రోజూ వెయ్యిమందికి అన్నం పెడుతున్నాడు!

ABN , First Publish Date - 2020-06-15T05:30:00+05:30 IST

ఆయన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... కానీ అందరూ ప్రేమగా ‘అంబలి కోనప్ప’ అని పిలుస్తారు. అందుకు కారణం కుమరం భీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గంలో ఆయన 8 ఏళ్ల క్రితం అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం. కేవలం ఈ ప్రాంతవాసులకే కాకుండా హైదరాబాద్‌లో కూడా...

రోజూ వెయ్యిమందికి అన్నం పెడుతున్నాడు!

ఆయన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... కానీ అందరూ ప్రేమగా ‘అంబలి కోనప్ప’ అని పిలుస్తారు.  అందుకు కారణం కుమరం భీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గంలో ఆయన 8 ఏళ్ల క్రితం అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం. కేవలం ఈ ప్రాంతవాసులకే కాకుండా హైదరాబాద్‌లో కూడా పేరొందిన ఆస్పత్రుల ముందు అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తాజాగా ఆయన సిర్పూర్‌ నియోజకవర్గ వాసుల కోసం ఈ నెల 12 నుంచి కాగజ్‌నగర్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  తన సేవాకార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే... 


‘‘దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాకు ఆకలి బాధ ఏమిటో బాగా తెలుసు. పట్టెడు మెతుకుల కోసం ఐరన్‌ బెండింగ్‌ పని చేసి కుటుంబాన్ని పోషించుకున్న రోజులు నేనింకా మరచిపోలేదు. ఆకలితో ఉన్న వాడికి అన్నం విలువ తెలుస్తుందంటారు. ప్రతి రోజు మారుమూల పల్లెల నుంచి ఆస్పత్రులు, కార్యాలయాల పనుల కోసం పట్టణానికి వచ్చే నిరుపేదలు, రోజంతా తిండితిప్పలు మాని కష్టపడటం చూసి చలించి పోయేవాణ్ణి. ఆకలిని దగ్గరగా చూశాను కాబట్టే పేదల అవస్థలు గమనించి పట్టెడన్నం పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆకలితో ఉన్న వాళ్లకు పిడికెడు బువ్వ పెట్టి సేవ చేయడం కన్నా మించింది ఏముంటుంది? ఆ ఆలోచతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా జీవితంలో నాలుగు దశలుంటే 1-19 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక కూలీ పనులు చేసి సహాయం చేసేవాణ్ణి. 19-30 సంవత్సరాల మధ్య జీవితం కష్టాలను అధిగమించాలని నేర్పింది. 30-65 సంవత్సరాల మధ్య ఇటు రాజకీయం, అటు కుటుంబాన్ని పోషిస్తూనే పేదల దుస్థితిని దగ్గరగా గమనించా. అప్పుడే నిర్ణయించుకున్నా.. వారి ఆకలి బాధలను కొంతలో కొంతైనా నా వంతుగా తీర్చాలని. ఇక నా జీవితానికి లక్ష్యం అంటూ ఏర్పడింది 2014లోనే. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తుంటే సిర్పూర్‌లో మాత్రం బీఎస్పీ నుంచి నిలబడిన నన్ను ప్రజలు ఆదరించారు. ఆంధ్రావాడినంటూ ప్రత్యర్థులు గేలి చేస్తున్నా ఇక్కడి ప్రజలు నాపై ఉన్న ప్రేమతో గెలిపించటం జీవితంలో మరిచి పోలేని ఘటన. అప్పుడే నిర్ణయించుకున్నా. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని. నేను జీవించి ఉన్నంత కాలం వారికి సేవ చేయాలని అందుకే నా శక్తి మేరకు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందుకు నా కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు ఉంది. 




ఆస్తులన్నీ ట్రస్టుకే...

