ఇండోనేషియాలో తెలుగు జాతి ఆనవాళ్లు

ABN , First Publish Date - 2020-07-12T05:39:37+05:30 IST

ఇండోనేషియా ఇప్పుడు మనకు అస్సలు సంబంధం లేని దేశంగా కన్పిస్తుంది. హైదరాబాద్ నుంచి నేటికీ ఆ దేశానికి ప్రత్యక్ష విమాన సదుపాయం లేదు. కానీ వేల ఏళ్ల క్రితం తెలుగు తీరం నుంచి బయల్దేరిన ప్రతి నౌకా జావా, సుమత్రా దీవుల్ని అంటే నేటి ఇండోనేషియాని చేరుకున్నాయి...

ఇండోనేషియాలో తెలుగు జాతి ఆనవాళ్లు

విశాఖపట్నం సమీపంలోని బొజ్జన్నకొండ క్రీస్తు శకం 4–6 శతాబ్దికి చెందింది. బొరొబుదూర్ తొమ్మిదో శతాబ్దికి చెందింది. శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునక. బొజ్జన్నకొండ ఓ అద్భుతం అయితే బొరొబుదూర్ మహాద్భుతం. క్రీస్తు శకం 14 వ శతాబ్దిలో అరేబియా సముద్రంలో యూరోపియన్లు ఎలాంటి సాహసాలు చేశారో, అంతకు రెట్టించిన సాహసాలను క్రీస్తు శకం తొలినాళ్లలోనే మన తెలుగు వారు హిందూ మహాసముద్రంలో చేశారు. అనుకూలించిన ప్రతి నేల మీదా వలస రాజ్యాలను స్థాపించారు. చారిత్రక ఆనవాళ్లను విడిచిపెట్టారు. వాటిని వెలికి తీయడానికి మనకు కాస్త ఓపికా, తీరికా ఉండాలి అంతే.


ఇండోనేషియా ఇప్పుడు మనకు అస్సలు సంబంధం లేని దేశంగా కన్పిస్తుంది. హైదరాబాద్ నుంచి నేటికీ ఆ దేశానికి ప్రత్యక్ష విమాన సదుపాయం లేదు. కానీ వేల ఏళ్ల క్రితం తెలుగు తీరం నుంచి బయల్దేరిన ప్రతి నౌకా జావా, సుమత్రా దీవుల్ని అంటే నేటి ఇండోనేషియాని చేరుకున్నాయి. ఆ దేశంలోని ఎన్నో ప్రాచీన రాజ్యాలకు తెలుగు నేలతో దగ్గర సంబంధం ఉంది. ఇండియా ప్రభావం వల్ల ఇండోనేషియా అనే పేరొచ్చిందని అంటారు కానీ నేటికీ కన్పిస్తోన్న సాక్ష్యాల వల్ల ‘తెలుగునేషియా’ అని పిలవచ్చేమో అన్పిస్తుంది.


