పోరు బాటలో...పాట!

ABN , First Publish Date - 2020-04-01T05:47:30+05:30 IST

కరోనా మహమ్మారితో ప్రపంచంలో సగం పైగా లాక్‌డౌన్‌లో ఉంది. ప్రతి దేశం తమ ప్రజల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనుక్షణం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

పోరు బాటలో...పాట!

కరోనా మహమ్మారితో ప్రపంచంలో సగం పైగా లాక్‌డౌన్‌లో ఉంది. ప్రతి దేశం తమ ప్రజల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనుక్షణం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు దక్షిణాది సంగీత దర్శకులు కోటి నుంచి ఉత్తరాదిన కైలాష్‌ ఖేర్‌, బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా వంటి  కళాకారులు తమ సృజనాత్మకతతో సమాజ క్షేమానికి తమ వంతు కృషిచేస్తున్నారు.  


తెలుగు సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కరోనాపై ఒక పాట రాసి బాణీ కట్టి స్వయంగా పాడారు. ‘కరోనాను జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా ఎదుర్కొందాం’ అంటూ గళం విప్పారు. ‘‘ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా’’ అంటూ ప్రజలకు, చిన్నారులకు సందేశమిచ్చారు. ‘‘లెట్స్‌ ఫైట్‌ ప్లీజ్‌ ఆన్‌ దిస్‌ వైరస్‌’’ అంటూ గళం విప్పారు. యువతపైనే భవిత ఉంద న్నారు. ‘‘లెట్స్‌ క్యూర్‌ దిస్‌ వైరస్‌’’ అంటూ  నినదించారు. ‘‘ఈ పని అందరం కలిసి చేద్దామన్నా’’రు. ‘‘ఈ వైర్‌సని కడిగేసి తరిమేసేద్దాం’’ అని ధైర్యమిచ్చారు. ‘‘షేక్‌ హ్యాండ్స్‌ వద్దు దండం మిన్న’’ అంటూ అందరికీ సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. అంతేకాదు మనం తలవంచం...


విజ్ఞానం, వైద్యం, సాయం ఉన్నాయి. అన్ని దేశాలు ఒకటై యుద్ధం చేస్తున్నాయి...మనవంతుగా ముందడుగేస్తే మనదే విజయం.... లెట్స్‌ లివ్‌ హెల్దియర్‌....’’ అంటూ సందేశమిచ్చారు. ఈ వీడియోలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నాగార్జున, వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్‌తేజ్‌లు గళం కలుపుతూ స్ఫూర్తిని నింపారు. 

మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైర్‌సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ గాయకుడు కైలాష్‌ ఖేర్‌ కూడా ఒక పాట రాశారు. తన పాట ద్వారా ‘ప్రజలందరూ సురక్షితంగా ఉండాల్సిన అవసరాన్ని  నొక్కిచెప్పారు. కొవిడ్‌-19 సమస్యపై ప్రజలలో అవగాహన పెంచుతున్నారు. స్వీయనిర్బంధం (సెల్ఫ్‌-ఐసొలేషన్‌)తోపాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా స్ఫూర్తినివ్వడానికి  పూనుకున్నారు. వీరికి ముందు ప్రముఖ గాయకుడు బప్పీలహరి కరోనా వైర్‌సపై పాట రాసి, దానికి సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. అలా తన వంతు సామాజిక బాధ్యతను  కైలాష్‌ ఖేర్‌ కూడా చేపట్టారు. ‘మై హీ మేరా రక్షక్‌ హు’ అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యం నెరవేర్చాలని పాటలో సందేశమిచ్చారు. ‘పాట రాయడం పూర్తయింది. వచ్చే వారం ఆన్‌లైన్‌లో పాటను విడుదల చేస్తా’ అని ఆయన వివరించారు. సోషల్‌ మీడియాలో కూడా తన పాటను విడుదల చేసే ఆలోచనలో కైలాష్‌ ఉన్నారు.


ఆయుష్మాన్‌ ఖురానాకు బాలివుడ్‌లో మంచి నటుడిగా పేరుంది. ఆయుష్మాన్‌ మంచి కవి కూడా! కరోనావైరస్‌ మహమ్మారి  సర్వత్రా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో   ‘అర్ధనిర్మిత్‌’ (అసంపూర్ణం) అనే కవితను హిందీలో ఆయుష్మాన్‌ రాశారు. ఇందులో జీవితం ఎంత బలహీనమైనదో, అలాగే మారుతున్న దాని స్వరూపస్వభావాలు, అసంపూర్ణతలు ప్రతి దశలోనూ మనకు ప్రతిఫలిస్తున్నాయంటారు. ఒక్కోసారి పాజిటివ్‌గా ఉండడం సాధ్యం కాదు. వాస్తవికత చాలా కఠినమైంది. అది నిలదీస్తుంది. నిర్దేశిస్తుంది. ఇది ప్రపంచంలో ఏం జరుగుతోందన్న దానిపై ఆలోచించేలా చేస్తుంది. కరోనా వైరస్‌ ఈ పరిస్థితినే ప్రతిఫలిస్తోం’’దంటూ తన కవిత్వంలో  ఆయుష్మాన్‌ నర్మగర్భంగా చెప్పారు.  ‘యహా కోయీ మిత్ర నహీ హై... కోయీ ఆశ్వాస్‌ చరిత్ర నహీ హై...సబ్‌ అర్ధనిర్మిత్‌ హై’ అంటూ పరిస్థితి తీవ్రత, జీవన తీవ్రతల గురించి  ఆయుష్మాన్‌ తన కవితలో ఆవిష్కరించారు.


బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’ తీసుకున్నారు. కానీ దీన్ని ఒక వినూత్న శైలిలో ఆ సవాలును చేసి చూపి ఎందరో సోషల్‌ మీడియా వీక్షకులను ఆకట్టుకున్నారు. చేతులు సరిగ్గా ఎలా శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని వీడియోలో పాట రూపంలో ప్రియాంక వివరించారు. ‘‘ఇది చాలా సింపుల్‌ పని’’  అంటూ చేతి శుభ్రతపై అవగాహన పెంచే పనిచేశారామె. ఆ పాటను ఆమె భర్త అమెరికన్‌ సింగర్‌ అయిన నిక్‌ జోన్‌సతో కలిసి రాశారు. ‘‘మీ రక్షణ, మీ కుటుంబ రక్షణ కోసం  తరచూగా, ప్రతి సారీ 20-25 సెకన్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వీడియోలో ఆమె  పేర్కొన్నారు. 

మొత్తం మీద ఈ సృజనాత్మక సెలబ్రిటీలు తమ క్రియేటివిటీని పాటలు, వీడియోల రూపంలో చూపెడుతూ ప్రజలలో తెచ్చే చైతన్యం గురించి వేరే చెప్పాలా!

Updated Date - 2020-04-01T05:47:30+05:30 IST