దిక్కున్న చోట చెప్పుకో!

ABN , First Publish Date - 2022-05-20T05:42:45+05:30 IST

‘నేను పోలీస్‌.. నిన్ను ఏం చేసినా అడిగే నాథుడే ఉండడు, దిక్కున్నచోట చెప్పుకో..’ అంటూ ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన భార్యపై ప్రతాపం చూపించడంతో, వేధింపులను భరించలేక ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట గురువారం బైఠాయించింది.

దిక్కున్న చోట చెప్పుకో!
ఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో గోడు వెళ్లబోసుకుంటున్న జ్యోతి

భార్యపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ వేధింపులు 

ఎస్పీ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి నిరసన


సంగారెడ్డి క్రైం, మే 19: ‘నేను పోలీస్‌.. నిన్ను ఏం చేసినా అడిగే నాథుడే ఉండడు, దిక్కున్నచోట చెప్పుకో..’ అంటూ ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన భార్యపై ప్రతాపం చూపించడంతో, వేధింపులను భరించలేక ముగ్గురు పిల్లలతో కలిసి  ఆమె సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట గురువారం బైఠాయించింది.  బాధితురాలు జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం సైదాపూర్‌ గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహులు సంగారెడ్డి హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 2008 జూన్‌ 27న జ్యోతితో  వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల నగదు, మోటార్‌ సైకిల్‌ అత్తింటి వారు కట్నంగా ఇచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా తన భర్త నర్సింహులు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని జ్యోతి ఆరోపించింది. తనకు వివాహేతర సంబంధం వుందంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, అంతేగాక గతంలో ఒకసారి తనపై కిరోసిన్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని వాపోయింది. పిల్లలకు స్కూల్‌ ఫీజులు కూడా చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై తన భర్త నర్సింహులును నిలదీస్తే ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇంట్లో నుంచి నీవు వెళ్లిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటానంటూ చిత్ర హింసలకు గురిచేశాడని ఆరోపించారు. ఈ విషయమై కొండాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. దీంతో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట తన ముగ్గురు పిల్లలతో కలిసి బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం వినతిపత్రాన్ని సమర్పించేందుకు యత్నిస్తే జిల్లా ఎస్పీని కలవనీయడం లేదని జ్యోతి ఆరోపించారు. ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లి విషయం తెలుసుకోగానే జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ఆమెను పిలిపించుకొని మాట్లాడారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో జ్యోతి నిరసన విరమించింది.  

Updated Date - 2022-05-20T05:42:45+05:30 IST