ఓ జర్నలిస్టుగా ఆగ్నేయాసియాలో తెలుగు జాతి అడుగుజాడలపై అన్వేషిస్తున్న నాకు మయన్మార్, థాయిలాండ్‌ల తరవాత అత్యంత ఆసక్తికరంగా కన్పించిన దేశం ఇండోనేషియా. పదిహేడు వేల దీవుల సముదాయం ఆ దేశం. రాజధాని జకార్తాకి సమీపంలో క్రీ.శ. నాలుగో శతాబ్దిలో ‘తరుమ నగర రాజ్యం’ ఉండేది. ఆ రాజ్యాన్ని స్థాపించింది మన శాలంకాయన సంబంధీకులు. ఆ రాజుల్లో గొప్ప వాడిగా పేరుతెచ్చుకున్న పూర్ణవర్మ క్రీ.శ. 5వ శతాబ్దికి చెందినవాడు. ఆ తరవాత సుమత్రాలో శ్రీవిజయ, జావాలో శైలేంద్ర రాజ్యాలు ఎంతో ప్రసిద్ధిచెందినవి. బెంగాల్ చరిత్రకారులు హెచ్.బి.సర్కార్ గ్రంథం ‘ది కింగ్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది శైలేంద్ర డైనాస్టీ ఆఫ్ ఇండోనేషియా’లో తెలుగునేలతో ఉన్న అనుబంధం సవివరంగా ఉంది. శైలేంద్ర రాజ్యానికి సంబంధించి లభించిన తొలి శాసనం లిగర్. జావాలో దొరికిన ఆనాటి శాసనాలు ‘సిద్ధం’ లేదా ‘స్వస్తి’తో మొదలవుతున్నాయి. కృష్ణా డెల్టాలోని ఇక్ష్వాకులు, పల్లవుల శాసనాలు ఇలాగే మొదలవడం విశేషం. వీటిలో శక సంవత్సరాలనే వాడారు. ఇక్ష్వాకులకు శ్రీపర్వతీయులుగా పేరు. మేనరికపు పెళ్లిళ్లు చేసుకునే ఆచారం ఉండేది. శైలేంద్రులూ ఇదే ఆచారాన్ని పాటించారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. నేటి నాగార్జునకొండ సమీపంలో ఉండేది. ఆనాడు విజయపురి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిచెందిన బౌద్ధ కేంద్రం. ఇక్ష్వాకుల తదనంతరం రాజ్య పరిపాలకులు తమ పేర్లకు మొదట రాజధాని పేరును కలుపుకునే క్రమాన్ని పాటించేవారు. గుంటూరు జిల్లాలో శ్రీవిజయ స్కందవర్మ, శ్రీవిజయ శాతకర్ణి, శ్రీవిజయబుద్ధవర్మ అనే పేర్లతో కొన్ని శాసనాలు లభించాయి. లిగర్ శాసనంలో శ్రీవిజయేంద్రరాజ అనే ఉంది. విష్ణుకుండినుల మూల దేవత శ్రీపర్వత స్వామి. ఇక్ష్వాకుల అనంతరం, విష్ణుకుండినుల ప్రారంభానికి ముందు సుమారు 150 యేళ్ల పాటు ఈ ప్రాంతం అంతా రాజకీయ అనిశ్చితిలో ఉంది. ఈ సమయంలో ఇక్కడి నుంచి కొంతమంది రాజవంశీయులు జావా, సుమత్రా దీవులకు వెళ్లి వలస రాజ్యాలను స్థాపించి ఉంటారని హెచ్‌.బి సర్కార్ తేల్చిచెప్పారు.


మధ్య జావాలో ఎనిమిదో శతాబ్దిలో ‘మాతరం’ అనే మరో హిందూ రాజ్యం ఉండేది. ఈ రాజ్యాన్ని స్థాపించిన రాజు పేరు ‘సన్న’. చక్కనిచిక్కని తెలుగు పేరు. ఈ రాజులు నిర్మించిన ‘ప్రంబనన్ ఆలయం’ ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ ఆలయం. ఆనాడు జావాలో కోళ్ల పందాలు ఎక్కువగా జరిగేవట. రాజుకు ప్రతి రోజూ వచ్చే ఆదాయంలో పావు భాగం ఈ కోళ్ల పందాల నుంచే వచ్చేదట. మన తెలుగు నేలలు ఈనాటికీ కోడి పందాలకు పెట్టిందిపేరు. ఇక వాస్తుపరంగా చూస్తే ఇండోనేషియాలోని ప్రపంచ ప్రసిద్ధి కట్టడం బొరొబుదూర్‌కు ప్రేరణ విశాఖపట్నం సమీపంలోని బొజ్జనకొండ అంటూ ప్రముఖ చరిత్రకారులు మారేమండ రామారావు ‘ఆంధ్రాస్ త్రూ ఏజెస్’ గ్రంథంలో స్పష్టంగా రాశారు. అమరావతి శిల్పరీతినే అక్కడి శిల్పఫలకాలు ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. వీటన్నిటి ఆధారంగా చూస్తే ఇండోనేషియా ఆనాడు సాహసికులైన మన తాతముత్తాతల కొంగొత్త ఆశలకు ఊపిరిలూదిన నేల.


