Abn logo
Feb 20 2020 @ 04:40AM

శాట్స్‌కు గ్రహణం

ఎండీ, పాలకమండలి ఊసేలేదు 

కునారిల్లుతున్న క్రీడా రంగం 

రూ. కోట్లలో స్పోర్ట్స్‌ స్కూళ్ల మెస్‌ బకాయిలు 

పైరవీలతో పోస్టింగ్‌లు


తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ (శాట్స్‌)కు గడ్డు రోజులు దాపురించాయి. దాదాపు రెండు నెలలుగా శాట్స్‌కు వైస్‌ చైర్మన్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌ (వీసీ-ఎండీ) లేకపోవడంతో పాలనావ్యవహారాలు గాడి తప్పాయి. దీనికి తోడు తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు శాట్స్‌కు చైర్మన్‌ మినహా సభ్యులను నియమించకపోవడంతో సంస్థలోని కొందరు పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని క్రీడా సంఘాలు విమర్శిస్తున్నాయి. వర్ధమాన క్రీడాకారులకు అండగా ఉంటామని తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే క్రీడాశాఖ, శాట్స్‌ పెద్దలు నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన నగదు ప్రోత్సాహకాలను కూడా ఇప్పించలేకపోతున్నారని ఆటగాళ్ల తల్లిదండ్రులు వాపోతున్నారు.


వేధిస్తున్న నిధుల కొరత

వాణిజ్య ప్రకటనలు, స్పాన్సర్‌షి్‌పలతో భారీ మొత్తంలో ఆర్జిస్తున్న స్టార్‌ క్రీడాకారులకు వెనకా ముందు ఆలోచించకుండా కోట్లు కుమ్మరించే ప్రభుత్వ పెద్దలు..వర్ధమాన క్రీడాకారుల విషయానికి వచ్చేసరికి నిధుల కొరత సాకుతో మొండి చెయ్యి చూపిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకోసం శాట్స్‌ బడ్జెట్‌లో కేటాయించే నిధులు లక్షల్లో ఉంటే స్టార్‌ క్రీడాకారులకు ప్రకటించే నజరానాలు కోట్లలో ఉండడం గమనార్హం. దీంతో యువ ప్లేయర్లకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ప్రోత్సాహకాల విషయాన్ని పక్కనపెడితే రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా శాట్స్‌ అందించలేకపోతోంది. విద్యార్థుల మెస్‌, మైదానాల నిర్వహణ (విద్యుత్‌, నీటి బిల్లులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు) బకాయిలే రూ. మూడు కోట్లకు పైగానే పేరుకుపోయినట్టు తెలుస్తోంది. కొన్ని స్కూళ్ల మెస్‌ బిల్లులు ఆగస్టు నుంచి పెండింగ్‌ ఉన్నట్టు సమాచారం. దాంతో వెంటనే బకాయిలు చెల్లించకపోతే మెస్‌లను మూసేస్తామని నిర్వాహకులు శాట్స్‌కు లేఖలు రాసినట్టు తెలుస్తోంది.  అదే జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్‌ స్కూళ్లు, అకాడమీల్లో ఉన్న దాదాపు 1200 మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడడం ఖాయం. ఇదిలావుంటే తమకు జీతాలు సరిగా అందడం లేదని, పీఎఫ్‌ జమ వివరాలు తెలియడంలేదని గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పోస్టింగ్‌ల కోసం పైరవీలు!

శాట్స్‌లో ఈ మధ్య జరిగిన డిప్యూటీ డైరెక్టర్ల నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. డీడీల పదోన్నతిపై ఆ శాఖలోని ఉద్యోగులే కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ కూడా మొదలైనట్టు తెలిసింది. సంబంధిత మంత్రి తన అనుయాయులకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడానికి విభాగాధిపతులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్టు సమాచారం. తాజాగా పశుసంవర్ధకశాఖకు చెందిన ఓ అధికారిని శాట్స్‌లోకి తెచ్చేందుకు మంత్రి ప్రయత్నించినట్టు చెబుతున్నారు. దాంతో ఆ ఒత్తిడి భరించలేక అదనపు వీసీ-ఎండీగా ఉన్న అధికారి వేరే విభాగానికి స్వయంగా బదిలీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, గతంలో శాట్స్‌ ఎండీగా పనిచేసి రిటైరైన అధికారి ఓఎ్‌సడీగా పోస్టింగ్‌ తెచ్చుకొనేందుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సంస్థలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఫైల్‌ ప్రస్తుతం సీఎం పేషీలో ఉన్నట్టు తెలుస్తోంది.


శాట్స్‌ ఎండీగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధికి ఎలాంటి చొరవా తీసుకోని ఆ అధికారి మరోసారి సంస్థలోకి అడుగుపెడితే క్రీడారంగం నష్ట పోతుందని క్రీడా సంఘాలు ఆందోళన వ్యక్తంజేస్తున్నాయి. పోస్టింగ్‌ల విషయాన్ని పక్కనపెడితే శాట్స్‌లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ పెద్దాయన ఆటగాళ్ల ఎంపికల్లో తరచూ తలదూరుస్తూ క్రీడా సంఘాలను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ సెలెక్షన్స్‌ జరిగినా తమ వారిని ఎంపిక చేయాలంటూ సదరు పెద్ద మనిషి నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయని క్రీడా సంఘాలు వాపోతున్నాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్పందించి శాట్స్‌ను చక్కదిద్దాలని క్రీడాకారులు మొర పెట్టుకుంటున్నారు.  

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌/వైఎంసీఏ)


పాలక మండలి ఊసేది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) పాలక మండలిలో చైర్మన్‌, ఎండీతో పాటు మేటి ఆటగాళ్లు గోపీచంద్‌, ముఖేష్‌ కుమార్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ మహ్మద్‌ ఆరిఫ్‌, అర్జున అవార్డీ ముళినీ రెడ్డి వంటి ప్రఖ్యాత క్రీడాకారులు సభ్యులుగా  ఉన్నారు. పాలక మండలిలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతుల గుర్తింపు, అకాడమీలు, స్టేడియాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిపై చర్చించి వాటి ఆచరణకు కృషి చేసేవారు. ప్రస్తుతం పాలక మండలి ఊసే లేకపోవడం, క్రీడలపై ఆసక్తి ఉన్న అధికారిని పూర్తిస్థాయి ఎండీగా నియమించకపోవడంతో శాట్స్‌ నామమాత్రంగా తయారైంది.

Advertisement
Advertisement
Advertisement