అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు

ABN , First Publish Date - 2022-04-05T07:27:12+05:30 IST

‘వనరులు లేవని భారీ ప్రాజెక్టులకు మోకాలు అడ్డవద్దు, ఉపాధి కల్పించేందుకు విధానాలను రూపొందించండి, పేదరికం పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయవద్దు....

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు

‘వనరులు లేవని భారీ ప్రాజెక్టులకు మోకాలు అడ్డవద్దు, ఉపాధి కల్పించేందుకు విధానాలను రూపొందించండి, పేదరికం పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయవద్దు..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం దేశంలోని అత్యున్నత స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 85 మంది ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘంగా దేశ అభివృద్ధి గురించి చర్చించారు. కీలక రంగాలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్లను రూపొందించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రాలకే కాదు, జిల్లాలకు కూడా రోడ్ మ్యాప్‌లను రూపొందించాలని, వచ్చే పాతికేళ్లలో జిల్లా యంత్రాంగాలే అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని మోదీ అభిప్రాయం.


ఒక వైపు ప్రధానమంత్రి దేశ సర్వతో ముఖ పురోగతి కోసం దీర్ఘకాలిక విధానాలు రూపొందిస్తూ, అభివృద్ధి ప్రాజెక్టులకు వనరుల కొరత లేదని స్పష్టం చేస్తుంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తంగా మారుస్తున్నాయని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే దేశం శ్రీలంకగానో, గ్రీసుగానో మారే అవకాశాలున్నాయని వారు గట్టిగా అభిప్రాయపడ్డారు. పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, అక్కడి జనాకర్షక విధానాలు ఆర్థిక అరాచకత్వాన్ని సూచిస్తున్నాయని వారు అన్నారు. కేంద్రమే లేకపోతే ఈ రాష్ట్రాలు శ్రీలంక లాంటి పరిస్థితిని ఇప్పటికే ఎదుర్కొనేవని వారు అభిప్రాయపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పెట్టే ఖర్చుకు కొదవ లేదు, 2019–20తో పోలిస్తే 2021–22లో ఆ రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం ఎక్కువ అంటే రూ.2,29,779 కోట్ల మేరకు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పసుపు–కుంకుమ లాంటి పథకాలు అమలు చేస్తే జగన్ సర్కార్ నిరుత్పాదక పథకాల ద్వారా, అర్హత, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా ప్రభుత్వ డబ్బు పంచిపెట్టడం మూలంగా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అప్పులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మాత్రం కేవలం రూ.1,77,247 కోట్లు కాగా ఈ మొత్తం బడ్జెట్ అంచనాల కంటే రూ.43,433 కోట్లు తక్కువకు పడిపోయింది. ఏపీ రెవిన్యూ లోటు గత ఏడాది అక్టోబర్‌లోనే అంచనాలకు మించి 816.56 శాతం మేరకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం రెవిన్యూ లోటు రూ. 5వేల కోట్లయితే అది రూ.40,828.59 కోట్లకు చేరుకుంది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2022–23లో రాష్ట్ర రుణం రూ.4,59,394.35 కోట్లకు పెరిగిపోయింది. ఇది కాక వివిధ ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ ఇచ్చి రూ. 1,17,503 కోట్ల మేరకు అప్పులు చేసింది. వడ్డీలు కట్టడానికే రూ.21,805 కోట్లు ప్రక్కన పెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే, మొత్తం అసెంబ్లీకి చెప్పిన లెక్కల్లోనే తప్పులున్నాయని రాజ్యాంగ సంస్థ అయిన కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన తాజా నివేదికలో చెప్పడం గమనించాల్సిన విషయం. మొత్తం ఖర్చులో లక్షా 11 వేల కోట్లు అసెంబ్లీ అనుమతి లేకుండానే ఖర్చు పెట్టారని కాగ్ వెల్లడించింది. ట్రెజరీ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా సరైన లెక్కా పత్రాలు లేకుండానే నిధుల వ్యయం చేశారని, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో 30 శాతం మేరకు ఇష్టం వచ్చిన చోట్లకు మళ్లించారని తెలుస్తోంది. అనేక ఖాతాల్లో బడ్జెట్ అంచనాలకు పెట్టిన ఖర్చులకు పొంతన లేదు. రూ.48,534 కోట్ల మేరకు ఈ రకంగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మూలధన వ్యయం ద్వారా, భారీ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టి ఆస్తుల కల్పన చేసిన దాఖలాలు ఏనాడూ కనిపించలేదు. నిర్దేశించుకున్న మొత్తం పెట్టుబడి వ్యయంలో 45 శాతం లక్ష్యాన్ని సాధించలేదు. ఆఖరుకు మహిళా స్వయం సహాయ బృందాలు చెల్లించిన రూ. 2100 కోట్ల మేరకు బీమాను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. జీవిత బీమా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినందువల్ల తాము లబ్ధిదారులకు చెల్లించాలనే ఒప్పందం నుంచి ఉపసంహరించుకుంటున్నామని బహిరంగంగా ప్రకటించింది. ప్రతి రాష్ట్ర కార్పొరేషన్, విభాగాలు, బోర్డుల బ్యాంకు డిపాజిట్లను కూడా అనుత్పాదక వ్యయానికి మళ్లించారు. ఈ ఆర్థిక విధ్వంసక విధానాలనే కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మూడో వంతు లెక్కలను సర్టిఫై చేసేందుకు అది నిరాకరించింది. ఏపీలో పరిస్థితి శ్రీలంక పరిస్థితిని సూచిస్తోందా?


