‘నరేగా’ దోపిడీలో తెలుగు రాష్ట్రాలే ముందు!

ABN , First Publish Date - 2022-01-05T07:47:52+05:30 IST

‘‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (‘నరేగా‘)లో సగటు దినసరి వేతనాలు దేశంలో అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో రోజుకు రూ.312 కాగా తెలంగాణా రాష్ట్రంలో అత్యంత అల్పంగా రూ.172.73....

‘నరేగా’ దోపిడీలో తెలుగు రాష్ట్రాలే ముందు!

‘‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (‘నరేగా‘)లో సగటు దినసరి వేతనాలు దేశంలో అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో రోజుకు రూ.312 కాగా తెలంగాణా రాష్ట్రంలో అత్యంత అల్పంగా రూ.172.73.‘‘ ఇది రాజ్యసభ సభ్యురాలు గీత అలియాస్ చంద్రప్రభ పార్లమెంట్‌లో ఇటీవల అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ నుంచి వచ్చిన జవాబు. గౌరవ సభ్యురాలు ఏ ఉద్దేశ్యంతో ప్రశ్న అడిగినా తెలుగు రాష్ట్రాలలో ‘నరేగా’ వేతనాల చర్చ మరలా తెర పైకి వచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో 2021–22 సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన ‘నరేగా’ దినసరి వేతనాలు రోజుకు రూ.245 కాగా, కార్మికులు కేవలం రూ.173 (71శాతాన్ని) మాత్రమే పొందుతున్నారు. దీనినే కొంచం లోతుగా చెప్పాలంటే సాలీనా 100 రోజుల పాటు పని చేసిన కార్మికులు రూ.24,500 పొందాల్సి ఉండగా కేవలం రూ.17,300 మాత్రమే పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఐతే ఈ రాష్ట్రంలో 2018–19 నుంచి అమలులోకి వచ్చిన రెండు మస్టర్ల పద్ధతి వలన సగటు వేతనాల ‘అసలు నంబర్లు’ అందుబాటులో లేవు. కానీ 2018–19 ముందు పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి తెలంగాణాకు భిన్నంగా లేదని అర్థమవుతుంది.


‘నరేగా’ వేతనాలకు సంబంధించి రెండు ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి: మొదటిది ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలు తక్కువగా ఉండడం, రెండోది నిర్దేశించిన వేతనాలు సైతం కార్మికులకు పూర్తిగా అందకపోవడం. ఇందులో మొదటి సమస్య దేశంలో దాదాపు 33 రాష్ట్రాలలోనూ అగుపిస్తుండగా తెలుగు రాష్ట్రాలలో మరింత తీవ్రంగా ఉంది. ఇక రెండవ సమస్య మాత్రం చాలా మటుకు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం.  


ముందుగా ‘నరేగా’లో వేతనాలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. గ్రామీణ ఉపాధి హామీ చట్టం– వేతనాలను నిర్ణయించే హక్కును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దానికోసం రెండు మార్గాలను సూచించింది. మొదటిది కనీస వేతనాల చట్టాన్ని బట్టి ‘నరేగా’ వేతనాలు నిర్ణయించడం, రెండోది ప్రత్యేకంగా ‘నరేగా’ వేతనాల్ని నోటిఫై చేయడం. అంటే ‘నరేగా’లో ‘కనీస వేతనాల చట్టం–1948’ని అనుసరించడమో లేదో అనేది కేంద్ర ప్రభుత్వ ఇష్టానికి వదిలేసింది.