ప్రతీ రోజు పల్లెల నుంచి వందల సంఖ్యలో ప్రజలు కాగజ్‌నగర్‌కు వస్తుంటారు. ముఖ్యంగా ఆస్పత్రులకు వచ్చేవారు బయట ఆకలితో కడుపు మాడ్చుకొని పడిగాపులు కాస్తుంటారు. హోటళ్లలో తిందామంటే చేతులో చిల్లి గవ్వ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండటం నన్ను కదిలించింది. అందుకే ఎవరూ ఆకలితో కడుపు మాడ్చుకోకూడదని నిర్ణయించుకొని నిత్య అన్నదాన కార్యక్రమానికి (12వ తేదీ శనివారం నుంచి) శ్రీకారం చుట్టా. నిజానికి 2014 నుంచే నాకు ఈ ఆలోచన ఉంది. అప్పట్లో ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. ప్రస్తుతం నా నిర్ణయానికి దాతలు కూడా మద్దతు ప్రకటించి ముందుకు వచ్చారు. దీనికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయటం కోసం నాకున్న నాలుగు ఎకరాల పొలం, కౌటాలలోని ఇల్లు, కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డులో ఉన్న రూ.30లక్షల విలువైన స్థలం ట్రస్టుకు రాసి ఇచ్చా. వాటిని అమ్మగా వచ్చే డబ్బును డిపాజిట్‌ చేసి నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా డిపాజిట్‌ ద్వారా వచ్చే ఆదాయంతో కార్యక్రమం కొనసాగించేట్టు ప్రణాళికలు తయారు చేశా. ట్రస్టు చైర్మన్‌గా నా కుటుంబం నుంచి ఎవరూ ఉండకుండా చూడాలనుకుంటున్నాం. వివిధ పనుల కోసం కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాలకు వచ్చి వెళ్లే పేదలతో పాటు... ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి రామగిరి, సింగరేణి ప్యాసింజర్‌ రైళ్లలో దిగి వచ్చే కూలీలు బస్టాండ్‌లో గంటల కొద్ది వేచి చూస్తుంటారు. వీరంతా ఆకలితో బాధపడకుండా ఉండటం కోసం ప్రతీ రోజు వెయ్యి మందికి తగ్గకుండా భోజనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమాన్ని బస్టాండు సమీపంలోనే ఏర్పాటు చేయటం వెనుక కారణం ఉంది. ఎక్కువ మంది పేదలు బస్టాండు వద్దనే పడిగాపులు కాస్తుండడం ఒకటైతే ఆర్ట్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భోజనం కోసం వెళుతుంటారు. అలాంటి కాలయాపన జరగకుండా చూడడం కోసమే అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందికి ఐడీ కార్డులిస్తాం. వీరితో పాటు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులకు భోజనం ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రి యాజమాన్యం వారిని చేర్చుకోగానే భోజనం కోసం టోకెన్లు ఇస్తాం. ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ... ఆకలి విలువ తెలిసినవాడిగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి, పేదలకు పట్టెడన్నం పెట్టడం నా జీవితంలో మర్చిపోలేనిది’’.




అంబలితో ప్రాచుర్యంలోకి...

‘అంబలి కోనప్ప’గా ప్రాచుర్యంలోకి వచ్చిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సేవా ప్రస్తానాన్ని అంబలితో ప్రారంభించి క్రమక్రమంగా నిత్య అన్నదానం వంటి మహాత్కార్యం వరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. 2010లో ఆయన తన నివాసంలో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించి, ప్రతీ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మొదటి వారం వరకు రోజుకు 150 డబ్బాల చొప్పున 6వేల లీటర్లు పంపిణీ చేస్తారు. సిర్పూర్‌ నియోజక వర్గంతో పాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, నీలోఫర్‌ ఆస్పత్రుల్లోని రోగులకు వేసవిలో నాలుగు నెలలపాటు ప్రతీ రోజు 4 వేల లీటర్ల అంబలిని పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసి, సిర్పూర్‌, బెజ్జూరు, కౌటాల, దహెగాం మండలాల్లో 2750 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చుతున్నారు.


సామూహిక వివాహాలు జరిపించడంలో కూడా కోనప్ప తన ప్రత్యేకతను చాటుకున్నారు. వరుసగా మూడేళ్లలో 313 జంటలకు తన ఖర్చుతో సామూహిక వివాహాలు జరిపించి, అతిథులందరికీ భోజనాలు పెట్టించారు. అదేవిధంగా సిర్పూర్‌ నియోజకవర్గంలో రక్తహీనతతో బాధపడుతున్న ఆదివాసి, ఆదివాసియేతర గర్భిణులను గుర్తించిన కోనప్ప వారికి ప్రతి నెల రెండు కిలోల బెల్లం, రెండు కిలోల పల్లిపట్టి, రెండు కిలోల రాగిపిండి, అరకిలో నువ్వుల చొప్పున కిట్టును నాలుగు నెలలు పాటు కాన్పు జరిగేంత వరకు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 150 నుంచి 350 మంది వరకు కిట్లు పంపిణీ చేపట్టారు. ఇప్పటి వరకు 6500 మందికి రక్తహీనతతో బాధపడిన గర్భిణులు లబ్ధిపొందారు. వీటితో పాటు అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ కేవలం స్థానిక ఎమ్మెల్యేగానే ఉండకుండా, ఒక సేవామూర్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.


-సదానంద్‌ బెంబ్రే, ఆసిఫాబాద్‌

ఫొటోలు: ఉప్పుల తిరుమలచారి


Updated Date - 2020-06-15T05:30:00+05:30 IST