకున్న పాలకులు ఇంతకంటే భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటారని ఊహించలేం. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అవసరమా? లేదా? అన్నది కేంద్రపెద్దలకు ముఖ్యం కాదు. అయోధ్యలో నిర్మించే రామమందిరానికి తలో చేయి అందించాలని కోరుకుంటున్న వారికి, ఐదు కోట్ల ఆంధ్రుల అవసరాలు పట్టకపోవడం బాధాకరం. జఢత్వంతో జీవచ్ఛవాల్లా మారిపోయిన ఆంధ్రులలో చైతన్యం రానంతవరకు రాజధాని ఉండదు. పోలవరం పూర్తవదు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకతప్పదు. ఈ జాబితాలో ఇంకేమి చేరతాయో తెలియదు. ఆంధ్రులు ఇప్పటికైనా మేల్కోని పక్షంలో చేతకానివారిగా చరిత్రలో మిగిలిపోతారు. పొట్టి శ్రీరాములు, అమృతరావు వంటి మహనీయుల త్యాగాలు వృథా పోకూడదని, ఇలాంటి జాతి కోసమా తాము త్యాగాలు చేసింది అని వారి ఆత్మలు ఘోషించకూడదని కోరుకుందాం!


నిలువరించకుంటే చరిత్రహీనులే!

ఇక విశాఖ ఉక్కును విక్రయించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా పడుతుందని చెప్పవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్థానికంగా బీజేపీ ఆత్మరక్షణలో పడిపోతుంది. జనసేన సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తొడ కొట్టి మరీ సవాలు విసురుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీయే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రకటించేశారు కూడా! ఇంతలో ఎవరి నుంచి అక్షింతలు పడ్డాయో తెలియదు గానీ, తన మాటలు వక్రీకరించారనీ, ముఖ్యమంత్రి ఎవరన్నది పవన్‌ కల్యాణ్‌, జేపీ నడ్డా కలిసి నిర్ణయిస్తారని 24 గంటలు గడవకముందే నాలుక మడతేశారు. అధికారంలోకి రావాలని బీజేపీ ఆశ పడటంలో తప్పు లేదు. అయితే కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఆ పార్టీ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయం విషయంలో కేంద్రప్రభుత్వం అడుగులు ముందుకే పడే పక్షంలో సోము వీర్రాజు అండ్‌ కో తమలోని ఆశలను చిదిమేసుకోవలసి రావొచ్చు. విశాఖ ఉక్కు విక్రయం జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బీజేపీని ఆదరిస్తారని చెప్పలేం. ఈ నిర్ణయం ప్రభావం మున్ముందు బీజేపీ– జనసేన సంబంధాలపై కూడా పడే అవకాశముంది. బీజేపీతో కలిసి నడిస్తే మునిగిపోతామని తెలుసుకున్న మరుక్షణం జనసేన తమ మిత్రబంధాన్ని తెంపేసుకోవచ్చు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రపెద్దల మనసు మార్చవలసిన బాధ్యత ఇప్పుడు ప్రధానంగా బీజేపీ– జనసేన కూటమిపై ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ బాధ్యత నుంచి ఆ రెండు పార్టీలు తప్పించుకోలేవు. విశాఖ ఉక్కు వ్యవహారంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇరకాటంలో పడిందని చెప్పవచ్చు.


