Abn logo
Jan 23 2021 @ 17:38PM

ఖతర్‌లో జగిత్యాల వాసికి తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ సాయం

దోహా: గత కొన్నేళ్లుగా జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం గంబీర్పూర్ గ్రామానికి చెందిన 54 ఏళ్ల మహమ్మద్ యూనిస్(చాచా) ఖతర్‌లో ఒక కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు ఆయన రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. దీంతో యూనిస్ కాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం క్రమ క్రమంగా మానక పోగా కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడి హమద్ హాస్పిటల్ అతని కాలు తీసేసి సర్జరీ ద్వారా ప్లాస్టిక్ కాలు అమర్చారు. కాగా, ఒక కాలితో పనిచేయలేని పరిస్థితి ఏర్పడడంతో కంపెనీ యూనిస్‌ను ఉద్యోగం నుంచి తొలగించి స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అతను సహాయం కోసం తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతర్‌ను సంప్రదించారు. 

అతని అభ్యర్థనకు స్పందించిన కార్యవర్గం యూనిస్ దుస్థితి వివరిస్తూ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతర్  సభ్యుల నుండి విరాళాలు సేకరించింది. దీంతో అతి తక్కువ సమయంలోనే దాదాపు లక్ష నలబై వేల రూపాయలు పోగు అయ్యాయి. ఈ మొత్తాన్ని ఉపాధ్యక్షులు గులాం రసూల్ మహమ్మద్ గురువారం యూనిస్‌కు అందజేశారు. అలాగే ఐసీబీఎఫ్ తరపున రజని మూర్తి కూడా 500 రియాళ్ళు ఇచ్చినట్లుగా ఖాజ నిజామోద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమములో టీడబ్ల్యూఏ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, సభ్యులు అబ్దుల్ ఖాదర్, ఇర్షాద్, సంపత్ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
Advertisement