తెలుగు రాష్ట్రాలు ముందుకు నడిచాయి. కథ అక్కడే ఆగిపోయింది!

ABN , First Publish Date - 2020-06-08T08:33:16+05:30 IST

అవశిష్ట ఆంధ్రప్రదేశ్‌ కథ కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా విభజన తరువాత జరిగిన పరిణామాలపై రావాల్సినన్ని కథలు రాలేదనే చెప్పాలి. అమరావతి నిర్మాణం కోసం చేసిన భూ ఆక్రమణ, హైదరాబాద్‌ నుండి సెక్రటేరియట్‌ను బలవంతంగా తరలించినపుడు...

తెలుగు రాష్ట్రాలు ముందుకు నడిచాయి.  కథ అక్కడే ఆగిపోయింది!

అవశిష్ట ఆంధ్రప్రదేశ్‌ కథ కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా విభజన తరువాత జరిగిన పరిణామాలపై రావాల్సినన్ని కథలు రాలేదనే చెప్పాలి. అమరావతి నిర్మాణం కోసం చేసిన భూ ఆక్రమణ, హైదరాబాద్‌ నుండి సెక్రటేరియట్‌ను బలవంతంగా తరలించినపుడు ఉద్యోగుల కళ్లలో ఉబికిన కన్నీరు, ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం దాని మంచి చెడులు, మత మార్పిడులు ఇత్యాది అంశాలపై కథలు రానేలేదు. 


ప్రత్యేక తెలంగాణ తరువాత కూడా శిల్పపరంగా పెద్దగా మార్పు రాలేదు. ముందటి శైలీ, శిల్పాల్లోనే కథలు వస్తున్నాయి. దీనికి కారణం కథా రచనలోకి కొత్త రక్తం రాకపోవడమే. ఇప్పుడున్న కథకుల్లో అందరూ ఒకరిద్దరు మినహా నాలుగు పదుల వయసు దాటిన వారే.


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో కంటే ఆత్మహత్యల వల్లనే ఎక్కువ మంది యువకులు చనిపోయారు. ఆత్మహత్యలను వీరోచిత మరణంగా చూపి కథలు రాసేంత కుత్సితులు కారు తెలంగాణ కథకులు. అందుకే శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్‌ కిష్టయ్యలాంటి వారు ఆత్మహత్య చేసుకున్నా అవి కథల్లో రికార్డు కాలేకపోయాయి. అయితే ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలు ఎంతగా పొగిలిపోతున్నాయో కథకులు పట్టించుకోలేదు.


తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఆవిర్భవించి అప్పుడే ఆరేళ్ల యింది. ఈ ఆరేళ్ళలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుల్ని తెలంగాణ కథకులు అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు. లేదూ మార్పుల్ని అంత తొందరగా జీర్ణం చేసుకోలేకపోయారా? ఆలోచించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ కథకుల వస్తు స్వీకరణలో పెద్దగా మార్పులేదు. పాత ధోరణిలోనే కథలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడమనే ఒక పెద్ద ప్రక్రియ తెలంగాణ కథకుల్ని అంతగా ప్రభా వితం చేయలేదేమోననిపిస్తుంది. అందుకే ప్రధాన స్రవంతి కథ ఏ మాత్రం ప్రభావితం కాలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951) నడుస్తున్న/ ముగిసిన తర్వాత దాని ప్రభావంతో ఎంతో సాహిత్యం వచ్చింది. ఇంకా వస్తున్నాయి. పోరా టాన్ని ఎవరి కోణంలో వారు రికార్డు చేశారు. ఈ వరుసలో పి.వి. నరసింహారావు రాసిన ‘గొల్లరామవ్వ కథ’, నెల్లూరి కేశవస్వామి ‘యుగాంతం’, కాంచనపల్లి చినవెంకటరామారావు రాసిన ‘మన ఊళ్లో కూడానా?’ కథలు కొన్ని మాత్రమే. అలాగే సింగరేణి కార్మిక పోరాట నేపథ్యంగా అల్లం రాజయ్య రాసిన ‘అతడు’, తుమ్మేటి రఘోత్తంరెడ్డి రాసిన ‘ఇల్లు’ కథలలాంటివి చాలా కనిపిస్తాయి. ఇవేగాక పి. చంద్‌లాంటి అనేక మంది కథకులు సింగరేణి నేపథ్యంగా పలు కథలు రాశారు. నక్సలైట్‌ ఉద్యమ ప్రభావంతో కూడా చాలా కథలు వచ్చాయి.


