డ్రగ్స్ కేసుల్లో తెలుగువాళ్లు

ABN , First Publish Date - 2021-10-06T13:08:55+05:30 IST

మనకు తెలియకుండా మన సమాజంలో మత్తుపదార్థాల వినియోగం క్రమేణా విస్తరిస్తోంది. యువతీయువకులు తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. ఈ జాడ్యం ఎంతగా పెచ్చరిల్లిపోయిందో తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు విశదం చేస్తున్నాయి.

డ్రగ్స్ కేసుల్లో తెలుగువాళ్లు

మనకు తెలియకుండా మన సమాజంలో మత్తుపదార్థాల వినియోగం క్రమేణా విస్తరిస్తోంది. యువతీయువకులు తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. ఈ జాడ్యం ఎంతగా పెచ్చరిల్లిపోయిందో తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు విశదం చేస్తున్నాయి. 


భారత్, గల్ఫ్ దేశాల మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతులలో అత్యధిక భాగం అరేబియా సముద్ర తీరంలోని గుజరాత్ నౌకాశ్రయాలు కాండ్లా, ముంద్రాల మీదుగా జరుగుతాయి. నిత్యం రద్దీగా ఉండే ముంద్రా ఓడరేవులో ఇరాన్ నుంచి వచ్చిన మూడు టన్నుల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో ఒక విహారయాత్ర నౌకపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మరికొంతమంది పట్టుబడ్డారు. ఈ రెండు సంఘటనలు, ముఖ్యంగా షారూఖ్ తనయుడి అరెస్ట్ ఎక్కడెక్కడి భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చట్టం నిర్దేశించిన పరిమాణంలో కంటే అధికంగా మాదకద్రవ్యాలను కలిగి ఉన్న కారణంగా ఆర్యన్ తదితరులను ఎన్‌సీబీ అదుపులోకి తీసుకున్నది. డ్రగ్స్ సంబంధిత    ఆరోపణలపై ఇటీవల తెలుగు సినీ ప్రముఖులను కూడా ఎన్‌సీబీ ప్రశ్నించింది. 


మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ గల్ఫ్ దేశాలలో మరణశిక్ష లేదా ఇతర కఠోరశిక్షలకు గురయిన పాకిస్థానీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ఈ అక్రమ రవాణా పాకిస్థానీయులకు ఒక సాధారణ కార్యకలాపం. భారతీయులు ఇటువంటి నేర కార్యకలాపాలకు దూరంగా ఉండడం కద్దు. అయితే ఇప్పుడు ఆ పరిస్ధితి మారుతోంది. హైదరాబాద్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు.


గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం నిత్యం అనేక మంది వస్తుంటారు. అలాగే అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల వీసాలకు ప్రయత్నిస్తున్నవారు తమ ట్రావెల్ ప్రొఫైల్ కోసం ముందుగా గల్ఫ్ దేశాలను సందర్శించడం పరిపాటిగా ఉంది. ఇలాంటి యువతను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా హాషీష్, గంజాయి మొదలు నిద్రబిళ్లల వరకు అన్ని రకాల మాదకద్రవ్యాలను గల్ఫ్‌కు రవాణా చేయడానికి స్మగ్లింగ్ ముఠాలు భారత్‌లో పకడ్బందీగా పని చేస్తున్నాయి. వివిధ కారణాల దృష్ట్యా, తెలుగు రాష్ట్రాలలోని పోలీసులు ఈ చట్టవిరుద్ధ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అసలు నేరస్థులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో స్మగ్లింగ్ ముఠాల వలలో అనేకమంది మౌనంగా ఇరుక్కుపోతున్నారు. ఇటువంటివారి వెతలు బాహ్యప్రపంచానికి తెలియడం లేదు.


హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు రెండు వేర్వేరు డ్రగ్స్ రవాణా కేసులలో ఖతర్ జైలులో కొన్నాళ్ళుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అంబర్‌పేటకు చెందిన ఒక యువకుడు దోహాకు వస్తూ, తన సమీప బంధువు ఇచ్చిన ఒక బ్యాగ్‌ను కూడా తీసుకువచ్చాడు. దోహా విమానాశ్రయంలో జరిగిన తనఖీలో ఆ బ్యాగ్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్టు వెల్లడయింది. దీంతో న్యాయస్థానం ఆ యువకుడికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష, 41.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. తెలియక చేసిన ఈ నేరం విషయమై భారత్‌లో ఎవరి వద్దా ఎటువంటి ఫిర్యాదు చేయవద్దని బ్యాగును అందించిన సమీపబంధువు ఆ యువకుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలిసింది. తమ కుమారుడు అమాయకుడని, నిజానికి అమెరికా లేదా కెనడా వెళ్ళి స్థిరపడాలనుకున్నాడని ఆ యువకుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. అమెరికా వీసా ఎండార్స్ కావాలంటే ప్రపంచంలోని ఇతరదేశాలు పర్యటించి వస్తే వీసా సులువుగా దొరుకుతుందని చెప్పి నాలుగు రోజుల పర్యటనకై ఖతర్‌కు పంపించి, డ్రగ్స్ కేసులో ఇరికించారని వారు వాదిస్తున్నారు. గల్ఫ్‌లో మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడుతున్న తెలుగు రాష్ట్రాల యువకుల కుటుంబాలు సరిగ్గా ఇదే వాదన చేస్తున్నాయి. వీరందరూ హైదరాబాద్ నుంచి వస్తూ మాదకద్రవ్యాలతో పట్టుబడ్డారనేది గమనార్హమైన వాస్తవం. 


దుబాయి, కువైత్ దేశాలలో మాదకద్రవ్యాల అక్రమరవాణాలో పట్టుబడి జైలుశిక్షలు అనుభవిస్తున్న వారి మూలాలను వెలికితీయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు విఫలమవుతున్నారు. కువైత్‌లో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన అనేకమంది యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అడిచర్ల రజనీకాంత్ దుబాయిలో ఉద్యోగి. అతడు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకువస్తుండగా, దుబాయి విమానాశ్రయంలో పోలీసులు ఆ విషయాన్ని గుర్తించారు. అయితే వ్యూహాత్మకంగా అతన్ని చూసీచూడనట్లుగా వదిలిపెట్టారు. ఆ తరువాత అతని పై పూర్తి నిఘా ఉంచారు. ఈ విషయం తెలియని ఆ యువకుడు డబ్బు తీసుకుని ఒక వ్యక్తికి డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుబాయి కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. షార్జా విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఖమ్మం జిల్లా వాసి పద్మ కేసులో కూడా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని న్యాయస్థానం ఆమెకు యావజ్జీవ శిక్ష విధించింది. మాదకద్రవ్యాల వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతోంది. కూలీల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు వాటి బారిన పడుతున్నారు. ముంద్రాలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత కూడా మాదకద్రవ్యాల నియంత్రణపై దేశం అలసత్వం వహిస్తే ఎలా?


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-10-06T13:08:55+05:30 IST