ఢిల్లీ మద్యానికి తెలుగు కిక్‌!

ABN , First Publish Date - 2022-08-20T06:30:19+05:30 IST

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. దీని రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా..

ఢిల్లీ మద్యానికి తెలుగు కిక్‌!

మాగుంట నేతృత్వంలో రాజధాని లిక్కర్‌ సిండికేట్‌

పెట్టుబడి పెట్టిన తెలంగాణ, ఆంధ్రా నేతలు?

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లేకుండా

సిండికేట్‌కు అడ్డగోలుగా రాయితీలు?

ఢిల్లీలోని ఆప్‌ సర్కారుపై ఆరోపణలు

గవర్నర్‌ సిఫారసుపై రంగంలోకి సీబీఐ

రెండు రోజుల క్రితమే ఎఫ్‌ఐఆర్‌ 

కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ 

ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా

దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు

హైదరాబాద్‌లో పిళ్లై నివాసంలో సోదాలు

భారీగా పత్రాలు, రికార్డులు స్వాధీనం

ఓర్వలేకే దాడులు: ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. దీని రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెందిన రెండు కంపెనీలు, దశాబ్దం క్రితం వరకు ఢిల్లీలో మద్యం సిండికేట్‌ నడిపిన ఓ డాన్‌ కంపెనీలు కలిసి కార్టెల్‌గా ఏర్పడి నిర్వహిస్తున్నాయి. కొన్ని కంపెనీలకు బ్యాంకు గ్యారంటీ కూడా అరబిందో గ్రూపునకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి కంపెనీ ఇచ్చినట్లు సమాచారం.


ఢిల్లీ మద్యం సిండికేట్‌ తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు, ఎక్సైజ్‌ అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో కొందరు టీఆర్‌ ఎస్‌ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


త్వరలో వారి పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. ఈ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధం ఉన్నదని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ స్వయంగా ఆరోపించడం ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. తెలంగాణ నేతలు బుక్‌ చేసిన హోటళ్లకు మనీష్‌ సిసోడియా వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వీరిలో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు గత మేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కలుసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు తెలంగాణ నేతలు ఉన్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో 16 మంది పేర్లతో పాటు గుర్తు తెలియని అనేక మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే దాడులు చేశామని సీబీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం లక్ష్యం మనీష్‌ సిసోడియా అయినప్పటికీ కేసు ఎటు తిరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.


మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా నివాసంలో శుక్రవారం సోదాలు జరిపింది. రెండు రోజుల క్రితం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. కేంద్రంలో బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించే ప్రయత్నంలో భాగంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ దేశవ్యాప్త యాత్రను ప్రకటించిన రెండు రోజులకే ఆ పార్టీలో నెంబర్‌ టూగా వెలుగొందుతున్న ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై అవినీతి కేసును మోపింది. ఆయనతో పాటు తెలుగువాడైన ఐఏఎస్‌ అధికారి అరవ గోపీ కృష్ణ సహా ముగ్గురు అధికారులు, 10 మంది మద్యం లైసెన్సీలతో పాటు పలువురిపై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. వీరి ఇళ్లతో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, గురుగ్రామ్‌, చండీఘడ్‌, ముంబై, హైదరాబాద్‌, లఖ్‌నవూ, బెంగళూరులో 31 స్థావరాలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అనేక కీలకమైన పత్రాలు, డిజిటల్‌ రికార్డులు లభించాయని సీబీఐ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.


గవర్నర్‌ ఆదేశం మేరకు 

2021 జూన్‌లో ఢిల్లీ సర్కారు మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు తెర తీసింది. రూ.7,200 కోట్ల మేరకు టెండర్‌ను విడుదల చేసింది. దాదాపు 850 దుకాణాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. ఇదంతా రాష్ట్ర కేబినెట్‌ అనుమతితోనే జరిగినప్పటికీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు నిర్ణీత పద్ధతిలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆయన అనుమతి తీసుకోలేదని కేంద్రం తేల్చింది. మొత్తం వ్యవహారంలో ఎన్నో అవకతవకలు జరగడంతో పాటు భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని అనుమానం వ్యక్తం చేస్తూ, 2021-22 ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సిఫారసు చేస్తూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా జులైలో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.