‘నరేగా’ పథకం అమలు 2006లో ప్రారంభం కాగా 2008 చివరి వరకు రాష్ట్రాలు కనీస వేతనాల చట్టం ఆధారంగా నిర్ణయించిన వేతనాల్ని చెల్లిస్తూ వచ్చారు. ఐతే 2009 జనవరి ఒకటవ తేదీన ‘నరేగా’ వేతనాలను నోటిఫై చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రెండో మార్గాన్ని ఎన్నుకున్నట్లు అయ్యింది. వేతనాలను నోటిఫై చేయడానికి కేంద్రం, వ్యవసాయ కార్మికుల వినియోగదారుల సూచీని ఉపయోగించుకుంది. కార్మికులకు పని హక్కు కల్పించడానికి ఉద్దేశించబడిన చట్టంలో, బలవంతపు శ్రమ దోపిడీ నుంచి కార్మికులను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాన్ని పక్కనపెట్టడం అసలు విషాదం. పార్లమెంటు ఈ విధంగా కార్మికుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా దేశంలో ఉన్నత న్యాయస్థానాలు మాత్రం ఈ చర్యల్ని పలుమార్లు తప్పుపట్టాయి.


కార్మికులను దోపిడీ నుంచి కాపాడి, వారికి హక్కులను కల్పించే ‘కనీస వేతనాల చట్టాన్ని’ ఒక సాధారణ చట్టం ద్వారా తొలగించడం వీలుపడదని కర్ణాటక హైకోర్టు డివిజనల్ బెంచ్ 2011లో తేల్చి చెప్పింది. అలాగే ‘నరేగా’లో కనీస వేతనాల చట్టాన్ని అనుసరించకపోవడం భారత రాజ్యాంగం ఆర్టికల్ 23కు వ్యతిరేకమని అన్నది. కనీస వేతనాల చట్టాన్ని అనుసరిస్తూ ‘నరేగా’ వేతనాలు చెల్లించాలని, తీర్పు తేదీ నాటికి తక్కువగా ఇచ్చిన వేతనాలను కార్మికులకు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం చేసిన అప్పీలును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కూడా కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని బలపరచింది.


ఇదే విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు ఒకే రాష్ట్ర ప్రభుత్వం ఒకే పనికి పథకాన్ని బట్టి వేర్వేరు వేతనాలు ఎలా చెల్లిస్తారని అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నరేగా’ వేతన నోటిఫికేషన్‌ను కొట్టివేశారు. ఈ కేసును ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ వాదించారు.


అసలు ‘నరేగా’ చట్టం అమలులోకి రాకముందే రాజస్థాన్‌లో కరువు పనులలో కనీస వేతనాల చట్టం అమలు జరగడం లేదని దాఖలైన పిటిషన్‌కు బదులిస్తూ ప్రభుత్వం– కరువు పనులు ప్రత్యేక సందర్భం కోసం ప్రజలకు కల్పిస్తున్న పనులు కాబట్టి వాటిలో కనీస వేతనాలు చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదని వాదించింది. ఈ వాదనలను కొట్టేసిన సుప్రీంకోర్టు, కనీస వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఒత్తిడి చేయడం మాత్రమే కాక అందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం కూడా బలవంతపు శ్రమ క్రిందికే వస్తుందని పేర్కొంది. అలానే యూపీఏ ప్రభుత్వం 2014లో ఏర్పరచిన ‘మహేంద్ర సింగ్ కమిటీ’, తన నివేదికలో ‘కనీస వేతనాల చట్టం’ నిర్దేశించిన వేతనాలు లేదా ‘నరేగా’ వేతనాలలో ఏవి ఎక్కువగా ఉంటే వాటిని ‘‘నరేగా’ పథకంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. 


కోర్టు తీర్పులు, కమిటీల సిఫార్సులు ఎన్ని చెప్పినా, పథకం ప్రారంభమై పదిహేనేళ్లు దాటినా ‘నరేగా’ వేతనాల్ని కనీస వేతనాలతో అనుసంధానం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలలో ‘నరేగా’ వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన చట్టం ప్రకారం ఉండాల్సిన వేతనాలతో పోల్చితే 68 శాతం తక్కువ.