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో కంటే ఆత్మహత్యల వల్లనే ఎక్కువ మంది యువకులు చనిపోయారు. ఆత్మహత్యలను వీరోచిత మరణంగా చూపి కథలు రాసేంత కుత్సితులు కారు తెలంగాణ కథకులు. అందుకే శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్‌ కిష్టయ్యలాంటి వారు ఆత్మహత్య చేసుకున్నా అవి కథల్లో రికార్డు కాలేకపోయాయి. అయితే ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలు ఎంతగా పొగిలిపోతున్నాయో కథకులు పట్టించుకోలేదు. చెట్టంతటి మనిషిని కోల్పోయాక ఆ కుటుంబాలు ఇప్పుడెలా వున్నాయి? అనేది ఎక్కడా రికార్డు కాలేదు. సకలజనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, విగ్రహ విధ్వంసం, కేసిఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష, అలాగే రాష్ట్రం వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు అమల వుతున్నాయి- వాటి ఫలితాలు, లబ్ధిపొందనివారి బాధలను కూడా కథకులు పట్టించుకోవాల్సి ఉంది. అయితే వచ్చిన కథలేమిటి అని విచారించినపుడు పట్టణీకరణ కథలు, ప్రపంచీకరణ అనంతర దశ కథలు, అర్బనైజ్‌డ్‌ దళిత కథలు, పెద్దకూర చుట్టూత తిరిగే మత రాజకీయ సంబంధ కథలు, వృద్ధాప్యం చుట్టూ తిరిగే కథలు, నోస్టాల్జియా కథలు, రియలెస్టేట్‌ కథలు ఎక్కువగా వచ్చాయి. 


తెలంగాణ స్వరాష్ట్ర ప్రభావంతో కథలు రాకపోలేదు కాని వాటి రాశి తక్కువ. స్వరాష్ట్రంలోనైనా తెలంగాణ యువత మన చరిత్రను మనం తెలుసుకోవాలనే కోణంలో బి.యస్‌.రాములు ‘కొత్త కొత్త’ (2016) అనే కథను రాశారు. ఎన్ని పోరాటాల తరువాత తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందో చెప్తూనే ఈ కథ తెలంగాణ యువత తమ చరిత్ర తాము తెలుసుకోవాలని అందుకే ప్రభుత్వం దాన్ని పోటీ పరీక్షల్లో సిలబస్‌గా పెట్టిందని చెప్తుంది. అంతా కొత్త కొత్త కాబట్టి ఇంకొ న్నాళ్లుపోతే అన్ని విషయాల మీద ఒక స్పష్టత వస్తుందంటుంది. ‘‘మన తెలంగాణ రాష్ట్రం వచ్చినంక  పుస్తకాలన్నీ మారిపోయినయి. మన తెలంగాణ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నయి. అవన్నీ స్టడీ చేస్తేనే గ్రూప్స్‌లో పాసైతం. ఇంత కాలం మన చరిత్ర మనకు తెలియకుండా చేసిండ్రు. మనది కొత్త రాష్ట్రం. కొత్త చరిత్ర. మన సంస్కృతి, చరిత్ర గురించి అనేక పుస్తకాలు వచ్చినయి.’’ అంటుంది ఈ కథలోని గంగాదేవి అనే అమ్మాయి.


