న్యూజెర్సీలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం !

ABN , First Publish Date - 2020-10-02T15:56:13+05:30 IST

తెలుగు వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషాద ఘటన న్యూజెర్సీలోని ప్లేయిన్స్‌బొరో చోటుచేసుకుంది.

న్యూజెర్సీలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం !

గుండెలు పిండేసే విషాదం

తెలుగు వ్యక్తి మసూద్ అలీ గుండెపోటుతో హఠాన్మరణం

పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు

ప్లేయిన్స్‌బొరో, న్యూజెర్సీ: తెలుగు వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషాద ఘటన న్యూజెర్సీలోని  ప్లేయిన్స్‌బొరో చోటుచేసుకుంది. ఏపీలోని అనంతపూర్‌కు చెందిన మసూద్ అలీ(40) గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, 7 ఏళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. కుమార్తె అర్షియా పుట్టినరోజు(అక్టోబర్ 1) కావడంతో సాయంత్రం బెలూన్లతో అలంకరించడానికి తన అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో అతను తన అపార్ట్మెంట్ ముందే కుప్పకూలిపోయారు. దాంతో మసూద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబంలో మసూద్ అలీ మాత్రమే సంపాదించే ఏకైక వ్యక్తి. 


ఈ దురదృష్టకర సంఘటన తర్వాత మసూద్ కుటుంబం సహాయం కోసం నాట్స్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. దీంతో నాట్స్ న్యూజెర్సీ బృందం మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, శ్యామ్ నాళం, చంద్రశేఖర్ కొణిదెల, సూర్య గుత్తికొండ హుటాహుటిన వారి ఇంటికి వెళ్లింది. వారి కుటుంబాన్ని పరామర్శించి నాట్స్ నుండి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


కాగా, మసూద్ కుటుంబం అతని పార్ధీవదేహాన్ని స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. దాంతో మసూద్ పార్ధీవదేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. హెచ్1 స్టేటస్‌లో ఉన్న మసూద్ అలీ.. తన భార్య, కూతురును కొద్ది నెలల క్రితమే ఇండియా నుంచి అమెరికాకు రప్పించుకున్నారు. కరోనా నేపథ్యంలో బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. దురదృష్టవశాత్తు మసూద్ అలీకు కానీ అతని భార్య అయేషాకు కానీ ఇక్కడ స్నేహితులు, కుటుంబ బంధువులు కూడా లేరు. దీనికి తోడు మసూద్‌కు స్నేహితులు లేరు, పొరుగువారితో కూడా అంతగా పరిచయం లేదు. ఈ సమయంలో మనమందరం ఈ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని నాట్స్ సభ్యులు పేర్కొన్నారు. 


నాట్స్ హెల్ప్‌లైన్‌కి ఈ వార్త తెలిసిన వెంటనే నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహన్ మన్నవ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ టీం, న్యూ జెర్సీ చాప్టర్ చూపించిన చొరవను చైర్మన్ శ్రీధర్ అప్పస్సాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే అభినందించారు. అమెరికాలో తెలుగు వారికి ఏ కష్ట మొచ్చినా ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) హెల్ప్ లైన్ 1-888-4-Telugu (1-888-483-5848) పిలుపుకు స్పందించి తమ దాతృత్వాన్ని https://www.natsworld.org/donate-now/ or 

https://www.gofundme.com/f/Masood-Ali-Family-Support ద్వారా చాటుకుని సాటి తెలుగు కుటుంబానికి సహాయ పడాలని కోరింది.   


Updated Date - 2020-10-02T15:56:13+05:30 IST