లే ఖలో ఉన్న అంశాలపై విచారణ జరపాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీబీఐని ఆదేశించారు. హోంశాఖ పంపిన ఆఫీస్‌ మెమొరాండం ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దాడులు జరిపింది. లైసెన్సీలకు రూ.కోట్ల లబ్ధి మనీష్‌ సిసోడియా, అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవ గోపీకృష్ణ, అప్పటి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆనంద్‌ తివారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ పంకజ్‌ భట్నాగర్‌లు అక్రమంగా ఎక్సైజ్‌ విధానానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నారని, దీని వల్ల లైసెన్సీలకు కోట్లాది రూపాయల లాభం చేకూర్చారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. వీరితో పాటు ఓన్లీ మచ్‌ లౌడర్‌ కంపెనీ మాజీ సీఈవో విజయ్‌ నాయర్‌, పెర్నాడ్‌ రికార్డ్‌ కంపెనీ మాజీ అధికారి మనోజ్‌ రాయ్‌, బ్రిండ్కో స్పిరిట్స్‌ యజమాని అమన్‌ దీప్‌ ధాల్‌, ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు ఎక్సైజ్‌ విధానం రూపకల్పనలోను, అమలులోను అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది,, అంతేకాక అనేకమంది లైసెన్స్‌ దారులు రిటైల్‌ వ్యాపారులకు క్రెడిట్‌ నోట్లు జారీ చేసి రాజకీయ నాయకులకు కోట్లాదిరూపాయల ముడుపులు చెల్లించారని తెలిపింది, మనీష్‌ సిసోడియాకు  కుడిి భుజమైన దినేశ్‌ అరోరా అనే వ్యక్తికి చెందిన రాధా ఇండస్ట్రీస్‌ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు చెల్లించారని సీబీఐ సాక్ష్యంగా  చూపింది.


తెలంగాణలో ఉంటున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై  కూడా సమీర్‌ మహేంద్రు నుంచి 2-4 కోట్లు ముడుపులు నగదు రూపంలో స్వీకరించి విజయ్‌ నాయర్‌ అనే వ్యక్తి ద్వారా మనీష్‌ సిసోడియాకు పంపించారని కూడా సీబీఐ ఆరోపించింది, ఒకప్పటి మాఫియా డాన్‌ పాంటీ చడ్డా హత్యకు గురయ్యాక ఆయన సంస్థ మహదేవ్‌ లిక్కర్స్‌కు యజమానిగా మారిన సన్నీ మార్వా కూడా భారీ ముడుపులు చెల్లించారని తెలిపింది. సన్నీ మార్వా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా ముడుపులు చెల్లిస్తున్నాడని తెలిపింది. ఎక్సైజ్‌ విధానంలో మార్పులు చేయడం, లైసెన్స్‌దారులకు మినహాయింపులు ఇవ్వడం, లైసెన్స్‌ ఫీజులు రద్దు చేయడం, పై నుంచి అనుమతి లేకుండా ఎల్‌-1 లైసెన్స్‌లు పొడిగించడం, డ్రై డేలను 21 రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించడం చేశారని వెల్లడించింది.


కొవిడ్‌ సమయంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో నష్టపోయిన వ్యాపారులు లైసెన్స్‌ ఫీజులో రాయితీ కోరడంతో అప్పట్లో ప్రభుత్వం 144 కోట్ల ఫీజు మాఫీ చేసింది. విమానాశ్రయంలో మద్యం షాపు దక్కించుకున్న కంపెనీ విమానాశ్రయం నుంచి షాపు పెట్టుకోవడానికి అనుమతులు సంపాదించుకోలేక పోవడంతో రూ.30 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇచ్చేశారు.  వీటన్నిటి రీత్యా మనీష్‌ సిసోడియా, అరవ గోపీకృష్ణ ఇతర అధికారులతో పాటు 15 మంది వ్యాపారులపై సీబీఐ ఐపీసీ సెక్షన్‌ 120-బి, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 కింద కేసులు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో ఇవే ఆరోపణలపై ఈడీ కూడా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 14వ నిందితుడిగా ఉన్న ఇండో స్పిరిట్‌ సంస్థ నిర్వహకుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉంటున్నారు. సర్వే నంబర్‌ 145, ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉన్న ఆయన విల్లాపైనా సీబీఐ తనిఖీలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. 


మాగుంట కంపెనీలు 

టెండర్‌ ప్రక్రియను తమకు అనుకూలంగా తిప్పుకోవడానికి కంపెనీలు కుమ్మక్కు కావడం, అనుమానాస్పద రీతిలో ఈఎండీలు సమర్పించడం, బ్లాక్‌ లిస్టులో ఉన్న పార్టీలకు కూడా దుకాణాలు కేటాయించడం, మద్యం ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రిటైల్‌ రంగంలోకి ప్రవేశించడం, బిడ్డింగ్‌లో ప్రభుత్వ అధికారులతో చేతులు కలపడం, నేతలకు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించడం తదితర అక్రమాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఢిల్లీలో 32 రిటైల్‌ జోన్లు ఉండగా, ఒక్కో జోన్‌లో 27 దుకాణాలు ఉన్నాయి. జోన్‌కు రూ.225 కోట్ల  చొప్పున సగటు రిజర్వుడు ఫీ ఉంటుంది. వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన మాగుంట ఆగ్రో ఫారమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పిక్సీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ మూడు జోన్లు దక్కించుకున్నాయి.


