ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థుల‌కు 'క‌రోనా' క‌ష్టాలు

ABN , First Publish Date - 2020-04-07T13:44:40+05:30 IST

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యనభ్యసించి, అక్కడే ఉపాధి అవకాశాలు పొందాలన్న ఆశతో అక్కడికి వెళ్లిన తెలంగాణ విద్యార్థుల జీవితం ‘కరోనా’తో తలకిందులైంది.

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థుల‌కు 'క‌రోనా' క‌ష్టాలు

లాక్‌డౌన్‌తో స్థానికులకే సాయం అంటున్న సర్కారు

పార్ట్‌టైం ఉద్యోగాల్లేవు.. అద్దె, సరుకులకు ఇక్కట్లు

భారత ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వినతి

కరీంనగర్‌, ఏప్రిల్‌ 6(ఆంద్రజ్యోతి ప్రతినిధి): ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యనభ్యసించి, అక్కడే ఉపాధి అవకాశాలు పొందాలన్న ఆశతో అక్కడికి వెళ్లిన తెలంగాణ విద్యార్థుల జీవితం ‘కరోనా’తో తలకిందులైంది. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్‌ ఆస్ట్రేలియాలోనూ పంజా విసురుతుండడంతో అక్కడి సంస్థలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం తమ దేశ పౌరసత్వం ఉన్న వారినే ఆదుకుంటామని ప్రకటించడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంటి అద్దె చెల్లించలేక, సరుకులు కొనుక్కోలేక సతమతమవుతున్నారు. 2019లో తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాకు ఉన్నత చదువుల కోసం 4 వేల మంది వెళ్లారు. చదువులు ముగించుకొని ఇంకా ఉద్యోగాల్లో స్థిరపడని వారూ వేలల్లోనే ఉన్నారు. ఆస్ట్రేలియా పౌరసత్వం లేని వీరంతా సొంత దేశానికి వెళ్లలేక, అక్కడ ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


విద్యార్థుల నుంచి రూ.25-30 లక్షల ఫీజు వసూలు చేస్తున్న యూనివర్సిటీలు సైతం చేతులెత్తేశాయని వారు వాపోతున్నారు. తమ కష్టాలను స్వదేశంలోని తమ తల్లిదండ్రులతో పంచుకోలేని స్థితిలో వారున్నారు. తెలంగాణ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాసులు కొందరు ఈ విద్యార్థులకు నిత్యావసర సరుకులు అందిస్తూ ఆదుకుంటున్నారు. అయితే, ప్రవాసులు సైతం ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని తమను స్వదేశానికి రప్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. బ్యాంకులు కూడా తమ విద్యా రుణాల చెల్లింపులను వాయిదా వేయాలని అడుగుతున్నారు. 


కరోనా ఆంక్షలతో దుర్భరమైన జీవితం

కరోనా ఆంక్షలతో ఆస్ట్రేలియాలో మా జీవితం దుర్భరమైంది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఇక్కడి విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరం అయ్యాయి. వీసా గడువు ముగిసింది. పొడిగింపు కోసం దరఖాస్తు చేశాను. ఆంక్షల వల్ల వీసా ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వ డం లేదు. చదువు పూర్తి కాలేదు. ఉద్యోగం పోయింది. నాలా చాలా మంది విద్యార్థులు కష్టాల్లో ఉన్నారు.

- నిశాంత్‌, ఖమ్మం జిల్లా


నిత్యావసరాలు అందిస్తున్నాం

ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థుల ఇబ్బందులు చూసి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. ఫీజులో 20% తిరిగి ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాలను కోరాం. భోజనానికి ఇబ్బంది పడే విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఏ ప్రాంతంలో ఉన్నా 0478311563 నెంబరుకు ఫోన్‌ చేయాలి. - కాసర్ల నాగేందర్‌రెడ్డి, ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్‌ విభాగం అధ్యక్షుడు

Updated Date - 2020-04-07T13:44:40+05:30 IST