తెలుగు ఇంజనీరింగ్‌.. ఈ ఏడాది లేనట్టే!

ABN , First Publish Date - 2021-07-31T08:02:35+05:30 IST

తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. ఆ నిర్ణయం మన రాష్ట్రంలో ఈ ఏడాది అమలయ్యే అవకాశం

తెలుగు ఇంజనీరింగ్‌.. ఈ ఏడాది లేనట్టే!

నిర్వహణ అంత సులువు కాదు.. ఒక్క దరఖాస్తూ రాలేదు

కాలేజీలు, విద్యార్థులు ముందుకొస్తే ఏర్పాట్లు చేసే అవకాశం


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. ఆ నిర్ణయం మన రాష్ట్రంలో ఈ ఏడాది అమలయ్యే అవకాశం కనిపించట్లేదు. తెలుగులో కోర్సులను నిర్వహించడానికి వీలుగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదని ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్తున్నారు. దీనిపై కాలేజీలు, విద్యార్థులు ముందుకు వచ్చిన తర్వాత, అందుకు తగ్గట్టు ఏర్పాట్లను చేసి, ఆ తర్వాతే కోర్సులను ప్రారంభించాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు. దేశంలో ఐదు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఐదు భాషల్లో తెలుగు కూడా ఉంది. అయితే.. తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సు నిర్వహించాలంటే ముందుగా.. ఆంగ్లంలో ఉన్న పాఠ్యపుస్తకాలను తెలుగులోకి అనువదించాల్సి ఉంటుంది. దీనిపై  ఉన్నత విద్యా మండలిలో తుది నిర్ణయం తీసుకుని, ప్రత్యేకంగా అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


దానికన్నాముందు.. తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సుల నిర్వహణపై మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఒక నిపుణుల కమిటీని నియమించాల్సి ఉంటుంది. అవన్నీ జరిగినా.. ప్రస్తుతం తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సులను బోధించే సిబ్బంది సైతం లేరు. తెలుగు మీడియం ప్రారంభించాలనుకునే కాలేజీలు బోధనా సిబ్బంది కొరతను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగులో కోర్సులను ప్రారంభించినా.. వాటిల్లో చేరడానికి విద్యార్థులు ముందుకు వస్తారా? అనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. విద్యార్థులు తెలుగు మీడియంలో ఇంజనీరింగ్‌ను పూర్తి చేసినా.. తర్వాత ఉద్యోగావకాశాలు ఏలా ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది.


తెలుగులో చదివినా ఉద్యోగావకాశాలు బాగా ఉంటాయంటేనే విద్యార్థుల నుంచి ఈ కోర్సుకు డిమాండ్‌ ఉంటుంది. అలా డిమాండ్‌ ఉంటేనే కాలేజీలు ఈ కోర్సులను ప్రారంభించడానికి ముందుకు వస్తాయి. ఈ అనిశ్చితి వల్లనే తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించడానికి రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదని అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో కాలేజీలు ముందుకు వచ్చినా అందుకు తగ్గ ఏర్పాట్లను చేయడానికి కొంత సమయం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదికి రాష్ట్రంలో తెలుగు ఇంజనీరింగ్‌ కాలేజీల ఏర్పాటు లేనట్లేనని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ప్రస్తుతానికి ఏలాంటి ప్రణాళికా లేదు: పాపిరెడ్డి

తెలుగులో ఇంజనీరింగ్‌ కోర్సుల అమలు విషయంలో ఇప్పటి వరకూ ఏలాంటి ప్రణాళికాలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌..  ప్రొఫెసర్‌ పాపిరెడ్డి చెప్పారు. తెలుగు మీడియం ఏర్పాటుకు కాలేజీలు ముందుకు వస్తే అందుకు తగ్గ చర్యల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలేజీలు ముందుకు వచ్చినా.. ఈ ఏడాదికి సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-07-31T08:02:35+05:30 IST