Aug 1 2021 @ 18:11PM

నేషనల్‌ ఆర్కైవ్స్‌లో తెలుగు సినిమా జ్ఞాపకాలు

తొలిసినిమా ప్రవేశించిన నాటికాలంలో సినిమా హాళ్లలో ప్రదర్శించే అపురూపమైన 450 తెలుగు సినిమా గ్లాస్‌ స్లైడ్లను నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా సేకరించింది. సినిమా ప్రారంభానికి ముందు లేదా ఇంటర్వెల్స్‌లో కొత్త సినిమా ఆకర్షణల గురించి తెలిపేందుకు రెండు పలుచటి చదరపు గ్లాసు అద్దాల మధ్య పాజిటివ్‌ ఫిల్మ్‌ను చేర్చేవారు. 1930–1950ల వరకు తొలి తెలుగు సినిమా సంబంధించిన చరిత్ర ఈ గ్లాస్‌ స్లైడ్ల ద్వారా లభిస్తుందని నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ అధికారులు తెలిపారు. 1939లో దర్శకుడు వై.వి.రావు తెరకెక్కించిన ‘మళ్లీ పెళ్లి’,  బి.ఎన్‌ రెడ్డి ‘వందేమాతరం’, ‘కీలుగుర్రం’ (1949), ‘దాసి’ (1952), ‘దేవదాసు’ (1953) చిత్రాలు ఆర్కైవ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం తమ వద్ద హిందీ, గుజరాతీ, తెలుగు సినిమాలకు చందిన 2వేల గ్లాస్‌ స్లైడ్లు ఉన్నాయని ఎన్‌ ఎఫ్‌ ఏ ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ మగ్దూం తెలిపారు. ఇవి భారతీయ సినిమా వారసత్వ సంపదకు చెందిన అపురూప రికార్డులని ఆయన అన్నారు. పాత సినిమాలకు సంబంధించిన గ్లాస్‌ స్లైడ్లు, పోస్టర్లు, ఫుటేజీలు, లాబీ కార్డులు, చిత్రాలను తమ వద్ద డిపాజిట్‌ చేస్తే పరిరక్షిస్తామని ఆయన సినిమా ప్రేమికులను అభ్యర్థించారు.