ట్యాంక్‌బండ్‌ మీద కాకపోయినా కనీసం జిల్లా కేంద్రాల్లోనైనా తెలంగాణ తేజో మూర్తుల విగ్రహాలు పెట్టాలని నొక్కి చెబుతుందీ కథ. zద్యమంలో ఎనగర్రలాంటి భర్తను కోల్పోయిన తెలంగాణ అమర వీరుల కుటుంబాల ఇంట్లో చీకటి స్థానే వెలుగు నిండాలని ఆకాంక్షించే కథ రావుల కిరణ్మయి రాసిన ‘శ్రీ తెలంగాణ’ (2016). తెలంగాణ అమర వీరులకు ప్రజలు తమ గుండెల్లో గుడి కడతా రని తెలిపే కథ. కె.వి. నరేందర్‌ రాసిన ‘ముక్కోటి బలగం’ (2016). ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో క్షేత్రస్థాయిలో పోరాడి అమరులైన కుటుంబాల పరిస్థితి ఎలావుందో కళ్లకు కట్టి నట్టు చెప్పిన కథ పెద్దింటి అశోక్‌కుమార్‌ రాసిన ‘తలుపులు’ (2014). ‘‘అవ్వా తెలంగాణ వచ్చిందే... మా సారుగూడా చెప్పిండు.. మన బాపు చెప్పకపోవునా.. మన బతుకులు మారుతయని... ఇప్పుడు మనకు నీళ్లత్తయి.. నౌకర్లత్తయి.. మంచి ఇల్లు కట్టుకుంటం..’’ అని ఒక అమరవీరుని కొడుకు సంబురపడతాడు.


కొడుకే కాదు ఆ అమర వీరుని భార్య కూడా, ‘‘తను కూడా పోరాటం చేసింది. బోనమెత్తి పాట పాడింది. బజార్ల బతుకమ్మ ఆడింది. నాయకుల ఇండ్లల్లకు పిడుకలు కొట్టింది. ఆమెలో కూడా ఆశ.. ఏ యాల్లన్న ఏముందో.. కండ్లు వొడగొట్టిన దేవుడు ఇండ్లు జూపియ్యడా? మనది మనం గెలిచినం. ఇప్పుడు అంత మనదే... అంతా మనమే కదా..’’ అని భ్రమ పడుతుంది. చివరికి తానూహించింది ఏదీ జరగక పోవడంతో ఒక రౌద్రంతో ‘‘మీ తల పండ్లు వలుగ, మీ ఓట్లిండ్లు మునుగ. మీరెన్నడన్నా కన బడ్డార్రా..? తన్నులు దిన్నోల్లా.. ఉపాసమున్నోల్లా..? రైలుకడ్డం పన్నోల్లా..? ఇయ్యాల్ల అందరు మొన గాల్లయిండ్రు...’’ అని కోపం నిండిన దైన్యంతో ఊగిపోతుంది. ఆఖరికి వీని బాపు చేసినట్టుగానే వీడు కూడా ఇంకా పోరాడాలేమోనని కొడుకును చూస్తూ ‘వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది’ అంటుంది. 


‘‘ఈ సాగర హారం పెత్తందారీ వ్యవస్థ మీద మాత్రమే నిరసన కాదు. నా ఇంటిలో నాకు స్వేచ్ఛ లేకుండా చేసి, నాపై పెత్తనం చేస్తూ, నాకు యజమాని అనుకుం టున్న భర్తపై కూడా’’ అనుకుంటూ ఒకేసారి అటు భర్త ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, ఇటు తెలంగాణ ఉద్య మంలో పాల్గొంటూ చైతన్యాన్ని పొందిన ఒక ముస్లిం యువతి కథ నస్రీన్‌ఖాన్‌ రాసిన ‘పంచీ ఔర్‌ పింజ్రా’ (2017). మన నీళ్లు మనకు కావాలి. మన నిధులు మనకు కావాలి. మన ఉద్యో గాలు మనకు కావాలని నినదించి ఆ లక్ష్య సాధనలో ప్రాణాలను కూడా త్యాగం చేసినా చివరికి చేతిలో బూడిద మిగిలితే. మళ్లీ ఆ లక్ష్యాల కోసమే మరో తరం పోరాటం చేయాల్సిందేనని డా.పసునూరి రవీందర్‌ ‘రాచపుండు’ (2018) వాస్తవ పరిస్థితిని ఎత్తి చూపుతుంది.


