కేసీఆర్‌ విజన్‌తో తెలంగాణను సస్యశ్యామలం

ABN , First Publish Date - 2020-05-20T09:39:26+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని, రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్‌ విజన్‌తో తెలంగాణను సస్యశ్యామలం

రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


సంగెం, మే 19 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని, రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం బొల్లికుంట వద్ద గల దేవాదుల సౌత్‌ కెనాల్‌ ప్రధాన కాల్వను మంత్రితోపాటు ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, రమేష్‌లు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి కాల్వ వెంట పాదయాత్ర చేశారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆశాలపల్లి, రామచంద్రాపురం, గవిచర్ల  గ్రామాల్లోని చెరువులకు నీటిని తూముల  ద్వారా విడుదల  చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న అపర భగీరథుడు కేసీఆర్‌ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను మళ్లించి రాష్ట్రాన్ని ధాన్య బాంఢారంగా నిలుపుతున్నారన్నారు. దేవాదుల కెనాల్‌ ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కార్యక్రమంలో సంగెం ఎంపీపీ కళావతి, జడ్‌పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌ మార్కెట్‌  కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నరహరితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


దుక్కి దున్నిన మంత్రి, ఎమ్మెల్యే

దేవాదుల నీటిని బొల్లికుంట నుంచి విడుదల చేసిన అనంతరం గవిచర్ల గ్రామంలో దుక్కి దుక్కుతున్న రైతు నుంచి  కాడెద్దులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీసుకొని తాము సైతం రైతు బిడ్డలమే అంటూ దుక్కిదున్నారు. దేవాదుల నీటి ద్వారా ఈ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో ప్రభుత్వం సూచించిన పంటలను వేయాలని సూచించారు. 

Updated Date - 2020-05-20T09:39:26+05:30 IST