ఇక ఇప్పటికే తక్కువగా ఉన్న ప్రభుత్వ నిర్దేశిత వేతనాలు సైతం తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నకు జవాబు వెదకుదాం. తెలుగు రాష్ట్రాలలో ‘నరేగా’ పథకంలో పనులకు నిర్దేశించిన వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయని కార్మికులు ఎప్పటినుంచో వాపోతున్నారు. ఉదాహరణకు ‘నరేగా’లో 5 మీ. పొడవు, 5 మీ. వెడల్పు, 2 మీటర్ల లోతు ఇంకుడు గుంత తవ్వడానికి మట్టి స్వభావాన్ని బట్టి గరిష్టంగా 150 రోజుల పని దినాలు కేటాయించారు. ఇప్పుడిక ఇద్దరు కార్మికులు ఇంకుడు గుంత తవ్వే పని చేస్తే– వారు ఎన్ని రోజులలో పూర్తి చేసారనే దానితో నిమిత్తం లేకుండా ఒక్కొక్కొరికీ రోజుకు రూ.245, చొప్పున 75 రోజుల వేతనాలు చెల్లిస్తారు.


కానీ ఇంకుడు గుంత పనిలో మొదటి ఒక మీటరు తవ్వడం సాపేక్షంగా సులభమైనా లోతుకు తవ్వుతున్న కొద్దీ గట్టి నేలలు, రాతి నేలలు ఉన్న చోట తవ్వడం చాలా కష్టమవుతుంది. అందువలన 75 రోజులూ పని చేసినా కార్మికులు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయలేకపోతున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. పూర్తి చేయలేకపోయిన మేరకు వేతనాల్ని మినహాయించి– పూర్తి చేసిన పనికి మాత్రమే వేతనాలు చెల్లించడం వలన కార్మికులకు చాలా తక్కువ వేతనాలు లభిస్తున్నాయి.


చెరువులు, బావుల పూడికతీత పనులు, కందకాల తవ్వకంతో సహా పలు పనులలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం వేసవి కాలంలో ప్రత్యేక భృత్యం చెల్లిస్తున్నా, కార్మికులకు వేతనాలు గిట్టుబాటు కావడం లేదు. చేయాల్సిన పనుల కొలతలకు సంబంధించి కార్మికులకు సరైన అవగాహన లేకపోవడం వలన కూడా వారు తమకు అప్పగించిన పనులను పూర్తి చేయకపోవడం, తద్వారా వారు తక్కువ వేతనాలు పొందడం మేం గమనించాం. వేతనాలు తక్కువగా ఉండడం వలన కొంత మంది కార్మికులైతే రోజుకు 3–4 గంటలు మాత్రమే ‘నరేగా’ పని చేసి వేరే పనులకు వెళ్లిపోతుంటారు. ఇలాంటి చర్యల వల్ల ‘నరేగా’ పనుల నాణ్యత కూడా దెబ్బతింటుంది.


ఈ స్థితిలో ‘నరేగా’ వేతనాలను కనీస వేతనాలతో అనుసంధానం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం, కేంద్రం ఒప్పుకునేవరకు రాష్ట్రాలే ఆ భారం భరించడం, ‘నరేగా’ పనులలో పని దినాల కేటాయింపు పెంచడం, తద్వారా వేతనాలు పెంచడం... రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. ఇక కేంద్ర ప్రభుత్వం ఐతే మరో మాట లేకుండా ‘‘నరేగా’ వేతనాల్ని కనీస వేతనాలతో అనుసంధానం చేసి కార్మికులందరూ జీవన వేతనాలను పొందే ఏర్పాటు చేయాలి. కార్మికులకు కొలతలపై అవగాహన కల్పించడం, అప్పగించిన పనులను సక్రమంగా చేయాల్సిన అవసరం గురించి సెన్సిటైజ్ చేసే కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు భాగం పంచుకోవాలి. ఇదేదో ‘నరేగా’ కార్మికులకు వేతనాలు తక్కువగా రావడం అనే సమస్యగా మాత్రమే కాకుండా పేద ప్రజల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ప్రశ్నగా చూసినప్పుడే మాత్రమే సరైన పరిష్కారం సాధ్యం.

చక్రధర్ బుద్ధ 

గజ్జలగారి నవీన్ కుమార్ 

అజయ్ పల్లె

Updated Date - 2022-01-05T07:47:52+05:30 IST