నేడు టీడీపీ రాష్ట్ర బంద్‌

ABN , First Publish Date - 2021-10-20T08:22:46+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళ వారం రాత్రి మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ..

నేడు టీడీపీ రాష్ట్ర బంద్‌

  • దాడులకు నిరసనగా చంద్రబాబు పిలుపు 
  • ఇది ప్రభుత్వ ప్రాయోజిత టెర్రరిజం
  • సీఎం, డీజీపీ కనుసన్నల్లోనే దాడులు
  • పథకం ప్రకారమే ఒకేసారి రాష్ట్రమంతా
  • రాష్ట్రపతిపాలనకు ఇంకేం కారణం కావాలి?
  • బాబు ఫైర్‌.. బంద్‌కు కలిసిరావాలని విజ్ఞాపన
  • క్లేమోర్‌మైన్లకే భయపడలేదు.. ఈ రౌడీలకు భయపడతానా?
  • ప్రభుత్వ ప్రాయోజిత టెర్రరిజమిది.. సీఎం, డీజీపీ కనుసన్నల్లోనే దాడులు
  • పథకంప్రకారమే రాష్ట్రమంతా.. రాష్ట్రపతిపాలనకు ఇంకేం కారణం కావాలి?
  • నా ఫోన్‌ ఎత్తడానికి డీజీపీకి తీరిక లేదా?
  • కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ ఖాళీగా ఉండి నా ఫోన్‌కు స్పందించారా?: బాబు


అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళ వారం రాత్రి మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బంద్‌పై  ప్రకటన చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు అంతా బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులపై బలంగా నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని చంపాలని చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని, రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ దారుణం చాలదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాయోజిత టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోందని, రౌడీలకు ప్రభుత్వమే పోలీసులతో రక్షణ కల్పించి దాడులకు పంపించే దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ‘‘డీజీపీ కార్యాలయానికి సరిగ్గా కూతవేటు దూరంలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఉంది. రెంటికీ మధ్య వంద గజాల దూరం కూడా లేదు. ఐదుగంటల పదిహేను నిమిషాలకు దాడి జరిగితే సరిగ్గా పది నిమషాల ముందు నేను ఆయనకు దీని గురించి చెబుదామని ఫోన్‌ చేశాను. తనకు వేరే పని ఉందంటూ ఆయన నాతో మాట్లాడటానికి నిరాకరించారు. ముఖ్యమంత్రికి... డీజీపీకి తెలిసే ఈ దాడి జరిగింది. పది మంది పోలీసులు వచ్చి నిలబడితే ఈ మూకలు మా కార్యాలయం లోపలికి అడుగుపెట్టగలిగేవి కావు. కానీ ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకొన్నారు. పార్టీ కార్యాలయం మాకు ఒక దేవాలయం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కేంద్రం. ఒక జాతీయ పార్టీకి కేంద్ర కార్యాలయం. ఒక పార్టీ కార్యాలయంపై ప్రభుత్వం, పోలీసులు సహకరించి గూండాలను పంపడం నా రాజకీయ జీవితంలో చూడలేదు.


తన కార్యాలయం పక్కన ఉన్న పార్టీ కార్యాలయాన్ని కాపాడలేని డీజీపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడగలడా? ఇంకా ఆయనకు ఆ సీట్లో ఉండే అర్హత ఉందా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి సాగు... రవాణా... మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరిగిపోతే దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతిపక్ష పార్టీగా తమకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. మాజీ మంత్రి ఆనందబాబు ఇంటికి పోలీసులు వెళ్లి నానా రచ్చ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. ఏపీలో గంజాయి సాగు, రవాణా విపరీతంగా పెరిగిపోయాయని బహిరంగంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో గంజాయి సాగు లేనేలేదని, ఏపీ నుంచి వస్తున్న గంజాయితోనే తమకు సమస్య ఉందని ఆయన చెప్పారని, ఇదే విషయం తాము లేవనెత్తితే చంపడానికి కార్యాలయాలపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు.


కర్రలు... సుత్తులు... బీరు సీసాలు

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారు తమతోపాటు తెచ్చిన కర్రలు, సుత్తులు, బీరు సీసాలను చంద్రబాబు విలేకరుల సమావేశంలో చూపించారు. ‘‘బీరు సీసాలు ఇక్కడే తాగి పడేశారు. కర్రలు, సుత్తులతో పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు. అడ్డువచ్చిన మా పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కొడితే ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స తీసుకొంటున్నారు. మీడియా ప్రతినిధులను కూడా కొట్టారు. తాగించి తెచ్చి రౌడీయిజం చేస్తారా? 24 క్లెమోర్‌ మైన్స్‌తో నాపై దాడి చేసినప్పుడే నేను భయపడలేదు. ఈ రౌడీలకు భయపడతానా? మా ప్రాణాలు పోయినా మేం భయపడేది లేదు. ఎదిరించి నిలబడతాం. మేం మా కోసం పోరాటం చేయడం లేదు. ఈ రాష్ట్రం కోసం... ప్రజల కోసం పోరాడుతున్నాం. డ్రగ్స్‌ వలలో యువత నాశనం అయిపోతోంది. కరెంటు చార్జీలు విపరీతంగా పెంచుతూ పోతున్నారు. అవినీతికి అంతే లేకుండా పోతోంది. వీటిపై  మేం ప్రశ్నిస్తే రౌడీలను పంపించి మా నోరు మూయించాలని చూస్తున్నారు. దేశం మొత్తం చేసిన ఒక సర్వేలో ఏపీలోని ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం బాగా ఎక్కువగా ఉందని వచ్చింది. ఇష్టానుసారం జనంపై పడి దోచుకోవడం... రౌడీయిజం చేస్తుండటం వల్లే ఈ పరిస్ధితి నెలకొంది. ఒక వ్యవస్థీకృత నేరం మాదిరిగా ఈ దాడి చేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, హిందూపురం, కర్నూలు వంటిచోట్ల కూడా ఈ దాడులు చేశారు. పట్టాభి ఇంటిపై రెండోసారి దాడి జరిగింది. చేతులెత్తి విజ్ఞప్తి చేస్తు న్నా.. ఈ దుర్మార్గంపై ప్రజలు కదలాలి. కార్యాలయాలు, కాలేజీలు బుధవారం మూసి వేయాలి. పోలీసులు వచ్చి ఒత్తిడి చేసినా తెరవవద్దు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-20T08:22:46+05:30 IST