అ.. అమ్మభాష ఆ.. ఆన్‌లైన్‌

ABN , First Publish Date - 2020-02-21T06:45:50+05:30 IST

ఇంటర్‌నెట్‌ వినియోగం అంటే.. ఒకప్పుడు ఆంగ్ల భాషలో ఉండే సైట్లే గుర్తొచ్చేవి. ఏవో ఒకటీ అరా తెలుగు సైట్లు ఉండేవి. వాటిని కూడా ప్రొప్రైటరీ పాంట్లతో రూపొందించడం వల్ల..

అ.. అమ్మభాష ఆ.. ఆన్‌లైన్‌

  • నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
  • మాతృభాషలో సమాచారానికి మనోళ్ల ప్రాధాన్యం.. ప్రాంతీయ భాషల బాటలో దిగ్గజ టెక్‌ సంస్థలు
  • తెలుగులోనే సైట్లు, యాప్‌ల సేవలు


హైదరాబాద్‌సిటీ, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌నెట్‌ వినియోగం అంటే.. ఒకప్పుడు ఆంగ్ల భాషలో ఉండే సైట్లే గుర్తొచ్చేవి. ఏవో ఒకటీ అరా తెలుగు సైట్లు ఉండేవి. వాటిని కూడా  ప్రొప్రైటరీ పాంట్లతో రూపొందించడం వల్ల.. గూగుల్‌ సెర్చ్‌లో ఎక్కడా తెలుగు సైట్లు కనిపించేవే కావు. తెలిసిన నాలుగైదు సైట్లనే చూడాల్సిన దుస్థితి. కానీ.. గత పదేళ్లలో అంతా మారిపోయింది. గూగుల్‌ నుంచి ఫేస్‌బుక్‌ దాకా.. క్వికర్‌ నుంచి కోరా దాకా.. ఎన్నో ప్రముఖ వెబ్‌సైట్లు తెలుగులోకి వచ్చేశాయి. ఆ మాటకొస్తే భారతీయభాషలన్నింటిలోకీ తమ కార్యకలాపాలను విస్తరించాయి.  నెట్‌ వినియోగదారులు సైతం.. మాతృభాషలోనే సమాచారాన్ని కోరుకుంటున్నట్టు గత ఏడాది గూగుల్‌ చేసిన సర్వేలో కూడా తేలింది.  దీంతో అప్రమత్తమైన పలు సంస్థలు ఇప్పుడు తమ సైట్లను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఉదాహరణకు.. స్నాప్‌చాట్‌ సంస్థ ఇటీవలే ఐదు భాషలకు విస్తరించింది. గూగుల్‌ సంస్థ సైతం.. ప్రాంతీయ భాషల్లో నెట్‌ వినియోగాన్ని పెంచేందుకు బెంగళూరులో ఒక కృత్రిమ మేధ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం గూగుల్‌ అసిస్టెంట్‌ ఆంగ్ల భాషలో ఇచ్చే ఆదేశాలకు మాత్రమే స్పందిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ భాషల్లో మాట్లాడినా గూగుల్‌ అసిస్టెంట్‌కు అర్థమయ్యేలా దాని మేధను పెంచేందుకు కృషి చేస్తోంది.


మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో 10 భారతీయ భాషల ఫొనెటిక్‌ కీబోర్డులను నిక్షిప్తం చేసింది. ఆ కీబోర్డు సాయంతో.. థర్డ్‌పార్టీ తెలుగు టైపింగ్‌ సాఫ్ట్‌వేర్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా తెలుగులో టైప్‌ చేసుకోవచ్చు. 2017లో గూగుల్‌, కేపీఎంజీ ఇచ్చిన సంయుక్త నివేదిక ప్రకారం.. 2016 నాటికి మనదేశంలోని ఇంటర్‌నెట్‌ వినియోగదారుల్లో 17.5 కోట్ల మంది ఆంగ్లం తెలిసినవారు కాగా, 23.4 కోట్ల మంది ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కోరుకుంటున్నవారు. ఈ తేడా మరింత పెరిగి.. 2021 నాటికి ప్రతి 10 మందిలో 9 మంది తమ మాతృభాషలో మాత్రమే సమాచారాన్ని కోరుకుంటారని ఆ నివేదిక అంచనా వేసింది. ప్రాంతీయ భాషల వినియోగదారుల సంఖ్య 50 కోట్లు దాటి.. ఇంగ్లి్‌షలో సమాచారాన్ని చూసేవారి సంఖ్య మాత్రం 25 కోట్లలోపే ఉంటుందని అభిప్రాయపడింది.


వికీలో తెలుగు వెలుగులు

దశాబ్దకాలం క్రితమే వికీపీడియాలో తెలుగు ఒక వెలుగు వెలిగింది. ఒకదశలో హిందీని మించి భారతీయ భాషల్లో అత్యధిక పేజీలున్న భాషగా తెలుగు అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలోని డిజిటల్‌ మీడియా వింగ్‌, ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి రాష్ట్ర సమాచారాన్నంతా వికీపీడియాలో తెలుగులోకి తెచ్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పర్యాటకం, రాజకీయాలు, సాహిత్యం, సైన్స్‌, టెక్నాలజీ, ప్రభు త్వ పథకాలు.. ఇలా అన్ని వివరాలను తెలుగులోనే అందుబాటులోకి తేనుంది.


ఫోన్లలో సైతం..

కంప్యూటర్లలోనే కాదు.. ఫోన్లలో సైతం భారతీయ భాషల వినియోగదారులకు సేవలందించడంపై టెక్‌ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఉదాహరణకు.. గూగుల్‌ ఇండిక్‌ కీబోర్డు యాప్‌ను మన స్మార్ట్‌ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటే టైప్‌ చేయాల్సిన పని కూడా లేకుండా తెలుగులో మనం చెప్పే మాటలను టైప్‌ చేసే సౌలభ్యం ఉంది. ఇదే కోవలో మైక్రోసాఫ్ట్‌ కూడా భారతీయ భాషల్లో టైప్‌ చేయగల కీబోర్డు యాప్‌ ‘స్విఫ్ట్‌కీ’ని కొనుగోలు చేసింది. టెక్‌ దిగ్గజాలే కాదు.. స్టార్ట్‌పలు కూడా తెలుగు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్లు, సాహిత్యానికి సంబంధించిన యాప్‌లు, వంటల యాప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

Updated Date - 2020-02-21T06:45:50+05:30 IST