జాతి పరువు తీస్తున్న తెలుగు సీఎంలు

ABN , First Publish Date - 2021-12-07T06:06:15+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగువారి పరువు తీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి పూటకో మాట చెప్పి కేంద్రాన్ని దూషిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుంటే...

జాతి పరువు తీస్తున్న తెలుగు సీఎంలు

దేశ రాజధాని ఢిల్లీలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగువారి పరువు తీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి పూటకో మాట చెప్పి కేంద్రాన్ని దూషిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చి అప్పుల పాలు చేయడమే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరదలకు గ్రామా లకు గ్రామాలు కొట్టుకుపోతే బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారు. 


హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ప్రజలు ఘోరంగా ఓడించిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కలలో కూడా కాషాయ ధ్వజం రెపరెపలు కనపడడం ప్రారంభమైనట్లున్నది. దీనితో బిజెపికి వ్యతిరేకంగా ప్రజల్లో ఏ విధంగా ప్రచారం చేయాలో అన్న ఆలోచనతో ఆయన ధాన్యం సేకరణపై బూటకపు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ముడిబియ్యాన్ని కానీ, ఉప్పుడు బియ్యాన్ని కానీ సేకరించడం లేదని గోబెల్స్ ప్రచారం చేయడం కొనసాగించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని దద్దమ్మ అంటూ దూషించారు. ఎవరినైనా నోటికొచ్చినట్లు దూషిస్తే తెలంగాణ ప్రజలు నమ్మే రోజులు పోయాయి. అంతేకాకుండా ఆయన తిట్లకు ప్రతితిట్లు తిట్టేందుకు రాష్ట్ర బిజెపి నేతలు సిద్దంగా ఉండడంతో కేసిఆర్‌ తిట్లకు విలువ లేకుండా పోయింది. ప్రతి రోజూ బూటకపు ఆరోపణలు చేయడం, పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులతో నిరసన ప్రదర్శనలు చేయించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా చిత్రించాలని ఆయన ప్రయత్నించారు. కానీ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్, సహాయమంత్రి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలను ప్రజల ముందుంచడంతో టిఆర్‌ఎస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. భారత ఆహార సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే రాష్ట్రాలనుంచి బియ్యం సేకరిస్తామని, తెలంగాణ విషయంలో ఎలాంటి అన్యాయం జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 94.53 లక్షల టన్నుల్లో ఎంత ఇస్తే అంత సేకరిస్తామని, ఉప్పుడు బియ్యంతో సహా మొత్తం బియ్యం సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. విచిత్రమేమంటే భారత ఆహార సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కూడా తెలంగాణ బియ్యం సరఫరా చేయలేకపోయిందని పీయూష్ గోయెల్ వెల్లడించడంతో కేసిఆర్‌ సర్కార్ అసలు స్వరూపం బయటపడింది. 2019–20లో 61.92 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పి కేవలం 42.99 లక్షల టన్నులు సరఫరా చేశారు. గత ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల టన్నులకు గాను 32.66 లక్షల టన్నులే సరఫరా చేశారు. ఉప్పుడు బియ్యం 24.75 లక్షల టన్నుల మేరకు తొలుత లక్ష్యంగా విధిస్తే ఈ మొత్తాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. దీనితో కేంద్రం ఈ లక్ష్యాన్ని 44.75 లక్షల టన్నులకు పెంచింది. అయినప్పటికీ ఇందులో కూడా కేవలం 27.78 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. మిగతా 17లక్షల టన్నులు పెండింగ్‌లో ఉంది. ఇంకా 29 లక్షల టన్నుల ముడి, 17 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం రాష్ట్రం నుంచి రావాల్సి ఉన్నదని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారు. అక్టోబరు 7న పీయూష్ గోయెల్ రాసిన లేఖ ప్రకారం ఇప్పటికే ఐదుసార్లు పొడిగింపు ఇచ్చినప్పటికీ, తెలంగాణ తగిన నిల్వలను సరఫరా చేయలేకపోయింది.


మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వరదల భీభత్సం జరిగితే జగన్మోహన్ రెడ్డి రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ప్రకృతి విలయంతో కంటే, మానవ తప్పిదంతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టమే ఎక్కువ ఉన్నదని రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తెలిపింది. విపత్తుల విధ్వంసం ఎంత భయానకంగా ఉంటుందో జగన్ సర్కార్ అంచనా వేయలేకపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మీడియా ముందుగా చెప్పినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసినప్పటికీ రాష్ట్రం చేతులు ముడుచుకుని కూర్చుంది. పైగా కడప బీభత్సాన్ని ప్రత్యేక విమానంలో చూడడానికి వెళుతూ, ముఖ్యమంత్రి తన అనుయాయులతో నవ్వుతూ సెల్ఫీలు దిగడం చూస్తే ప్రజల బాధలంటే ఆయనకెంత నవ్వులాటగా ఉన్నదో అర్థమవుతోంది. ఆనకట్ట తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోయిన విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ పార్లమెంట్‌లో ప్రకటించి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని జాతీయ స్థాయిలో బహిర్గతం చేశారు. తమ తప్పు ఒప్పుకునే బదులు వైసీపీ మంత్రులు కొందరు కేంద్రమంత్రిపైనే దాడి చేయడం దురదృష్టకరం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆనకట్టల భద్రతకు బిల్లును ప్రవేశపెట్టింది. 


తెలంగాణలో కేసిఆర్ దూషణల ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి మరింత శ్రుతిమించిపోయి, మంత్రులు, ఎమ్మెల్యేలు అనాగరిక రీతుల్లో దాడిచేయడం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీమణిపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ ఎమ్మెల్యేల కుసంస్కారాన్ని, స్త్రీలపై వారికున్న నీచమైన అభిప్రాయాలను వెల్లడించింది. తన అవినీతిని, హత్యారాజకీయాలను, అధికార దుర్వినియోగాన్ని అసమర్థ నిర్ణయాలను, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఎవరైనా విమర్శిస్తే వారిపై భౌతికంగా కాకపోతే సంస్కారహీనమైన భాషతో దాడులు చేయడాన్ని జగన్, ఆయన అనుయాయులు అలవరుచుకున్నారు. 


ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడతాయని, ప్రజల ప్రాంతీయ అస్తిత్వాన్ని పరిరక్షిస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం ఉండబోదని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసిఆర్, జగన్ ప్రభుత్వాల తీరుతెన్నులను గమనించిన వారికి అర్థమవుతుంది. ఇద్దరూ తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రజల అస్తిత్వాన్ని తాకట్టుపెట్టారు. తెలంగాణ అస్తిత్వం పేరుతో కేసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్లు హస్తగతం చేసుకుంటే మరోవైపు ఏపీలో జగన్ కూడా ప్రజలను దోచుకోవడమే పరమావధిగా భావిస్తున్నారు. అందుకే దేశ ప్రయోజనాలను కాపాడడంతోపాటు రాష్ట్రాల అస్తిత్వాన్ని కూడా కాపాడగలిగిన ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు తెలుసునే పరిస్థితి ఏర్పడుతోంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు భారతీయ జనతా పార్టీయే భవిష్యత్ ఆశాకిరణం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-12-07T06:06:15+05:30 IST