తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట

ABN , First Publish Date - 2022-03-01T13:48:10+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి  ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. 


ఆంధ్రప్రదేశ్:

కర్నూలు: కొత్తపల్లి మండలం సప్త నదుల సంగమేశ్వరలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. 

రాజమండ్రి: మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు  గోదావరిలో  పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవ క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి స్నాన ఘట్టాల్లో భక్తులతో కిక్కిరిశాయి.  శివనామస్మరణతో పవిత్ర గోదావరి తీరం మారుమోగుతోంది. 

కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట ముక్త్యాల శ్రీభవానీ ముక్తేశ్వర స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పరమశివుడికి అర్చకులు అభిషేకాలు చేస్తున్నారు. ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు, రవాణా ఏర్పాట్లను భక్తుల కోసం అధికారులు సిద్ధం చేశారు. విసన్నపేట మండలం కొండపర్వ మల్లయ్యస్వామి గట్టు వద్ద  శివరాత్రి తిరునాళ్ల శోభ కనువిందు చేస్తోంది. 

గుంటూరు: జిల్లాలో మహా శివరాత్రి వేడుకల సందడి నెలకొంది.  కోటప్పకొండలో బిందే తీర్ధం అభిషేకంతో తొలి పూజలు మొదలయ్యాయి. తెల్లవారు నుంచే భక్తులకు త్రికోటేశ్వరుడి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. కృష్ణానదిలో  భక్తులు స్నానాలు చేసి శివయ్య దర్శనానికి వెళ్తున్నారు. పెదకాకాని, దైదా, సత్రశాల, చేజర్ల , క్వారీ , గోవాడ,  చిలుమూరు శివాలాయల్లో భక్తుల సందడి నెలకొంది.

ప.గో: భీమవరంలో పంచారామక్షేత్రం సోమారామం ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతోంది. గోధుమ వర్ణంలో సోమేశ్వరస్వామి  దర్శనమిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం గోదావరి నది వద్ద  భక్తులు పోటెత్తారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. ఐఎస్ జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా సుదర్శన యాగం నిర్వహించారు.  తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో స్ఫటిక లింగం దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్పటిక లింగానికి 12 నదీజలాలతో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ దంపతులు అభిషేకాలు నిర్వహించారు.  సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే చూడగలిగే ఈ స్పటిక లింగ దర్శనానికి  వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. 




తెలంగాణ: 

ఖమ్మం: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, తీర్దాల సంగమేశ్వరాలయం, మధిర మృత్యంజయేశ్వర స్వామి ఆలయాల్లో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులు తీరారు. 

భద్రాద్రి కొత్తగూడెం:  మహాశివరాత్రి సందర్బంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రామాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా భక్తులతో శైవక్షేత్రాలు కిక్కిరిశాయి. నాగుపల్లి గుట్టపై కొలువుతీరిన శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

సంగారెడ్డి: ఝరసంగం కేతకి సంగమేశ్వర  ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  తెల్లవారుజామున నుంచే శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. 

వరంగల్: జిల్లాలోని శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్మీనర్సింహాస్వామి, ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా  శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునుంచే శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దంపతులు ప్రారంభించారు. 

నాగర్ కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో అర్చకులు శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగాలను  భక్తులు దర్శించుకుంటున్నారు. నల్లమలలో శివనామస్మరణతో ఆలయం మారుమోగుతోంది. 


Updated Date - 2022-03-01T13:48:10+05:30 IST