కరోనాతో సౌదీలో తెలుగు వైద్యుడి మృతి

ABN , First Publish Date - 2021-06-11T09:43:57+05:30 IST

ప్రవాసీ తెలుగు వైద్యుడు కరోనాతో మరణించిన ఘటన సౌదీలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన వైద్యుడు కె.విజయారావు సౌదీలోని తాయిఫ్‌ నగర సమీపంలో పనిచేస్తుండేవారు.

కరోనాతో సౌదీలో తెలుగు వైద్యుడి మృతి

బంధువులు రాలేని పరిస్థితి

స్నేహబంధం చాటిన కశ్మీరీ 

అంత్యక్రియల నిర్వహణ


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ప్రవాసీ తెలుగు వైద్యుడు కరోనాతో మరణించిన ఘటన సౌదీలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన వైద్యుడు కె.విజయారావు సౌదీలోని తాయిఫ్‌ నగర సమీపంలో పనిచేస్తుండేవారు. కొద్ది నెలల క్రితం ఆయన భారత్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. సౌదీకి బయలుదేరే ముందు హైదరాబాద్‌లో ఆయనకు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చింది. సౌదీలో దిగిన తర్వాత ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. కొన్నిరోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న తర్వాత ఆస్పత్రిలో చేరి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కొద్ది వారాల క్రితం మరణించారు.


ఆయన భార్య మంగళ హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే విమానాలు తిరగకపోవటంతో ఇండియా నుంచి ఎవరూ రావడానికి వీలు లేకపోయింది. మృతదేహాన్ని భద్రపరిచి స్వదేశానికి పంపించే పరిస్థితి సైతం లేదు. ఈ సమయంలో విజయరావుతో కలిసి పనిచేసిన కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన డాక్టర్‌ ఖైసర్‌ బషీర్‌ అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని తాయిఫ్‌ నగరానికి 300 కిలోమీటర్ల దూరాన ఉన్న ముస్లీమేతర శ్మశానవాటికకు తరలించటానికి అనుమతులు రావటానికి వారాల కొద్దీ సమయం పట్టింది. ఆ ప్రక్రియలన్నీ ఓపికగా పూర్తి చేసి ఇటీవలే విజయారావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్‌ ఖైసర్‌ బషీర్‌ ఔదార్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. 

Updated Date - 2021-06-11T09:43:57+05:30 IST