నీట్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2020-10-17T07:37:30+05:30 IST

నీట్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ 50 ర్యాంకుల్లో 15 మంది మనోళ్లే ఉన్నారు. వారిలో ఏడుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. 8 మంది ఏపీ విద్యార్థులు. ఆలిండియా టాప్‌ 20 అమ్మాయిల జాబితాలో ఏడు ర్యాంకులు దక్కగా

నీట్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

  • టాప్‌-50లో 15 మంది మనోళ్లే
  • టాప్‌-20 అమ్మాయిల్లో ఏడుగురు..
  • అబ్బాయిల జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు!
  • తెలంగాణ విద్యార్థిని తుమ్మల స్నిఖితకు
  • ఆలిండియా 3వ ర్యాంకు.. 715 మార్కులు
  • టాప్‌ ర్యాంకర్లు ఇద్దరికి 100% మార్కులు
  • వారిలో ఒకరు ఒడిశా విద్యార్థి అఫ్తాబ్‌
  • మరొకరు ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌
  • 720కి 720 మార్కులతో అగ్రస్థానం
  • నీట్‌ చరిత్రలోనే 100% స్కోరు తొలిసారి
  • రాష్ట్రంలో అర్హత సాధించినవారు 49.15%
  • గత ఏడాది కంటే 18.29% తగ్గుదల


నీట్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ 50 ర్యాంకుల్లో 15 మంది మనోళ్లే ఉన్నారు. వారిలో ఏడుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. 8 మంది ఏపీ విద్యార్థులు. ఆలిండియా టాప్‌ 20 అమ్మాయిల జాబితాలో ఏడు ర్యాంకులు దక్కగా వారిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థినులు, నలుగురు ఏపీ వారు. టాప్‌-20 అబ్బాయిల జాబితాలోనూ తెలుగువారు ఆరు ర్యాంకులు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత 715 (99.99ు) మార్కులతో ఆలిండియా మూడో ర్యాంకు.. ఏపీకి చెందిన చైతన్య సింధు 711 మార్కులతో ఆరో ర్యాంకు సాధించారు. ఎంబీబీఎస్‌, బీడీఎ్‌సలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. మొదటి ర్యాంకును ఒడిశాకు చెందిన షోయబ్‌ అఫ్తాబ్‌, ఢిల్లీవిద్యార్థిని ఆకాంక్షా సింగ్‌ సాధించారు. 720 మార్కులకుగాను 720 మార్కులు సాధించి వీరిద్దరూ చరిత్ర సృష్టించారు. 100 శాతం మార్కులు సాధించడం ఇదే మొదటిసారి. వినీత్‌ శర్మ (715-రాజస్థాన్‌) నాలుగో ర్యాంకు, ఆమ్రిషా ఖైతాన్‌ (715-హరియాణ) ఐదో ర్యాంకు, సాత్విక్‌ (711-హరియాణ) ఏడో ర్యాంకు, శ్రీలన్‌ (710-తమిళనాడు) ఎనిమిదో ర్యాంకు, కార్తీక్‌ రెడ్డి(710- కర్ణాటక) తొమ్మిదోర్యాంకు, మనీత్‌ (710-గుజరాత్‌) 10వ ర్యాంక్‌ సాధించారు.


56.44% మంది..

దేశ వ్యాప్తంగా 15,97,435 మంది నమోదు చేసుకోగా, పరీక్షకు 13,66,945 మంది హాజరయ్యారు. 56.44 శాతం (7,71,500) మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి ఈసారి నీట్‌కు 54,872 మంది రిజిష్టర్‌ చేసుకోగా, 50,392 మంది హాజరయ్యారు. వారిలో 24,768 మంది అర్హత సాధించారు. కిందటి సంవత్సరం నీట్‌లో రాష్ట్ర విద్యార్ధులు 67.44 శాతం మంది అర్హత సాధించగా ఈసారి అది 49.15ుగా నమోదైంది. ఏపీ నుంచి 57,721 మంది నీట్‌ రాయగా 33,841 మంది (58.63ు) అర్హత సాధించారు. నీట్‌ ఈ ఏడాది మే 3న జరగాల్సి ఉండగా కరోనాతో జూలై 26కు వాయిదా వేశారు. మళ్లీ రద్దుచేసి సెప్టెంబరు 13న 3862 కేంద్రాల్లో నిర్వహించారు. 


టాప్‌ 20లో మనోళ్లు..

టాప్‌ 20 ర్యాంకులు సాధించినవారిలో తెలంగాణ నుంచి తుమ్మల స్నిఖిత రెడ్డి,(3వ ర్యాంకు) బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), నిత్య దినేష్‌ (ఆలిండియా 58వ ర్యాంకు), ఏపీకి చెందిన చైతన్య సింధు (6), బి.మానస (16), టి.శ్వేత గాయత్రి (40), వై.మహిత రెడ్డి (ఆలిండియా 54వ ర్యాంకు) ఉన్నారు. ఆలిండియా టాప్‌ 20 అబ్బాయిల్లో తెలంగాణ నుంచి అనంత పరాక్రమ (11 ర్యాంకు), శ్రీరామ్‌ సాయి (27వ ర్యాంకు) ఉండగా, ఏపీ నుంచి కోట వెంకట్‌ (13), షేక్‌ కొత్తపల్లి అరాఫత్‌ ఖదీర్‌ (18), ఎల్‌.శేఖర్‌ సాత్విక్‌ శర్మ (20), జె.బాల శివరామకృష్ణ (26వ ర్యాంకు) ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎం.రుషిత్‌ 705 మార్కులతో 33వ ర్యాంకు సాధించాడు.  లక్షలాది మంది తాకిడితో నీట్‌ వెబ్‌సైట్‌ మొరాయించింది. గంటల తరబడి వెబ్‌సైట్‌ను రీఫ్రెష్‌ చేసినా ఫలితం లేకపోయింది. కొందరు కేంద్రమంత్రికి ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.


స్పెషాలిటీ కోర్సులు చేస్తా

మొదటి రోజు నుంచి ఫోక్‌సగా చదివాను. అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు. వాళ్లే నా మార్గదర్శకులు. స్పెషాలిటీ కోర్సులు చేయాలన్నది నాకోరిక.

- తుమ్మల స్నిఖిత (3వ ర్యాంకు)


న్యూరో సర్జన్‌ అవ్వాలనుకుంటున్నా

చదువులో ఎప్పుడూ ముందుండే దాన్ని. ఒత్తిడికి దూరంగా ఉండడం, ప్రశాంత వాతావరణంలో సరైన ప్రణాళికతో చదవడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణ కారణంగా ఈ ర్యాంకు సాధించాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలన్నది నా కోరిక. న్యూరోసర్జన్‌ 

అవ్వాలనుకుంటున్నాను. 

- సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు)

Updated Date - 2020-10-17T07:37:30+05:30 IST