తెలంగాణలో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. 2020–21లో రాష్ట్ర అప్పులు రూ.2.5 లక్షల కోట్లను దాటిపోయాయి. ఎన్నిచోట్ల వీలైతే అన్ని చోట్ల తెలంగాణ సర్కార్ అప్పులు చేస్తోంది. రాష్ట్ర ద్రవ్యలోటు మిగులు ఆదాయం స్థితిని దాటిపోయి గత ఏడాది రూ.33,191 కోట్లకు చేరుకుంది. రెవిన్యూ వసూళ్లు పడిపోతుంటే రెవిన్యూ వ్యయం మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2019–20లో రూ.6,254 కోట్లున్న రెవిన్యూ లోటు 2020–21 నాటికి రూ.22,298 కోట్లకు చేరుకుందని కాగ్ తెలిపింది. తెలంగాణలో బడ్జెట్ లెక్కలతో నిమిత్తం లేకుండా 2014–15 నుంచి ఇప్పటి వరకూ రూ.1,32,547 కోట్ల మేరకు అదనంగా ఖర్చు పెట్టారని, మొత్తానికి అసెంబ్లీ ఆమోదం లభించలేదని కాగ్ స్పష్టం చేసింది. కొన్ని శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చుపెట్టని ఘనత తెలంగాణ సర్కార్‌కు దక్కుతుంది. మునిసిపల్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ శాఖ, సామాజిక సంక్షేమ శాఖ భారీ ఎత్తున నిధులను ఖర్చు పెట్టలేదు. ఆఖరుకు రైతులకు రుణ మాఫీ కోసం కేటాయించిన రూ.6,225 కోట్లలో కూడా రూ.213 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. గొప్పగా చెప్పుకుంటున్న డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి కూడా రూ. 5వేల కోట్లలో రూ. 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. తరుచుగా రిజర్వు బ్యాంకును వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ల క్రింద అప్పులడగాల్సిన దుస్థితి తెలంగాణకు ఉన్నదని ఎంతమందికి తెలుసు? గత ఏడాది ఇలా రూ.69,453 కోట్ల మేరకు రిజర్వు బ్యాంకును ప్రాధేయపడి అప్పులు తెచ్చుకున్నారు, ఆదాయాలను పెంచుకోవడానికి మార్గాలు అన్వేషించడం కన్నా అప్పులు చేయడానికే రాష్ట్రం ప్రాధాన్యతనిస్తోందని కాగ్ స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ వనరుల్లో 53.59 శాతం రుణాలనుంచే వస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపుల్లో నాలుగోవంతు రుణాలు తిరిగి చెల్లించేందుకే సరిపోతుందని ఎత్తి చూపింది. విచిత్రమేమంటే తమ ఆర్థిక వ్యవస్థను తాను చక్కదిద్దుకోలేక ముఖ్యమంత్రి కేసిఆర్ కేంద్రం ధాన్యం కొనలేదని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని బిజెపికి వ్యతిరేకంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్, కేసిఆర్ లాంటి గురివింద గింజలకు తమ నలుపు ఎప్పుడూ కనిపించదు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-04-05T07:27:12+05:30 IST