అల్ బాహాలో ఆహ్లదకరంగా తెలుగు ఆత్మీయ సమ్మేళనం ‘ఈద్ మిలాప్’

ABN , First Publish Date - 2022-05-17T23:58:07+05:30 IST

సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో అల్ బాహాలో సరిగ్గా ఈ అపూర్వ సన్నివేశం కనిపించింది.

అల్ బాహాలో ఆహ్లదకరంగా తెలుగు ఆత్మీయ సమ్మేళనం ‘ఈద్ మిలాప్’

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలు.. ప్రత్యేకించి సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది అగ్ని గుండాన్ని తలపించే సువిశాల ఎడారులు. ఈ రకమైన నైసర్గిక స్వరూపం కల్గిన ప్రాంతంలో ఒయాసిస్సు.. ఆకుపచ్చని తోటలు, ఎత్తయిన కొండలు, గుహాలతో పకృతి  సౌందర్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.  ఇలాంటి వాతావరణంలో  సంప్రదాయక జీవన శైలీను అనుసరించే బలిష్ఠులైన అరబ్బు తెగల ప్రజల మధ్య భారతీయులు కనిపిస్తే ఎనలేని ఆనందం. ఆ ప్రదేశాల్లో నలుగురు తెలుగు వాళ్ళు గుమిగూడితే ఆ దృశ్యం మరెంతో చూడముచ్చటగా ఉంటుంది.


సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో అల్ బాహాలో సరిగ్గా ఈ అపూర్వ సన్నివేశం కనిపించింది. ఈ రాష్ట్రం పర్యాటక రంగానికి పెట్టింది పేరు. చారిత్రాత్మక కట్టడాలు, చెరువులు ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి  సదూర ప్రాంతాల నుండి భారతీయులతో పాటు అనేక మంది వస్తుంటారు. అల్ బాహాలో వ్యవసాయ క్షేత్ర కార్మికులు, ఒంటెల కాపరులు, ఇతర వృత్తులతో పాటు తెలుగు డాక్టర్లు, స్ధానిక అల్ బాహా విశ్వవిద్యాలయంలో పని చేసే ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అల్ బాహాలోని విజయనగరానికి చెందిన తెలుగు ప్రవాసీ ప్రముఖులు  డాక్టర్ బుడి పైడి రాజు, డాక్టర్ చంద్రిక, బెంగళూరుకు చెందిన డాక్టర్ నాగేశ్వర్ , అనంతపురానికి చెందిన అనిత, హైద్రాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ పసుపులేటి నాగరాజు, లక్ష్మి నెల్లూరుకు చెందిన డాక్టర్ దీపక్ రేహాన్ తమ ప్రాంతంలో తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తెలుగు వారందర్నీ ప్రవాసీ తెలుగు సంఘమైన సౌదీ అరేబియా తెలుగుసేన అధ్వర్యంలో ఆహ్వానించడానికి నిర్ణయించుకోన్నారు. ఈద్ మిలాప్ పేర ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా తెలుగుసేన అధ్యక్షుడు శాంతి మల్లేశన్ పూర్తి తోడ్పాటందించారు. దీంతో అల్ బాహాలోని తెలుగు వారిని కలిసేందుకు సదూర ప్రాంతాల నుండి అనేక తెలుగు కుటుంబాలు అల్ బాహాకు చేరుకోన్నారు. ఉరుకలేసిన ఉత్సాహంతో రెండు రోజులు సరదాగా గడిపిన తెలుగు కుటుంబాలకు అతిథ్యం ఇవ్వడానికి అల్ బాహాలోని డాక్టర్లు నాగేశ్వర్, పైడిరాజు, దీపక్ లు పోటిపడ్డారు. జెద్ధాలోని తెలుగు గాయకుడు అంజద్ హుస్సేన్ తన తెలుగు మరియు హిందీ సినీ పాటలతో సభికులను అలరింపజేసారు.


ప్రప్రధమంగా తెలుగు కుటుంబాలతో ఆత్మీయుత సమ్మేళనం జరుపుకోవడం అమితానందాన్ని కల్గించిందని అల్ బాహాలో నివసించే హైద్రాబాద్ కు చెందిన పసుపులేటి లక్ష్మి చెప్పారు. పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలతో పాటుగా వారి ఇళ్ళ ఇరుగుపొరుగులలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయ కుటుంబాలు కొన్ని తెలుగు వారితో పాటు కలిసి పాల్గోనడం ఈ సారి ప్రత్యేకత. కుల మతాలకు అతీతంగా తెలుగు తీయనితనంతో ఈద్ మిలాప్ ఆత్మీయ సమ్మేళనం తెలుగువారందర్ని ఒక్కటిగా చేసిందని జిజాన్‌లో నివసించే సలీం బాషా పెర్కోన్నారు.  ఎడారిలో తెలుగు తీపితనం మధురమైందని యాన్బూలో పని చేసే కె. కాశీరాజ్ వ్యాఖ్యానించారు. ఈ రకమైన ఆత్మీయ సమ్మేళనాలు మరింత జరగాలని అనిత ఆశాభావం వ్యక్తం చేసారు. ఉగాది ఘనంగా నిర్వహించిన తాము ఇప్పుడు ఈద్ ను నిర్వహించామని, మున్ముందు అల్ ఖోబర్‌లో కూడా మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సౌదీ అరేబియా తెలుగు సేన అధ్యక్షుడు శాంతి మల్లేశన్ వెల్లడించారు. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగు వారందర్ని ఒక చోట తీసుకోవరావడానికి తాము ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన పెర్కోన్నారు.  



Updated Date - 2022-05-17T23:58:07+05:30 IST