ప్రత్యేక తెలంగాణ తరువాత కూడా శిల్పపరంగా పెద్దగా మార్పు రాలేదు. ముందటి శైలీ, శిల్పాల్లోనే కథలు వస్తున్నాయి. దీనికి కారణం కథా రచనలోకి కొత్త రక్తం రాకపోవడమే. ఇప్పుడున్న కథకుల్లో అందరూ ఒకరిద్దరు మినహా నాలుగు పదుల వయసు దాటిన వారే. వంశీధర్‌రెడ్డి, హుమాయున్‌ సంగీర్‌, వి. మల్లికార్జున్‌, కిరణ్‌చర్ల, ఎదునూరి రాజేశ్వరి, డా. సూర్యా ధనంజయ్‌, డా. ఎం. దేవేంద్ర, తాళ్లపల్లి యాకమ్మ, బండారి రాజ్‌కుమార్‌, డా. గడ్డం మోహన్‌రావు, ఎగుర్ల గణేష్‌, ఇట్యాల వెంకటకిషన్‌ శాక్య, వేము గంటి శుక్తిమతి లాంటి కొత్త కథకులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. మేడి చైతన్య, మన్‌ప్రీతంలాంటి ఇరవైలలో ఉన్నవారు చాలా తక్కువ కనిపిస్తారు. కొత్త కథకులను ప్రోత్సహించడం కోసం ఆయా రచ యితల సంఘాలు అప్పుడప్పుడైనా అక్కడక్కడ కథా కార్యశాలలు, చర్చలు నిర్వహిస్తున్నారు. ఇది కొంత ఆశాజనకం. 


తెలంగాణ కథే కాదు అవశిష్ట ఆంధ్రప్రదేశ్‌ కథ కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా విభజన తరువాత జరిగిన పరిణామాలపై రావాల్సి నన్ని కథలు రాలేదనే చెప్పాలి. అమరావతి నిర్మాణం కోసం చేసిన భూ ఆక్రమణ, హైదరాబాద్‌ నుండి సెక్రటేరియట్‌ను బలవంతంగా తరలించినపుడు ఉద్యోగుల కళ్లలో ఉబికిన కన్నీరు, ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం దాని మంచి చెడులు, మత మార్పిడులు ఇత్యాది అంశాలపై కథలు రానేలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణానంతరం ఇక్కడి కథా ప్రయాణంలో జరిగిన మేలిమలుపేంటంటే ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా తెలంగాణ ఉత్తమ కథల సంకలనాలను తీసుకురావడం. 2013- ‘రంధి’, 2014- ‘తన్లాట’, 2015- ‘అలుగు’, 2016- ‘కూరాడు’, 2017- ‘దావత్‌’, 2018- ‘రివాజు’ పేర్లతో ఇప్పటి దాకా తెలంగాణ ఉత్తమ కథల సంకలనాలు వెలువడ్డాయి. ఇవి కొంతలో కొంతవరకైనా ప్రతి సంవత్సరం వెలువడిన మెరుగైన కథల్ని పాఠకులకు చేరువచేస్తున్నాయి. 


తెలంగాణ రాష్ర్టావతరణానంతరం ప్రింట్‌ పత్రికల్లో, వెబ్‌ పత్రికల్లో తెలంగాణ కథకు మునుపటి కన్నా ఆశాజనకమైన స్థానం లభిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతకు ముందు తెలంగాణ కథకులు తెలంగాణ తెలుగులో కథలు రాసి పంపిస్తే ఆయా పత్రికల సంపాదకులు వాటిని తిప్పి పంపేవారు. ఆ పరిస్థితి ఇప్పుడు మారినట్టు కనిపి స్తుంది. సోషల్‌ మీడియా కూడా విజృంభిం చడంతో ఏ పత్రిక ప్రచురించక పోయినా ఏదో వాల్‌ మీద తన కథను పోస్ట్‌ చేసు కోవచ్చుననే ఆత్మవిశ్వాసం కథకులకు దొరికింది.  


మొత్తంగా తెలంగాణ రాష్ట్రావతారణానంతర కథ ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండానే ముందుకు సాగిపోతోంది. ఎన్నో మౌలిక మైన ప్రశ్నలను, సమస్యలను ఎత్తిచూపి పరిష్కార మార్గాలను అన్వేషించవలసిన బృహత్తర బాధ్యతను కథ తలకెత్తుకోవాల్సి ఉన్నది.

(సంగిశెట్టి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు)

వెల్దండి శ్రీధర్‌

98669 77741


Updated Date - 2020-06-08T08:33:16+05:30 IST