తెలుగు జాతి ఆనవాళ్లను ప్రత్యక్షంగా పరికించాలనే ఆశతో ఇండోనేషియా వెళ్లాను. రాజధాని జకార్తా పెద్ద నగరమే. ఆ సిటీలో ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో తెలియజేస్తూ బస చేసిన హోటల్ రిసెప్షనిస్ట్ ‘సిటీ మ్యాప్’ అందించింది. అందులో షాపింగ్ మాల్స్ వివరాలూ ఉన్నాయి. ఓ షాపింగ్ మాల్ పేరు ‘గజ మాడ ప్లాజా’. గజ అంటే ఏనుగు మాడా అంటే ఏమిటి? ఆ పేరు ఇక్కడ ఎందుకు ఉంది అని ఆమెనే అడిగా. గజమాడా ఆదేశంలో సూపర్ హీరో అట. క్రీ.శ 13 వ శతాబ్దికి చెందిన ఓ హిందూ రాజ్య ప్రధానమంత్రి. రాజ్యాలన్నిటినీ ఒక్కతాటిమీదకి తెస్తానని ప్రతిన బూని అలాగే చేసి చూపించిన వీరుడు. దేశభక్తికి మరో పేరు అతడు. నేటికీ స్కూళ్లల్లో ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్లలో గజమాడా వేషం వేయడానికి పిల్లలు పోటీ పడతారట. ‘మాడా’ అనే ఇంటి పేరున్న వాళ్లు తెలుగు సీమలో ఎంతో మంది కన్పిస్తుంటారు. వాళ్లకీ గజమాడాకి ఏదైనా సంబంధం ఉందేమో! అలాగే అక్కడి హోటళ్ల లిస్టు చూస్తుంటే ‘గుంటూరు రాయ సెతియపూడి’ అని కన్పించింది. వివరాలు సేకరిస్తే ఆ దేశంలో గుంటూరు అనే పేరు సర్వసాధారణం. గుంటూరు పేరున వీధులు, ఊర్లు ఉన్నాయి. పశ్చిమ జావాలో ఉన్న ఓ అగ్నిపర్వతం పేరు గుంటూరు. ఆ దేశ భాషలో గుంటూరు పదానికి అర్థం ఉరుము.


మాడా, గుంటూరు విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతూ నేషనల్ మ్యూజియం వెళ్ళా. నాలుగు అంతస్తులుగా ఉన్న మ్యూజి యం భవనంలోకి ప్రవేశిస్తుంటే పక్కనే కన్పించింది ‘తెలగ బాతు శాసనం’. పల్లవ లిపిలో ప్రాచీన మలయా భాషలో ఈ శాసనం ఉందని అక్కడ పేర్కొన్నారు. ఇదో ప్రమాణ శాసనం. రాజుకు ఎల్లవేళలా విధేయుడిగా ఉంటామని సిబ్బంది ప్రమాణం చేసేది. ఒకటో అంతస్తుకు వెళితే.. పూర్ణవర్మ శాసనాలు, అతడి పాద ముద్రలుగా పేర్కొంటోన్న పెద్ద రాతి బండను హాలు మధ్యలో ప్రదర్శనలో ఉంచారు. ఏదో రాయి అని పడేయకుండా మన ముత్తాత పూర్ణవర్మ పాదముద్రల్ని ఏసీ హాలులో భద్రపరచి, గౌరవించడం ఆశ్చర్యం కలిగించింది. వందల సంవత్సరాల తరవాత నాలాంటి దూరపు చుట్టాలు వచ్చి పలకరిస్తారేమో అని ఎదురుచూస్తున్నట్టుగా ఆ పాదముద్రలు కన్పించాయి. అక్కడ పూర్ణవర్మ వేయించిన శాసనాలు కూడా ఉన్నాయి. అలాగే జాంబి అనే ప్రదేశం అంటే నేటి సుమత్రా ద్వీపంలోని పాలెంబాంగ్ సమీపంలో దొరికిన శాసనాలూ ప్రదర్శనలో ఉంచారు. వాటి పేర్లు చూస్తుంటే.. జకార్తాలో కాదు హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నట్టుగా భ్రమపడతాం. ‘తెలగ బాతు శాసనం’, ‘తెలంగ్ తువో శాసనం’, ‘తూగు శాసనం’, కోటకాపుర్ శాసనం’.. తెలుగు భాషకు అంత దగ్గరగా ఉన్నాయి వాటి పేర్లు. కోటకాపు అనే నగరం నేటికీ అక్కడ ఉందట.


