తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2020-10-19T02:08:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కి.మీ మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ కూడా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల నుంచి అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


 తెలంగాణలో ఇలా..

మరోవైపు.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాంధ్ర తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉండటంతో దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని.. తద్వారా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-10-19T02:08:28+05:30 IST