కరోనాతో ముగ్గురు తెలుగు ప్రవాసుల మృతి

ABN , First Publish Date - 2021-03-04T08:01:48+05:30 IST

గల్ఫ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు తెలుగు ప్రవాసులు కరోనాతో మృత్యువాత పడ్డారు.

కరోనాతో ముగ్గురు తెలుగు ప్రవాసుల మృతి

వారిలో ఒకరు సిద్దిపేట జిల్లాకు చెందిన వైద్యుడు

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గల్ఫ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు తెలుగు ప్రవాసులు కరోనాతో మృత్యువాత  పడ్డారు. సౌదీలోని రియాద్‌లో సీనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న ఎరబెల్లి శరత్‌కుమార్‌ (71).. సిద్దిపేట జిల్లా చిట్యాలకు చెందిన వారు. వైద్యుడిగా రోగులకు చికిత్స అందించే క్రమంలో ఆయన వైరస్‌ బారిన పడ్డారు. గత నెల 1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం రాత్రి కన్ను మూశారు. శరత్‌కుమార్‌ భార్య గతంలోనే మరణించగా, ముగ్గురు కుమార్తెలు అమెరికా, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మరో ఘటనలో హైదరాబాద్‌లోని మిస్రీ గంజ్‌కు చెందిన ఖాజా సిరాజొద్దీన్‌(57).. నెల రోజుల కిందట రియాద్‌లో వైరస్‌ బారిన పడ్డారు. జ్వరంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయనకు తొలుత నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇక, దమ్మాంలో ఇంజినీర్‌గా పని చేసే మొహ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌(51).. భారత్‌కు తన కుమారుడితో కలిసి వద్దామన్న ఆలోచనతో సౌదీ నుంచి దుబాయ్‌కు వెళ్లి కరోనా కోరల్లో చిక్కుకొని కన్నుమూశారు.

Updated Date - 2021-03-04T08:01:48+05:30 IST