ఈ పాట ఏ సినిమాలోదో చెప్పు!

ABN , First Publish Date - 2021-02-24T08:01:55+05:30 IST

అత్తింటి వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ, తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది.

ఈ పాట ఏ సినిమాలోదో చెప్పు!

  • బిహార్‌లో బాధితురాలి ఎదుట పాట పాడిన సీఐ
  • వరకట్న వేధింపులతో ఆమెపై అత్తింటివారి దాడి
  • కేసు నమోదుకు నో.. అవమానించేలా మాటలు

పట్నా, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అత్తింటి వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ, తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. అక్కడి సీఐ ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోలేదు సరికదా ఆమెను చూస్తూ ఓ పాట పాడాడు. నాకు న్యాయం చేయండి సారూ అంటూ బాధితురాలు ఆర్థిస్తున్నా వినిపించుకోకుండా తాను పాడిన పాట ఏ సినిమాలో చెప్పాలంటూ ఆమెను ప్రశ్నించాడు! బిహార్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ తాలూకు ఓ వీడియో నెట్‌లో వైరల్‌గా మారడంతో సీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు.. మహారాజ్‌గంజ్‌కు చెందిన రేణు. గత ఏడాది జూన్‌లో ఆమెకు రాహుల్‌ అనే యువకుడితో పెళ్లయింది. అప్పటి నుంచే అత్తింటివారు తరచూ ఆమెపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు. ఫిబ్రవరి 19న ఆమెను భర్త సహా అత్తింటివారు తీవ్రంగా కొట్టారు. 


ఇంటిపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె, ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఘటనపై ఫిర్యాదు చేసేందుకు మహారాజ్‌గంజ్‌  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడి సీఐ దీనానాథ్‌ మిశ్రా, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోకుండా వెకిలి చేష్టలతో వేధించాడు. తన చేతిపై మామ కత్తితో దాడి చేశాడంటూ గాట్లను ఆమె చూపగా.. ‘‘చేతిపై ఎందుకు పొడిచాడు? నీ కడుపులో ఎందుకు పొడవలేదు. కడుపులో పొడవాల్సింది’’ అంటూ దీనానాథ్‌ అవమానకరంగా మాట్లాడాడు. దీంతో ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారినా సదరు సీఐని ఉన్నతాధికారులు మందలింపుతో సరిపెట్టారు. తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. 

Updated Date - 2021-02-24T08:01:55+05:30 IST