దుర్మార్గుడి పాలనతోనే రాష్ట్రానికి చేటు

ABN , First Publish Date - 2022-09-28T08:32:32+05:30 IST

దుర్మార్గమైన వ్యక్తి పరిపాలన వల్లే రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందని, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని ఏదని ఎవరైనా అడిగితే చెప్పుకోలేని స్థితికి తీసుకువచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు..

దుర్మార్గుడి పాలనతోనే రాష్ట్రానికి చేటు

‘అమరావతి’పై అబద్ధాలు చెప్పి నాశనం చేస్తున్నారు

ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు: అచ్చెన్నాయుడు 


శ్రీకాకుళం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): దుర్మార్గమైన వ్యక్తి పరిపాలన వల్లే రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందని, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని ఏదని ఎవరైనా అడిగితే చెప్పుకోలేని స్థితికి తీసుకువచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలలో ఏ జిల్లా నుంచి వచ్చినా.. సమాన దూరంలోనే ఉండేలా అమరావతి ఎంపిక జరిగింది. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకొన్నాయి. నాడు ప్రతిపక్షనేతగా జగన్‌ కూడా.. ‘ఆత్మసాక్షి’గా ఒప్పుకున్నానన్నారు. ఇప్పుడు మూడు రాజధానులంటూ అమరావతిని నాశనం చేస్తున్నారు’ అన్నారు.  ‘నాడు అమరావతి రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చి ల్యాండ్‌పూలింగ్‌కు సహకరించారు. ఇవాళ.. అమరావతి అభివృద్ధికి పది లక్షల కోట్లు ఖర్చవుతాయని.. ఇలా అయితే రాష్ట్రాభివృద్ధి ఎలా అని మంత్రులు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారు.


ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు. సుజల స్రవంతి టెండర్లను ఎందుకు ఈ దద్దమ్మ మంత్రులు రద్దుచేశారు. దద్దమ్మల్లారా... ఈ మూడేళ్లలో విశాఖలో ఇసుమంతైనా అభివృద్ధి చెందిందా? మూడున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు.. సాధించారా? విశాఖలో భూములు కబ్జాకు గురయ్యాయి. కొండలు సైతం దోచుకోవడానికే ఈ వేషాలు వేస్తున్నారు’ అన్నారు. ‘ఐదు నిమిషాలు అనుకుంటే పాదయాత్ర జరుగుతుందా’ అని మంత్రి బొత్స అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మీ జాగీరా..? అని బొత్సను నిలదీశారు. ‘ఉత్తరాంధ్ర ప్రజలారా.. ఆలోచించండి. 2014, 2019కు ముందు ఉత్తరాంధ్ర ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు. అమరావతి రైతుల పాదయాత్రగా అరసవల్లి వస్తే అన్ని పార్టీలు.. రాజకీయాలకు అతీతంగా సహకరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ‘పాదయాత్ర చెడగొట్టాలని అధికారపార్టీ పెట్టుకున్న సమావేశంలో.. ఏం మాట్లాడాలంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారపార్టీ నేతలే డుమ్మాకొట్టారు. జగన్‌రెడ్డి ప్రజల్లో పలచనైపోయారు. అందరూ సహకరించుకుని అమరావతిని తెచ్చుకుందాం.. ఆంధ్రాను అభివృద్ధి చేద్దాం.. అన్ని జిల్లాల అభివృద్ధికి సహకరించుకుందాం’’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.   


దళితులపై దాడుల కానుక పథకమేదైనా పెట్టారా?

దేవీ నవరాత్రుల సందర్భంగా సీఎం జగన్‌.. వైఎ్‌సఆర్‌ దళితులపై దాడుల కానుక పథకమేదైనా ప్రవేశపెట్టారా? అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లా తాడిపత్రిలో 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ విజయకుమార్‌పై వైసీపీ మూకల దాడి అమానుషమని అన్నారు. కౌన్సిలర్‌పై దాడి చేసిన వైసీపీ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-09-28T08:32:32+05:30 IST