టెలికం, వాహన రంగాలకు ఊరట.. ఊతం

ABN , First Publish Date - 2021-09-16T08:32:09+05:30 IST

నిధుల కొరతతో అల్లాడుతున్న టెలికం రంగానికి భారీ ఊరట కలిగించేలా..

టెలికం, వాహన రంగాలకు ఊరట.. ఊతం

  • 1.5 లక్షల కోట్ల బకాయిల చెల్లింపుపై 4 ఏళ్ల మారటోరియం
  • ఏజీఆర్‌ నిర్వచనం, లైసెన్స్‌ ఫీజుల హేతుబద్ధీకరణ
  • 5జీ టెక్నాలజీలో విదేశీ పెట్టుబడులకు పెరిగిన అవకాశాలు 
  • రూ.26 వేల కోట్లతో వాహన రంగానికి ప్రోత్సాహకాలు
  • కీలక ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం
  • కేబినెట్‌ నిర్ణయాలతో టెలికం కంపెనీలకు ఉపశమనం
  • వాహన రంగానికి ప్రకటించిన ప్రోత్సాహకాలతో ఐదేళ్లలో
  • 42,500 కోట్ల పెట్టుబడులు.. 7.6 లక్షల ఉద్యోగాల అంచనా
  • డ్రోన్ల రంగంలో వచ్చే మూడేళ్లలో 5000 కోట్ల పెట్టుబడులు,
  • పదివేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం: అధికారులు
  • 2022 జనవరి/ఫిబ్రవరిలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం: అశ్వనీ వైష్ణవ్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: నిధుల కొరతతో అల్లాడుతున్న టెలికం రంగానికి భారీ ఊరట కలిగించేలా.. వాహన రంగానికి పెద్ద ఎత్తున ఊతమిచ్చేలా.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికం రంగానికి సంబంధించి ఆటోమేటిక్‌ మార్గంలో 100ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, ఏజీఆర్‌ (సవరించిన స్థూల ఆదాయ) బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం, ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్ధీకరించడం.. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ వాహనాల ఉత్పత్తిని పెంచడానికిగాను వాహన రంగానికి రూ.26 వేల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. టెలికం రంగానికి సంబంధించి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలతో వొడాఫోన్‌ ఐడియా వంటి కంపెనీలకు భారీ ఉపశమనం కలగనుంది. ఈ నిర్ణయంతో 1.5 లక్షల కోట్ల బకాయిల చెల్లింపు నుంచి టెల్కోలకు నాలుగేళ్ల పాటు ఉపశమనం లభించినట్లయింది. ఉదాహరణకు.. వొడాఫోన్‌ ఐడియా రూ.50 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.25,976 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లించేందుకు కంపెనీలు ఎక్కువ సమయం అడుగుతున్నాయి. ఇప్పుడా సమయం వాటికి లభించినట్టయింది. 


టెలికం రంగంతో సంబంధంలేని ఆదాయాన్ని ఏజీఆర్‌ నుంచి మినహాయించడం ద్వారా ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్టు కేంద్ర టెలికం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఇక, ఆటోమేటిక్‌ మార్గం ద్వారా 100ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివ్వడమంటే టెలికం రంగంలో విదేశీ కంపెనీలు ఆర్బీఐ ముందస్తు అనుమతి అవసరం లేకుండానే నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే స్పెక్ట్రమ్‌ చార్జీ లు, లైసెన్స్‌ ఫీజులు, ఇతరత్రా చార్జీలకు సంబంధించి భారీ వడ్డీలు, జరిమానాల, జరిమానాలపై వడ్డీల విధింపు వంటివాటిని హేతుబద్ధీకరించారు. 2021 అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులను 30 ఏళ్లకు కేటాయిస్తారు. ఇంకా పలు విధానపరమైన నిర్ణయాలనూ కేబినెట్‌ ఆమోదించింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండొచ్చని వైష్ణవ్‌ తెలిపారు.


వాహన, డ్రోన్‌ రంగాలకు..

దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి వీలుగా వాహన, డ్రోన్‌ రంగాలకు రూ.26,058 కోట్ల మేర ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వాహన రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఇంక్రిమెంటల్‌ ఉత్పత్తి రూ.2.3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే, డ్రోన్‌ రంగంలో వచ్చే మూడేళ్లలో రూ.5000 కోట్ల తాజా పెట్టుబడులు వస్తాయని, ఆ రంగంలో ఇంక్రిమెంటల్‌ ఉత్పత్తి రూ.1500 కోట్లకు చేరుతుందని, అదనంగా 10 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. రూ.18,100 కోట్లతో ఇప్పటికే ప్రారంభించిన ‘అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌’, రూ.10 వేల కోట్లతో ప్రారంభించిన ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) పథకాలకు తోడు ఆటోమోటివ్‌ రంగానికి తాజాగా కేటాయించిన ఈ ప్రోత్సాహకాలు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి మరింత తోడ్పతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 


ప్రోత్సాహకాల వల్ల వచ్చే ఐదేళ్లలో భారత్‌లో కనీస అదనపు ఉత్పత్తి రూ.37.5 లక్షల కోట్ల దాకా ఉంటుందని, కోటి మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే.. విపత్తు నష్టభయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం ఇటలీతో జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

Updated Date - 2021-09-16T08:32:09+05:30 IST