తెలుగు కుబేరులు 78

ABN , First Publish Date - 2022-09-22T06:31:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రూ.1,000 కోట్లు, అంతకు పైగా సంపద కలిగిన వారు 78 మంది ఉన్నారని ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022’ వెల్లడించింది.

తెలుగు కుబేరులు  78

మొత్తం ఆస్తి విలువ రూ.3,90,500 కోట్లు 

రూ.56,200 కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో మురళీ దివి

అత్యంత సంపన్న తెలుగు మహిళ మహిమ దాట్ల

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ రిచ్‌ లిస్ట్‌ 2022 విడుదల


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రూ.1,000 కోట్లు, అంతకు పైగా సంపద కలిగిన వారు 78 మంది ఉన్నారని ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022’ వెల్లడించింది. బుధవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. వారి మొత్తం ఆస్తి విలువ రూ.3,90,500 కోట్లు. తెలుగు రాష్ట్రాల సంపన్నుల్లో 11 మంది కనీసం బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు = రూ.8,000 కోట్లు) ఆస్తి కలిగిన ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆస్తుల వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌, హురున్‌ వెల్లడించాయి. 

మరిన్ని వివరాలు.. 

దివీస్‌ లేబరేటరీస్‌ అధిపతి మురళీ దివి కుటుంబం రూ.56,200 కోట్ల ఆస్తితో రెండు రాష్ట్రాల్లో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 

రూ.39,200 కోట్ల సంపదతో హెటిరో లాబ్స్‌కు చెందిన బీ పార్థసారధి రెడ్డి కుటుంబం రెండో స్థానంలో ఉంది. 

బయోలాజికల్‌-ఇ  ఎండీ, సీఈఓ మహిమ దాట్ల రూ.8,700 కోట్ల నెట్‌వర్త్‌తో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.  

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా 11 మందికి చోటు దక్కింది. వారి మొత్తం సంపద రూ.22,600 కోట్లు.

ఈ జాబితాలోని 82 శాతం మంది (64 మంది) సంపన్నులు హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నం నుంచి ఐదుగురికి చోటు లభించింది. 

ఏపీ, తెలంగాణ రిచ్‌ లిస్ట్‌లో అత్యధికంగా 31 శాతం (24 మంది) ఫార్మా రంగానికి చెందినవారే. 

గడిచిన 11 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల సంపన్నుల సంఖ్య 26 రెట్లు పెరిగిందని హురున్‌ ఇండియా ఎండీ, చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. 11 ఏళ్ల క్రితం ముగ్గురు ఈ లిస్ట్‌లో ఉండగా.. ఈ ఏడాది నాటికి 78కి చేరుకుందన్నారు. వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య 200కు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు.

Updated Date - 2022-09-22T06:31:02+05:30 IST