సమీరు మహేంద్రు, గీతికా మహేంద్రులకు చెందిన ఇండో స్పిరిట్‌ గ్రూపుకు చెందిన ఖావో గాలి రెస్టారెంట్స్‌ బ్లాక్‌ లిస్టులో ఉన్నప్పటికీ రెండు జోన్లను దక్కించుకుంది. ఈ రెండు కంపెనీలు పరస్పరం ఈఎండీలు సమర్పించుకున్నాయి. ఇండో స్పిరిట్‌కు చెందిన బబ్లీ ఎంటర్‌ ప్రైజెస్‌ మాగుంట కంపెనీలకు రూ.25 కోట్ల ఈఎండీ సమర్పించగా, బాలాజీ గ్రూపుకు చెందిన మరో రెండు కంపెనీలు ప్రైమస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, హివిడి ఎంటర్‌ ప్రైజెస్‌ మరో రూ.35 కోట్ల ఈఎండీ సమర్పించాయి. ఖావో గలి కంపెనీకి మాగుంట కుమారుడైన రాఘవ మాగుంటకు చెందిన జైనాబ్‌ ట్రేడింగ్‌ కంపెనీ రూ.25 కోట్ల ఈఎండీలను సమర్పించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బ్లాక్‌ లిస్టెడ్‌ కంపెనీ సోం గ్రూప్‌కు చెందిన రైసెన్‌ మార్కెటింగ్‌కు కూడా జోన్లు దక్కాయి. కార్టెల్‌గా ఏర్పడిన ఈ కంపెనీలకు కేబినెట్‌ నోట్‌ కూడా లేకుండా లైసెన్స్‌ ఫీ కింద రూ.144,36 కోట్ల మేరకు రాయితీ కూడా ఇచ్చారని కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపి, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ కూడా ఆరోపించారు.


దిగుమతి చేసుకున్న బీరు విచ్చలవిడిగా ప్రవేశించడానికి వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు రూ.50 చొప్పున రాయితీ కూడా ఇచ్చారని చెప్పారు. మద్యం వ్యాపారుల కమిషన్‌ కూడా 2.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌  గుప్తా ఆరోపించారు. ఇందులో ఆరు శాతం వరకు నగదు రూపంలో సిసోడియాకు వెళుతుందని, వాటి నుంచే పంజాబ్‌ ఎన్నికలకు ఖర్చు పెట్టారని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగానే కేజ్రీవాల్‌ సర్కారు బయపడిపోయి తిరిగి 2 శాతానికి తగ్గించిందని చెప్పారు. 


ఓర్వలేకే: కేజ్రీవాల్‌

మొత్తం వ్యవహారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీకి మధ్య యుద్ధంగా మారింది. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు వేధిస్తున్నారని ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఆరోపించారు. సీబీఐ దాడులకు భయపడాల్సిన పనిలేదని తన ఇంటి దగ్గర గుమిగూడిన కార్యకర్తలకు చెప్పారు. సిసోడియా అత్యంత నిజాయితీపరుడని, ఆయన ప్రపంచంలోనే ఉత్తమ విద్యామంత్రుల్లో ఒకరని కొనియాడారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇంటర్నేషనల్‌ ఎడిషన్‌ పతాక శీర్షికగా ఢిల్లీ పాఠశాలల మీద వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా కార్యకర్తలకు చూపించారు. సిసోడియా ఎదుగుదలను చూసి ఓర్వలేకే న్యూయార్క్‌ టైమ్స్‌లో కథనం వచ్చిన రోజే సీబీఐ కేసుల పేరుతో వేధింపులకు దిగారని ఆరోపించారు. కాగా, న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పెయిడ్‌ ఆర్టికల్‌ అని, ఖలీజ్‌ టైమ్స్‌లో కూడా ఇవే పదాలతో ఢిల్లీ పాఠశాలలపై కథనం వచ్చిందని బీజేపీ ఆరోపించింది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ ఆరోపణలను ఖండించింది.


తమ విలేకరి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వార్త రాశారని వెల్లడించింది. మరోవైపు సీబీఐ దాడులపై సిసోడియా స్పందించారు. సీబీఐ సోదాలను స్వాగతిస్తూనే దేశం కోసం నిజాయితీగా మంచి పనులు చేస్తున్న తన లాంటి వారిని వేధించడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో వైద్య రంగాన్ని మార్చేసిన మంత్రి సత్యేంద్ర జైన్‌ను కూడా ఇలాగే వేధించారన్నారు. ఇందుకే దేశం నంబర్‌ వన్‌ కాలేక పోతోందని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. సీబీఐ విద్యాశాఖ గురించి అడగడం లేదని, ఎక్సైజ్‌ శాఖ గురించి అడుగుతోందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తును చేపట్టిన మర్నాడే సిసోడియా కొత్త ఎక్జైజ్‌ పాలసీని వెనక్కి తీసుకున్నారని ప్రస్తావించారు. అవకతవకలు ఉండబట్టే ఆయన వెనకడుగు వేశారన్నారు. కేజ్రీవాల్‌ నమూనా పాలన పట్ల దేశ ప్రజలంతా ఆకర్షితులు కావడంతో మోదీ భయపడి ఆప్‌ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు మోదీ-కేజ్రీవాల్‌ల మధ్యే జరుగుతాయని చెప్పారు.  

Updated Date - 2022-08-20T06:30:19+05:30 IST