కవిత్వం రాసిన తెలుగు సోక్రటీస్‌

ABN , First Publish Date - 2022-07-04T06:43:26+05:30 IST

ఒక కవి మరణానంతరం వో ముప్ఫైయేళ్ళకి అతడి అముద్రిత కవిత్వం ప్రచురితం కావటం కంటే గొప్ప సంగతి యీ లోకంలో యేముంటుంది? ఆ కవి పల్లవ హనుమయ్య!...

కవిత్వం రాసిన తెలుగు సోక్రటీస్‌

ఒక కవి మరణానంతరం వో ముప్ఫైయేళ్ళకి అతడి అముద్రిత కవిత్వం ప్రచురితం కావటం కంటే గొప్ప సంగతి యీ లోకంలో యేముంటుంది? ఆ కవి పల్లవ హనుమయ్య! ఆ కవితా సంపుటి ‘యుగోదయంలో నా ప్రార్థన’! యిక్కడొక వైచిత్రి యేమిటంటే పుస్తకాని కంటే ముందు యీ పుస్తకానికి ఇస్మాయిల్‌ రాసిన ముందు మాట వెలువడి హను మయ్య కవిత్వపుటౌన్నత్యాన్ని లోకానికి విశదపర్చటం! 


మన అదృష్టం కొద్దీ తెలుగునేలపై పుట్టి మన మధ్య నడయాడాడు యీ కవి! ప్రపంచంలో యింకే ప్రాంతంలో పుట్టినా, గుర్తించి నెత్తిన పెట్టుకొని కీర్తించి వుండే వాళ్ళు. కేవలం మన అరసికత, అలక్ష్యత కారణంగా విస్మృత కవిగా మిగిలిపోయాడు హనుమయ్య. ఐనా, అతణ్ణి, అతడి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళకి కొదవ లేదు. వావిలాల, ఇస్మాయిల్‌, పరుచూరి రాజారామ్‌, పెనుగొండ, బత్తుల అనిల్‌, నామాడి శ్రీధర్‌... ఇంకాయెందరో!


వావిలాల సుబ్బారావు గారు ఇన్నేళ్ళు హనుమయ్య గారి కవిత్వాన్ని పదిలపరచి యిప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి హనుమయ్య గారి పట్ల తన అభిమానాన్ని, అనురక్తిని చాటుకున్నారు. సుబ్బారావుగారికి తెలుగు సాహిత్య ప్రపంచం ఋణపడిపోయింది.


హనుమయ్య కవిత్వంలో ఒక జ్వాల వుంది. అది అతని జ్వలించే హృదయ జ్వాలే కాని వేరొకటి కాదు. అందుకే అతడి కవిత్వం సూర్యకాంతి కిరణ సముచ్ఛయమై వెలుగులీనుతుంది. యింతలా స్వయం ప్రకాశకులైన కవులు తెలుగునాట సకృత్తు. యేం రాసినా, నిజాయితీగా రాశాడు. నిజాయితీ వున్న కవిత్వం కనుకనే కాలానికి నిలబడింది.


అజంతా తన జీవిత కాలంలో రాసిన కవితలు మహా వుంటే, వో యాభై వుంటాయేమో? శీర్షికలు వేరు కాని అవన్నీ వొకే కవితకి పలు రూపాంతరాలు! మృత్యు వేదన, లేదూ, జీవన విషాదం... యిదే అంశం చుట్టూ రాసిందే రాశాడు. వొకే అనుభవాన్ని ఆలంబన చేసుకొని అదే అనుభవాన్ని రాస్తూ పోయాడు. కానీ, హనుమయ్య అలాక్కాదు. జీవితంలోని ప్రతి వొక అనుభవాన్ని అత్యంత చాకచక్యంగా కవిత్వంగా సృజించాడు. అందుకే, హనుమయ్య కవిత్వం జీవితమంత నవ నవోన్మేషం!


వొక సందర్భంలో శ్రీశ్రీతో, ‘‘రాసిందే రాస్తే అది కవిత్వం యెట్లా ఔతుంది? పువ్వు వొకసారే పూస్తుంది. అదే పువ్వు పదే పదే పూయదు అన్నాడు హనుమయ్య! అదే నిబద్ధతతో అనిబద్ధ జీవితానికి రెక్కలు తొడిగి అనిబద్ధ కవిత్వంగా ఎగరేశాడు హనుమయ్య!


హనుమయ్యగారిని తలుచుకున్నప్పుడు నాకు నరసరావుపేటలో ప్రతిభావంతుడైన వైద్యుడు అయివుండి కూడా, పిచ్చివాడిగా ముద్రపడిన డాక్టర్‌ నాయుడు వెంకయ్య గారు గుర్తుకొస్తారు. డయాగ్నోసి్‌సలో కానీ, ట్రీట్మెంట్‌పరంగా కానీ తిరుగులేని వైద్యుడు. తన వొంటిని గురించిన స్పృహ లేదు. యెలాంటి వస్త్రధారణలో వున్నా ఆఖరికి లుంగీ బనీనులో వున్నా కూడా అలాగే పేషేంట్‌లని చూట్టానికి వచ్చేసే వాడతను! ప్రెస్టేజ్‌ లేదు. శషభిషలు అంతకంటే లేవు. రోడ్డుపై వెడుతోన్న ఊరేగింపు లోకి చొరబడేవాడు. ఆ డప్పుకి అనుగుణంగా అడుగులేసే వాడు. కుహనా విలువల్తో పని లేకుండా యెవర్నీ లక్ష్య పెట్టకుండా తనదైన పద్ధతిలో జీవించాడు డాక్టర్‌ నాయుడు వెంకయ్య. కవిగా హనుమయ్య కూడా అలాంటి వాడే. నాకు తెలిసినంతలో కేవలం కవి మాత్రమే కాదు విద్రోహీ, విప్లవకారుడు కూడా హనుమయ్య. మహా ప్రవక్త! అద్భుతమైన ఆలోచనాశీలి! యెవరి తోనూ పోల్చటానికి వీల్లేని అపురూప కవి! తెలుగు వారి సోక్రటీస్‌ హనుమయ్య! ఓ కవితలో యిలా అంటాడు: ‘‘జీవితానికి జీవులంటే/ ప్రయోజనాతీతమైన ఇష్టాగోష్టి/ అయినా,/ పసిపిల్లలకు పాలివ్వాలని/ రసలుబ్ధులకు పానకం పోయాలని/ భయస్థులకు బ్రాందీ తాపాలని/ సోక్రటీసును మాత్రమే విషపాత్రికతో సవాలు చేయాలని/ దానికి తెలుసు’’. హనుమయ్య సోక్రటీస్‌ లాగే బతికాడు. నీతో నాతో కాక తనతో తాను సంభాషించుకున్నాడు. తనను తాను అన్వేషిస్తూ, అంతరాళాల కీకార ణ్యాల్లోకి ప్రవేశించిన సాహసికుడు. ‘స్కిజోఫ్రెనిక్‌’గా ముద్రపడిన అతడు, తను నమ్మిన జీవన వాస్తవికత కోసం విషాన్ని గ్రోలిన శిలాలోలితుడు.

రవూఫ్‌

98490 41167


Updated Date - 2022-07-04T06:43:26+05:30 IST