మనోరంజకంగా ‘జనరంజని’.. ఘనంగా తొలి వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T01:05:06+05:30 IST

మనోరంజకంగా ‘జనరంజని’.. ఘనంగా తొలి వార్షికోత్సవం

మనోరంజకంగా ‘జనరంజని’.. ఘనంగా తొలి వార్షికోత్సవం

ముంబై: ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ "జనరంజని" ముంబై నగరంలో ప్రధాన కేంద్రంగా నెలకొల్పబడింది. ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదిక‌పై 19, 20 తేదీల్లో ఘనంగా జరిగాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు సింగపూర్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ నుంచి చాలా మంది సభ్యులు, అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కనులవిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బుచ్చి రాంప్రసాద్, వామరాజు సత్యమూర్తి, కామర్స్ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ రాజకీయవేత్తలు, తెలుగు సంస్కృతి పోషకులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. 


జనరంజని వ్యవస్థాపకులు రుద్రాభట్ల రామ్ కుమార్ మాట్లాడుతూ "గత ఏడాదిగా జనరంజని తరపున చాలా సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులందరి సహకారంతో మరిన్ని చక్కటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అమెరికా నుంచి రమేష్ దేశిభొట్ల, సింగపూర్ నుండి శ్రీ కవుటూరు రత్న కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు.


మలయాళ లలితాంబికా తపోవనం పీఠాధిపతి సర్వేశ్వరానందగిరి స్వామీజీ జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమం ప్రారంభించారు. ప్రముఖ గాయని, శ్రీమతి దివాకర్ల సురేఖ మూర్తి, సుమధుర గాయకులు నేమాని పార్థసారథి, వారి శిష్య బృందం చక్కటి సినీ లలిత గీతాలతో అలరించారు.  బెంగళూరు నుంచి ప్రహ్లాద ఆచార్య "షాడో షో" లో నీడలతో తెరపై బొమ్మలను ప్రదర్శించిన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


హాస్యబ్రహ్మ శంకర నారాయణ చక్కటి హాస్య ప్రసంగంతో నవ్వులు కురిపించగా, శ్రీమతి మండా వరలక్ష్మి హరికథాగానం, కుమారి పగడాల శృతి జానపద గీతాలు, వేముల రంగారావు మురళీ వాదన, సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈల పాటలు, అత్తిలి అనంతరామ్ హాస్య కథానిక, చిన్నారుల నృత్యాలు మొదలైన అంశాలు అందరిని ఎంతో అలరించాయి.



రాధిక మంగిపూడి, కస్తూరి శివశంకర్, శ్రీలేఖ వారణాసి, దశక చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీ కంభంపాటి మాధవరావు వందన సమర్పణ చేశారు.

Updated Date - 2021-06-22T01:05:06+05:30 IST