అధికారంలో ఉన్నందున కేంద్రాన్ని నిలువరించే బాధ్యత నుంచి ఆ పార్టీ కూడా తప్పుకోజాలదు. కార్యనిర్వాహక రాజధాని పేరిట విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తలపోశారు. కార్యనిర్వాహక రాజధాని వస్తే తాము బాగుపడిపోతామని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు సెంటిమెంటు మరింతగా బలపడితే వైసీపీ ఇరకాటంలో పడిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం మెడలు వంచాల్సిన నైతిక బాధ్యత జగన్‌రెడ్డిపైనే ఉంటుంది. ఇందుకోసం ఆయన కేంద్రపెద్దలతో ప్రత్యక్ష పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి జగన్‌రెడ్డి బీజేపీ పెద్దలతో మైత్రీభావంతో మెలుగుతున్నారు. మోదీ– షా ద్వయం మనస్సు నొప్పించకుండా జాగ్రత్తగా మసలుకుంటున్నారు. ఆ ఇద్దరినీ ఎదిరిస్తే ఏమి జరుగుతుందో జగన్‌కు బాగా తెలుసు. ఈ కారణంగానే ఇప్పటివరకు ఆయన ఢిల్లీ పర్యటనల్లో తమ సంబంధాలను రెన్యువల్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఆయన ఏ వైఖరి తీసుకుంటారు? కేంద్ర నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా? లేక పోలవరం తరహాలో రాజీ పడిపోతారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. ప్రత్యేక హోదాను అటకెక్కించినట్టుగా విశాఖ ఉక్కు విషయంలో కూడా మౌనంగా ఉండిపోతే జగన్‌కు నష్టం జరగవచ్చు. కార్యనిర్వాహక రాజధానిని నిజంగానే విశాఖలో ఏర్పాటుచేసినా దానివల్ల కలిగే ప్రయోజనం కంటే విశాఖ ఉక్కు విషయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, విశాఖ ఉక్కు విక్రయం అంశం ఆ పార్టీకి లభించిన ప్రధాన అస్త్రంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బాటలోనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా కేంద్రపెద్దలకు భయపడి విశాఖ ఉక్కు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తే చారిత్రిక తప్పిదం చేసినవారు అవుతారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల పక్షాన ముందుండి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తెలుగుదేశంపై అధికంగా ఉంటుంది. కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్నందున వారి పోరాటం సరిపోదు. ఇక మిగిలిన వైసీపీ, టీడీపీ, బీజేపీ– జనసేనల వైఖరిని బట్టి విశాఖ ఉక్కు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ పార్టీలు విడివిడిగా లేదా ఉమ్మడిగానైనా పోరాటం చేసి కేంద్రాన్ని నిలువరించలేకపోతే రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రాజకీయపార్టీల మధ్య ఐక్యత లోపించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ అనేక విధాలుగా నష్టపోయింది. ఇప్పుడు ప్రజల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలంగా ఆవిర్భవించిన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికైనా రాజకీయపార్టీలు విభేదాలు పక్కనపెట్టి చేతులు కలుపుతాయని ఆశిద్దాం. 


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విషయానికి వద్దాం. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను శత్రువుగా ప్రకటించుకున్న జగన్‌ అండ్‌ కో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఆయనపై మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. రమేశ్‌కుమార్‌ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిపక్షాలతో పోరాడాల్సిన అధికారపక్షం ఎన్నికల కమిషనర్‌ అనే వ్యక్తి పైనే పోరాటాన్ని కేంద్రీకృతం చేయడంతో రమేశ్‌కుమార్‌కు, గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్‌కు వచ్చినట్టుగా పేరొచ్చింది. జగన్‌పై ఉన్న కేసులలో తాను సాక్షిననీ, భవిష్యత్తులో కూడా తాను సాక్ష్యం చెప్పవలసి వస్తుందనీ నర్మగర్భంగా హెచ్చరించడం ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. పార్టీరహితంగా జరిగే ఎన్నికలని తెలిసి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికారపక్షం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాము ఆశించిన విధంగా ఏకగ్రీవాలు సాధించలేకపోయింది. ప్రభుత్వ పక్షానికి ఇదొక గుణపాఠం. తాము ఆశించినట్టుగా ఏకగ్రీవాలు లేకపోవడానికి రమేశ్‌కుమార్‌ కారణమని భావిస్తూ ఆయనపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి చేసిన హెచ్చరిక తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఎన్నికల కమిషనర్‌ చెప్పినట్టు చేస్తే మార్చి 31వ తేదీ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రిటర్నింగ్‌ అధికారులను హెచ్చరించారు. అలాంటి ఎక్స్‌ట్రాలు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేసే అధికారులను ఇలా హెచ్చరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. అయితే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పోకడలను బట్టి మంత్రులు కూడా పరిధి దాటి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. పరిధి దాటిన మంత్రి రామచంద్రారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఇదొక అసాధారణ చర్య! చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అని అందుకే అంటారు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-02-07T06:00:27+05:30 IST