మ్యూజియంలో అన్ని అంతస్తులూ సెంట్రలైజ్డ్ ఏసీ, ఎస్కలేటర్, లిఫ్టులతో అధునాతనంగా ఉన్నాయి. రెండో అంతస్తులో మరి కొన్ని శిలాశాసనాలను ప్రదర్శనలో ఉంచారు. ‘క్యారెక్టర్స్ అండ్ లాంగ్వేజస్ ఇన్ ఇండోనేషియా పల్లవ, నగరి అండ్ తమిళ్’ అనే కాప్షన్ కింద ఇండోనేషియాలో ఇండియాలాగానే ఎన్నో జాతులు, వాటికి సంబంధించి అనేక భాషలు, లిపులు ఉన్నాయని అక్కడి గోడ మీద నిలువెత్తు అక్షరాలతో పేర్కొన్నారు. వీటిలో కొన్ని క్రీస్తు శకం 5 నుంచి 15 శతాబ్దిలోపు పల్లవ, నగరి, తమిళ లిపుల నుంచి అభివృద్ధి చెందాయని రాశారు. పల్లవ లిపి దక్షిణ భారత దేశ పల్లవ సామ్రాజ్యం నుంచి ఏర్పడిందని, ప్రాచీన జావ, సుండనీ, బాలి లిపులకు మూలం అదేనని అక్కడ స్పష్టపరచడం విశేషం. మన పల్నాడు నుంచే ప్రారంభమైన పల్లవుల చరత్ర గురించి ఆ దేశ మ్యూజియంలో తెలుసుకోవడం కించిత్ గర్వంగా అన్పించింది.


బొజ్జనకొండ స్పూర్తితో నిర్మితమైన బొరొబుదూర్ నా తరవాతి మజిలీ. జకార్తా నుంచి ఓ గంట విమాన ప్రయాణం చేసి మధ్య జావాలోని జోగ్యకర్త చేరుకోవచ్చు. జోగ్ సాధారణ నగరం. అక్కడి నుంచి కారులో గంటన్నర ప్రయాణం చేస్తే బొరొబుదూర్ ముందు వాలిపోతాం. బొరొబుదూర్ ప్రపంచ వింతల్లో ఒకటి. బొరొబుదూర్ ఆర్కియాలాజికల్ పార్క్ కాంప్లెక్స్ వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అల్లంత దూరం నుంచి చూస్తే ఓ పెద్ద చతురస్రాకార భవనంలా ఈ స్థూపం కన్పిస్తుంది. 35 మీటర్ల ఎత్తులో మండలం ఆకారంలో తొమ్మిది అంతస్తులుగా దీన్ని నిర్మించారు. ఓ పెద్ద కొండనంతా తొలచి స్థూపంలా మలచారు. రెండు అంతస్తులుగా ఉండే బొజ్జన్నకొండలో కూడా కొండను తొలచి బుద్ధుడి విగ్రహాలను చెక్కారు. ఓ గూటిలాంటి అమరికలో బుద్ధుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రెండిటిలో సారూప్యత కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది. మొత్తం 504 బుద్ధ విగ్రహాలు ఈ స్థూపంలో ఉన్నాయి. బొజ్జన్నకొండ క్రీస్తు శకం 4 నుంచి 6 శతాబ్దికి చెందింది. బొరొబుదూర్ తొమ్మిదో శతాబ్దికి చెందింది. శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునక. బొజ్జనకొండ ఓ అద్భుతం అయితే బొరొబుదూర్ మహాద్భుతం. 


క్రీస్తు శకం 14 వ శతాబ్దిలో అరేబియా సముద్రంలో యూరోపియన్లు ఎలాంటి సాహసాలు చేశారో... అంతకు రెట్టించిన సాహసాలను క్రీస్తు శకం తొలినాళ్లలోనే మన తెలుగు వారు హిందూ మహాసముద్రంలో చేశారు. అనుకూలించిన ప్రతి నేల మీదా వలస రాజ్యాలను స్థాపించారు. చారిత్రక ఆనవాళ్లను విడిచిపెట్టారు. వాటిని వెలికి తీయడానికి మనకు కాస్త ఓపికా, తీరికా ఉండాలి అంతే.

డి.పి.అనురాధ

90100 16555

Updated Date - 2020-07-12T05:39:37+05:30 IST