అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన ప్రవాసాంధ్రులు..!

ABN , First Publish Date - 2020-07-05T21:47:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతుల

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన ప్రవాసాంధ్రులు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసులు సంఘీభావం తెలిపారు. కువైట్, సౌది అరేబియా, ఖతర్, బహ్రెయిన్, ఒమన్, దుబాయిలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు.. ‘ఒక రాష్ట్రం- ఒకే రాజధాని’, ‘సేవ్ అమరావతి’ అని నినాదాలు చేస్తూ, రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. కరోనా కారణంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, కొవ్వొత్తులు పట్టుకుని నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకరరావు కువైట్ నుంచి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని సాధించి తీరుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని ఎంతో అవసరం అన్న ఆయన.. భావితరాలకు అమరావతి సంపదను  సృష్టిస్తుందన్నారు. అనంతరం సౌది అరేబియా నుంచి రావిరాధాకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిని చంద్రబాబు మొదలుపెట్టారు కాబట్టే.. వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మంచిదికాదన్నారు. అంతేకాకుండా అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆయన  డిమాండ్ చేశారు. బహ్రెయిన్ నుంచి తక్కెళ్లపాటి హరిబాబు మాట్లాడుతూ.. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలను త్యాగం చేస్తే.. ఇప్పటి ప్రభుత్వం రైతుల త్యాగాన్ని పట్టించుకోకుండా, మూడు రాజధానిల పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేస్తుందన్నారు. చివరిగా మలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. 200 రోజులుగా రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఆయన నివాళులర్పించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకుని, రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. 



Updated Date - 2020-07-05T21:47:52+05:30 IST