US: అమెరికా వెళ్లి పట్టుమని 10 రోజులు కూడా గడవకముందే తెలుగు యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-09-02T13:15:47+05:30 IST

భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్నత విద్య అభ్యసించేందుకు తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు గుండె పోటుతో మరణించాడు.

US: అమెరికా వెళ్లి పట్టుమని 10 రోజులు కూడా గడవకముందే తెలుగు యువకుడు మృతి

ఆగస్టు 23న యూఎస్‌కు వెళ్లగా గుండెపోటుతో హఠాన్మరణం 

మంచిర్యాల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్నత విద్య అభ్యసించేందుకు తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు గుండె పోటుతో మరణించాడు. అమెరికా చేరుకుని పట్టుమని పది రోజులు కూడా పూర్తి కాకముందే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మంచిర్యాలలోని పాత మంచిర్యాల సబ్‌స్టేషన్‌ రోడ్డుకు చెందిన మల్క శరత్‌కుమార్‌ (26) బుధవారం తెల్లవారుజామున న్యూయార్క్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ఎంఎస్‌ చదివేందుకు ఆగస్టు 23న న్యూయార్క్‌కు వెళ్లిన శరత్‌కుమార్‌ తొలుత ఓ లాడ్జిలో బస చేశాడు. బయట వేరే గది దొరకడంతో మంగళవారం రాత్రి అక్కడికి మారాడు. ఆ గదిలో సామాను సర్దుకుంటున్న క్రమంలో శరత్‌ కుమార్‌కు గుండెపోటు రాగా, తోటి మిత్రులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. శరత్‌ మృతదేహాన్ని న్యూయార్క్‌లోని సెయింట్‌విన్సెంట్స్‌ మెడికల్‌ సెంటర్‌లో భద్రపరిచారు. ఈ మేరకు శరత్‌ తల్లిదండ్రులకు సమాచారం అందింది. శరత్‌కుమార్‌ తండ్రి మల్క తిరుపతి మంచిర్యాల ఏసీపీ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శరత్‌ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని తిరుపతి వేడుకొంటున్నారు.

Updated Date - 2022-09-02T13:15:47+05:30 IST