Telecom Towers: బీఎస్ఎన్ఎల్ ఖాతాదారుల కష్టాలకు చెక్!

ABN , First Publish Date - 2022-10-04T23:09:22+05:30 IST

బీఎస్ఎన్ఎల్ (BSNL) ఖాతాదారుల కష్టాలు తీరే సమయం వచ్చేసింది. ఇకపై మారుమూల ప్రాంతాల్లో చక్కని కనెక్టివిటీ

Telecom Towers: బీఎస్ఎన్ఎల్ ఖాతాదారుల కష్టాలకు చెక్!

న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ (BSNL) ఖాతాదారుల కష్టాలు తీరే సమయం వచ్చేసింది. ఇకపై మారుమూల ప్రాంతాల్లో చక్కని కనెక్టివిటీ లభించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వచ్చే 500 రోజుల్లో 25 వేల టెలికం టవర్ల (Telecom Towers)ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 26 వేల కోట్ల నిధులను కేటాయించనుంది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా గ్రామాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేస్తారు. ఫలితంగా పల్లె ప్రజలకు కూడా నిరంతరాయ సేవలు లభిస్తాయి. 


టెలికం శాఖ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) నుంచి ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ రంగ టెలికం (Telecom) సంస్థ బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) సందర్భంగా జరిగిన మూడు రోజుల రాష్ట్ర  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రుల సదస్సులో ప్రభుత్వం ఈ నిధులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా టెలికం(Telecom) కనెక్టివిటీ కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని కేంద్రం టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేగంగా ఆన్‌బోర్డింగ్ చేసినందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మంత్రి అభినందించారు. రూ. 2 వేల కోట్ల విలువైన మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయాన్ని అందించినట్టు చెప్పారు. బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు రూపొందించడం ద్వారా వ్యాపారాలను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. టెలిగ్రాఫ్ చట్టంలో సవరణ ద్వారా 2003లో కేంద్రం  యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)ను ఏర్పాటు చేసింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ టెలికం సేవల (Telecom Services)ను అందించే లక్ష్యంతో దీనిని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య పరమైన కార్యకలాపాలు లేకపోవడంతో ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మార్కెట్ మెకానిజం కరువవుతోంది. ఫలితంగా మారుమూల ప్రాంతాలకు టెలికం సేవలు అందడం లేదు. కేంద్రం ఇప్పుడు ఈ నిధులను కేటాయించడం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు చేరుకోగలుగుతాయి.  

Updated Date - 2022-10-04T23:09:22+05:30 IST