తెలుగు భాషను పరిరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-21T06:46:20+05:30 IST

తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అంతకంటే మిన్నగా తెలుగు భాషను ప్రేమించాలని, ఈ క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుండి తెలుగుభాషను పరిరక్షించుకోవాలని రాష్ట్ర శాసన మండలి తెలుగుభాషా, సంస్కృతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ అన్నారు.

తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యం

రాష్ట్ర శాసన మండలి తెలుగు భాషా సంస్కృతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ షరీఫ్‌ 

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 20 : తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అంతకంటే మిన్నగా తెలుగు          భాషను ప్రేమించాలని, ఈ క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుండి తెలుగుభాషను పరిరక్షించుకోవాలని రాష్ట్ర శాసన మండలి తెలుగుభాషా, సంస్కృతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి తెలుగుభాషా సంస్కృతి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీలు పీవీఎన్‌ మాధవ్‌, వి బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగుభాష అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఇబ్బందుల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా చైౖర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ తెలుగుభాష వికాసం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కమిటీ అధ్యయనం చేస్తున్నదన్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ తెలుగుభాష మాట్లాడేవారి ఇబ్బందులు తెలుసుకుంటున్నామన్నారు. ఇప్పటికే తంజావూరులో పర్యటించామని, గురువారం ఒడిశా బరంపురం వెళుతున్నామన్నారు. తెలుగుభాష వికాసం కోసం జరుగుతున్న కృషిలో ఏమైనా ఇబ్బందులుంటే అర్థం చేసుకుని వాటిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనే లక్ష్యంతో తాము పర్యటిస్తున్నామన్నారు. అలాగే ప్రాచీన గ్రంథాలైన తాళపత్ర గ్రంథాలు, హేండ్‌మేడ్‌ పేపర్లలో సాహిత్యాన్ని ఏ విధంగా భద్రపరుస్తున్నారనేది పరిశీలిస్తున్నామన్నారు. వీటిని డిజిటలైజేషన్‌ చేసి వెబ్‌సైట్‌లో పెట్టి విద్యార్థులు, సాహిత్య ప్రియులకు అందుబాటులో ఉంచేలా ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. వీటన్నింటినీ రెండు నెలల్లో ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ఆయన చెప్పారు. ప్రాథమిక, హైస్కూల్‌, కాలేజీలు, యూనివర్సిటీల్లో తెలుగుభాష వికా సంతోపాటు విద్యార్థుల సంఖ్య, తెలుగు అధ్యాపకుల నియామకంలో ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. కమిటీసభ్యులైన ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ బొమ్మూరు తెలుగువిశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా ఉందని, శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.డేవిడ్‌కుమార్‌ ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుల పోస్టులు, తెలుగు చదువుతున్న విద్యార్థులు, ఇతర అంశాలపై మాట్లాడారు. కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ పరిశోధనా కేంద్రం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ సహాయక సంచాలకులు కె.తిమ్మరాజు, అర్బన్‌ స్కూల్స్‌ డీఐ దిలీప్‌కుమార్‌, సెట్రాజ్‌ సీఈవో భానుప్రకాష్‌, ఇతర అధికారులు మాట్లాడారు. అనంతరం కమిటీ సభ్యులు గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు, ఇతర గ్రంథాలను పరిశీలించారు. తెలుగు విశ్వవిద్యాలయం, నన్నయ వర్సిటీలను సంద ర్శించి అక్కడ తెలుగుభాషాభివృద్ధి చర్యలపై సమీక్షించారు.

Updated Date - 2021-01-21T06:46:20+05:30 IST