తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోంది అని భారత ప్రధాని మోదీ అన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో మోదీ పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని మోదీ కొనియాడారు. అలాగే, తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని.. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని అన్నారు. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమని, పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇలా తెలుగుచిత్ర పరిశ్రమపై మోదీ ప్రశంసలు కురిపించినందుకు గానూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.