నెరవేరిన కల... ఆ ఊరి బస్సుకు ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-03-05T20:47:47+05:30 IST

ఎన్నో రోజులుగా ఆ ఊరి ప్రజలు బస్సు కోసం వేచి చూశారు.. బస్సును తమ ఊరికి రప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు..

నెరవేరిన కల... ఆ ఊరి బస్సుకు ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభోత్సవం

ఏలూరు/జంగారెడ్డిగూడెం : ఎన్నో రోజులుగా ఆ ఊరి ప్రజలు బస్సు కోసం వేచి చూశారు.. బస్సును తమ ఊరికి రప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.. అయితే అవన్నీ విఫలమే అయ్యాయి. అయితే.. ఎమ్మెల్యే ఒక్కమాట అనుకునే సరికి ఊరికి బస్సొచ్చేసింది.. జనాల కల నెలవేరింది. ఇక చూడండి... ఆ ఊరి ప్రజల ఆనందానికి హద్దుల్లేవ్. అయితే అదేమి అంతర్రాష్ట్రమా అంటే అదీ కాదు. పోనీ వేరే రాష్ట్రానికి చెందిన జిల్లానా... అంటే అంతకుమించి కానే కాదు. ఆ బస్సు ఆర్డినరీ బస్సే అయినా సరే ఎందుకింత ఆనందం?.. అంటే ఈ బస్సు మనుషుల్ని, వారి మనసుల్ని కలిపేది. ఆత్మీయులను, వారితో అనుబంధాలను నిలిపేది గనుక. ఇంతకీ ఆ బస్సు కథేంటో ఈ కథనంలో చూద్దాం.


బస్సు ఇలా..!

జీలుగుమిల్లి నుంచి పోలవరం వయా రెడ్డిగణపవరం, బుట్టాయిగూడెం వెళ్లే బస్సు సర్వీస్‌ను వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. శనివారం నాడు లాంచనంగా బాలరాజు.. బుట్టాయిగూడెం మండలం రెడ్డి, గణపవరం నుంచి బస్సు ను జెండా ఊపి ప్రారంభించారు. తమ ఊరితో, తమ బంధువులతో కలిపే ఈ బస్సు ప్రారంభంతో నిర్వాసిత గ్రామ ప్రజల ఆనందంలో మునిగిపోయారు. ఈ ఒక బస్సు సర్వీస్ కోసం ఎందుకింత ప్రాధాన్యత..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


ఇందుకే ఇంత ప్రాధాన్యత..

పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల కలిసి ఉండే గ్రామాలు అన్ని జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో వివిధ ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మించి తరలించారు. ఇన్నాళ్లు పక్క పక్క గ్రామాల్లో, కూత వేటు దూరల్లో నివసించిన వాళ్లంతా, ఇప్పుడు మైళ్ళకు మైళ్ళ దూరాల్లో దూరమైపోయారు. వీరంతా వాళ్ళ బంధుత్వాల కోసం వారి బంధాలు కోసం వెళ్లాలంటే పడే తిప్పలు అన్ని ఇన్ని కావు, రెండు మూడు బస్సులు మారి, ఆటోలు పట్టుకుంటే కానీ వెళ్లలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఊరికి బస్సొచ్చేసింది. ఇదిగో ఈ ఫొటోలో చూస్తున్న ఈ బస్సు సర్వీసే వాళ్ళ హృదయాలను గెలుచుకుంది. మొదట ఈ బస్సు సర్వీస్ గురించి ఎన్నాళ్లగానే వేచి చూస్తున్న జనాలు ఈ సమస్యను ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు వివరించారు. దీంతో వెంటనే ఆయన ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ మంత్రి, జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఉన్న పేర్ని నానితో మాట్లాడి విషయం చెప్పారు. రోజుల వ్యవధిలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికేసింది. దీంతో ఆ ఊరి జనాల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.. ఇదీ ఆ బస్సు కథ.

Updated Date - 2022-03-05T20:47:47+05:30 IST