Abn logo
Sep 21 2021 @ 00:59AM

ఆహార భద్రతలో తెలుగు రాష్ట్రాలు ‘వీక్‌’!

  • తొలి మూడు స్థానాల్లో  గుజరాత్‌, కేరళ, తమిళనాడు
  • ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌డెక్స్‌ ఫలితాలు  వెల్లడించిన కేంద్రం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: కేంద్రం తాజాగా వెల్లడించిన ఫుడ్‌ సేఫ్టీ ఇండెక్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలూ ‘బలహీనం’ (వీక్‌) కేటగిరీలో నిలిచాయి. తెలంగాణ నూటికి 40 మార్కులు సాధించగా.. ఏపీ కొంచెం మెరుగ్గా 57 మార్కులు పొందింది. 60 మార్కులకు దిగువన ఉన్న రాష్ట్రాలను ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ.. ఫుడ్‌ సేఫ్టీలో ‘వీక్‌ కేటగిరీ’ రాష్ట్రాలుగా ప్రకటించింది. ఈ కేటగిరీలో 24 రాష్ట్రాలు నిలిచాయి.


మొత్తం ఐదు విభాగాల్లో ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్రాలకు మార్కులు కేటాయించగా.. అందులో తెలంగాణ రెండు విభాగాల్లో పూర్తిగా వెనకబడింది. దీంతో.. స్థానమూ దిగజారింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్‌ కే శంకర్‌.. మార్కులు తగ్గినా.. తాము సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళతామని, సిబ్బందికి శిక్షణ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తామని తెలిపారు.


కాగా, ఫుడ్‌ సేఫ్టీ ఇండెక్స్‌లో గుజరాత్‌ తొలిస్థానంలో నిలవగా.. కేరళ, తమిళనాడు ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా తొలి స్థానంలో నిలవగా.. మేఘాలయా, మణిపూర్‌లకు ఆ తర్వాతి స్థానాలు దక్కాయి. అలాగే, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. జమ్మూ కశ్మీర్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ఈ ఫలితాలు విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందని, అదే సమయంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చుగానీ.. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదని చెప్పిన ఆయన.. మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.